గడ్డపారలు, కర్రలతో కొట్టిన పెత్తందారులు
దెబ్బలకు కమిలిపోయిన చర్మం
గుడిపల్లి రిజర్వాయర్ వద్ద ఘటన
నవతెలంగాణ- మహబూబ్ నగర్ ప్రాంతీయ ప్రతినిధి
“మేం 30 ఏండ్లుగా చేపల వేటలో ఉంటూ మత్స్య సహకార సంఘంలో సభ్యత్వం కలిగి ఉన్నాం. చేపల వృత్తి తప్ప మాకు మరో ఉపాధి లేదు. మాకు తెలియకుండా కొందరు వలలు వేసి చేపలు పడుతున్నారు. మీరెందుకు పడుతున్నారని అడిగినందుకు గడ్డపారలు, కర్రలతో పెత్తందారులు మూకుమ్మడిగా దాడి చేశారు. కాళ్ల మీద పడి వేడుకున్నా వినలేదు. గొడ్డును బాదినట్టు బాదారు” అంటూ పలువురు మత్స్యకారులు కన్నీరుమున్నీరయ్యారు. ఒక బలమైన సామాజికవర్గం వారు తమపై దాడికి పాల్పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. నాగర్ కర్నూల్ జిల్లా గుడిపల్లి రిజర్వాయర్‌లో చేపల వేట విషయంలో ఆదివారం తీవ్ర ఘర్షణ చోటుచేసుకున్నది. గుడిపల్లి, గౌరీదేవిపల్లి గ్రామాలకు చెందిన మత్స్య సహకార సంఘం సభ్యులు గుడిపల్లి రిజర్వాయర్‌లో చేపలు పట్టే హక్కు కలిగి ఉన్నారు. అయితే రిజర్వాయర్‌కు పక్కనే ఉన్న నర్సాయిపల్లికి చెందిన కొందరు వ్యక్తులు అనధికారికంగా చేపలు పడుతున్నారు. ఈ విషయంలో ఇరు గ్రామాలకు చెందిన వాళ్ల మధ్య గొడవ జరిగి దాడికి దారితీసింది. గుడిపల్లి రిజర్వాయర్‌లో చేపలు పట్టేందుకు గుడిపల్లి, గౌరీదేవిపల్లి మత్స్య సహకార సంఘం ఏటా లక్షన్నర వరకు రుసుం చెల్లిస్తోంది. కానీ..! రిజర్వాయర్‌లో చేపలు పట్టేందుకు అవసరమైన రక్షణ లేదు. పోలీసులు, మత్స్యశాఖ అధికారులు కూడా పట్టించుకోకపోవడంతో నరసాయిపల్లికి చెందిన కొందరు వ్యక్తులు రిజర్వాయర్‌లో వలలు వేసి చేపల్ని పడుతున్నారు. ఈ విషయంపై గుడిపల్లి, గౌరీదేవిపల్లికి చెందిన మత్స్యకారులు వారిని ప్రశ్నించారు. దీంతో నర్సాయిపల్లికి చెందిన శరభంద మల్లయ్య, కురువ శ్రీశైలం, నాగ మల్లయ్య, నాగరాజు పిట్టల రామకృష్ణ, గొల్ల రామకృష్ణ, కురుమయ్య, కిష్టయ్య, మహేష్ తదితరులు 50 మంది మత్స్యకారులపై కలిసి దాడికి పాల్పడ్డారు.గడ్డపారలు,కర్రలతోవిచక్షణారహితంగా దాడి చేశారు. ఆ సమయంలో నర్సాయిపల్లి సర్పంచి అక్కడే ఉండి ప్రేక్షక పాత్ర పోషించారని బాధితులు వాపోయారు. ఈ ఘటనలో మత్స్య సహకార సంఘం జిల్లా కార్యదర్శి రామకృష్ణ, అజ్మీర్, కృష్ణ, పర్వతాలు, జయరాములు, సదానంద్, కురుమయ్య, బాలచందర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. బలమైన సామాజిక వర్గం అండ చూసుకునే తమపై దాడికి పాల్పడినట్టు మత్స్య కార్మికులు ఆరోపించారు. ప్రతిఏటా డబ్బులు చెలించి చట్టబద్దంగా లీజు ఒప్పందం చేసుకుంటున్నామనీ, ఎలాంటి హక్కుల్లేని వ్యక్తులు దొంగచాటుగా రిజర్వాయర్‌లో చేపలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
చేపల వృత్తి చేసుకోవడం నేరమా
జయ రాములు, మత్స్య సహకార సంఘం అధ్యక్షులు గుడిపల్లి,
నాగర్ కర్నూల్ మండలం
మేం 30 ఏండ్లుగా చేపలవృత్తే జీవనాధారంగా జీవిస్తున్నాం. గుడిపల్లి, గౌరిదేవిపల్లి గ్రామాలలో మత్స్య కార్మిక సహకార సంఘం ఉంది. ఈ చెరువుల ఆధారంగా 500 మంది జీవనోపాధి పొందుతున్నారు. చేపల వృత్తి చేయడం నేరమా.?
మేం ఎలా బతకాలి
రామకృష్ణ, మత్స్య కార్మికుడు, గౌరిదేవుపల్లి
రెండు రెక్కలతో కష్టం చేసుకునే నిరుపేదలం. పొద్దున పోయి చేపల వృత్తి చేసుకొని మార్కెట్‌కెళ్ళి అమ్ముకుంటే వచ్చే డబ్బులతోనే మా జీవనం సాగుతుంది. మా వృత్తికి ఆటంకం కలిగిస్తూ ‘మీరెందుకు వలలు వేశారని అడిగినందుకు రక్తం చిందేలా కొట్టారు’.
మా గ్రామ భూములు మునిగినందుకే
రాములు సర్పంచ్ నర్సాయిపల్లి, నాగర్ కర్నూల్ మండలం
గుడిపల్లి రిజర్వాయర్ లో మా ఊరికి చెందిన అనేక మంది రైతుల భూములు మునిగాయి. రైతులంతా ఉపాధి కోల్పోయారు. అందుకే చేపల వేట ద్వారా ఉపాధి పొందాలనుకున్నారు. ఈ గొడవ గత పదేండ్లుగా జరుగుతుంది. శాంతియుతంగా సమస్యను పరిష్కరించుకోవాలని చెప్పాం. అయినా ఇరు గ్రూపులు వినలేదు.
ఫిర్యాదు మేరకు కేసు నమోదు
గోవర్ధన్ ఎస్‌ఐ నాగర్ కర్నూల్
సమాచారం అందిన వెంటనే సంఘటనా స్థలానికి వెళ్లాం. గాయపడిన క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాం. ఎవరు ఎలాంటి ఘటనలకు పాల్పడకుండా బందోబస్తు పెట్టాం.
మత్స్య కారులపై దాడి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



