పరస్పర ఆరోపణలతో వేడెక్కుతున్న వాతావరణం
నవతెలంగాణ-జనరల్ డెస్క్
పశ్చిమాసియాలో మరోమారు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ‘ఆత్మరక్షణ’ పేరుతో ఇరాన్ రాడార్, కమాండ్ కంట్రోల్ కేంద్రాలపై అమెరికా దాడులు చేసింది. అంతర్జాతీయ జలాలలో పనిచేస్తున్న ఎంక్యూ`1 డ్రోన్‌ను ఇరాన్ కూల్చివేసిందని, టెహ్రాన్ దుందుడుకు చర్యలకు ప్రతిగానే ఈ దాడులు చేశానని అమెరికా సమర్ధించుకుంది. ‘ఇరాన్ గగనతల రక్షణ వ్యవస్థలను, గ్రౌండ్ కంట్రోల్ స్టేషన్‌ను, రెండు డ్రోన్లను అమెరికా యుద్ధ విమానం ధ్వంసం చేసింది’ అని సెంట్రల్ కమాండ్ తెలిపింది. ఇదిలావుండగా ఇరాన్‌లోని సిరిక్ దీవిలో ఉన్న టెలీకమ్యూనికేషన్ టవర్‌పై దాడి చేసేందుకు ఉపయోగించిన అమెరికా వైమానిక స్థావరాన్ని ధ్వంసం చేశామని ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (ఐఆర్‌జీసీ) తెలియజేసింది. అమెరికా వైమానిక స్థావరం ఉన్న కువైట్‌పై కూడా క్షిపణి, డ్రోన్ దాడులు జరిగాయి. దీంతో ఆ దేశం తన గగనతల రక్షణ వ్యవస్థలను క్రియాశీలకం చేసింది. ఏప్రిల్‌లో కాల్పుల విరమణ అమలులోకి వచ్చిన తర్వాత అమెరికా, ఇరాన్ మధ్య అడపాదడపా పోరు జరుగుతూనే ఉన్న విషయం తెలిసిందే.
ఎంఓయూలో ట్రంప్ మార్పులు
మరోవైపు అమెరికా‘ఇరాన్ మధ్య అవగాహనా ఒప్పం దం (ఎంఓయూ)పై చర్చలు కొనసాగుతున్నాయి. ప్రతిపాదిత ఎంఓయూకు కొన్ని మార్పులు సూచిస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దానిని తిప్పిపంపారు. మధ్యప్రాచ్యంలో కాల్పుల విరమణను కొనసాగించాలని, హార్ముజ్ జలసంధిని తిరిగి తెరవాలని ఎంఓయూలో ప్రతిపాదించారు. తాజా దాడులను అమెరికా సెంట్రల్ కమాండ్ ధృవీకరించిన తర్వాత ట్రంప్ తన సామాజిక మాధ్యమ వేదిక ట్రూత్ సోషల్‌లో ఓ పోస్ట్ పెడుతూ ‘నిజంగా ఒప్పందం కుదుర్చుకోవాలని ఇరాన్ అనుకుంటే అది అమెరికాకు, మాతో ఉన్న వారికి మంచి చేసేదిగా ఉండాలి’ అని వ్యాఖ్యానించారు. చర్చలపై ప్రతికూల విమర్శలు చేస్తున్న వారిపై ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘మీరు హాయిగా కూర్చోండి. విశ్రాంతి తీసుకోండి. చివరికి అంతా మంచే జరుగుతుంది. ఎప్పుడూ అలాగే జరుగుతుంది’ అని తెలిపారు. కాగా ఎఎంఓయూలో ట్రంప్ సూచించిన మార్పులేమిటో తెలియరాలేదు. అయితే ఇరాన్ అణు కార్యక్రమం పైన, హార్ముజ్ జలసంధిని తిరిగి తెరవడం పైన ఆయన కఠిన వైఖరితో ఉన్నారని అధికారులు చెప్పారు. ఒప్పందంలో భాగంగా ఇరాన్‌కు ఎలాంటి ఆర్థిక వెసులుబాట్లు ఇవ్వాలనే విషయంపై కూడా ట్రంప్ ఆలోచిస్తున్నారని వారు తెలిపారు.
చమురు ధరలు పైపైకి
ఇరాన్ – అమెరికా దళాల మధ్య తిరిగి పోరు ప్రారంభమైన నేపథ్యంలో చమురు ధరలు సోమవారం మూడు శాతం పెరిగాయి. ఉద్రిక్తతలకు ఆజ్యం పోస్తూ లెబనాన్‌పై దాడులను ముమ్మరం చేసి ఆ దేశంలోకి చొచ్చుకుపోవాలని తన దళాలను ఇజ్రాయిల్ ఆదేశించింది.
హక్కుల రక్షణే ముఖ్యం : ఇరాన్
టెహ్రాన్ హక్కులకు రక్షణ కల్పించని పక్షంలో అమెరికాతో ఒప్పందం కుదుర్చుకునే ప్రశ్నే లేదని ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మహమ్మద్ బాఘర్ ఘలీబఫ్ స్పష్టం చేశారు. ‘శత్రువు మాటలు, హామీలపై దౌత్య యుద్ధభూమిలోని సైనికులకు విశ్వాసం లేదు. ప్రత్యక్షంగా చేకూరే ప్రయోజనాలే మాకు ముఖ్యం’ అని చెప్పారు. కాగా సంప్రదింపులపై అమెరికా తన వైఖరిని తరచూ మారుస్తోందని ఇరాన్ విదేశాంగ ప్రతినిధి ఇస్మాయిల్ బాఘై విమర్శించారు. అమెరికా దుందుడుకు చర్యలను ఆయన ఖండించారు. పరస్పర విరుద్ధ సంకేతాలు పంపడం సంప్రదింపుల వ్యూహం కాబోదని అంటూ వీలైనంత త్వరగా స్పష్టమైన, నిర్ణయాత్మకమైన వైఖరి తీసుకోవాలని సూచించారు. ‘తీవ్రమైన అవమానం, అపనమ్మకం మధ్య చర్చలు మొదలయ్యాయి. ఆ వాతావరణంలోనే సందేశాలను ఇచ్చిపుచ్చుకోవడం జరుగుతోంది’ అని అన్నారు. అవతలి పక్షం నిరంతరం తన అభిప్రాయాలను మారుస్తుండడమో లేదా సరికొత్త డిమాండ్లను తెర పైకి తెవడమో జరుగుతోందని విమర్శించారు. దీంతో చర్చలను పొడిగించాల్సి వస్తోందని చెప్పారు. లెబనాన్‌లో సహా మధ్యప్రాచ్యంలో ఇజ్రాయిల్ చర్యలను అమెరికా చర్యల నుంచి విడదీయరాదని ఇరాన్ భావిస్తోందని తెలిపారు.


