Sunday, July 26, 2026
E-PAPER
Homeదర్వాజరసరమ్య కథాపుస్తకం - రంగు పూల వాగు

రసరమ్య కథాపుస్తకం – రంగు పూల వాగు

- Advertisement -

కె. శివారెడ్డి అన్నట్టు
“భాష ఒక మట్టి.
పిల్లలాడుకునే ఒక క్లే.
దాన్నుంచి ఎన్ని బొమ్మలైనా నిర్మించవచ్చు.
చిద్రం చేసి మళ్ళా కొత్త బొమ్మలు నిర్మించవచ్చు”
భాష సజీవంగా ఉంటుంది. దానిని వినిర్మాణం చేసి నిర్మాణం తిరిగి చేయవచ్చు…


భాషకు సజీవత్వం సాహిత్యం ద్వారానే వస్తుంది. ఆధునిక కల్పనా సాహిత్యంలన్నిటిలో కథ ప్రముఖ స్థానాన్ని అలంకరించుకుంది. సహజం అనిపించే అసహజం కథ. కథ అనేది ఒక అల లాంటిది, అది క్షణికమైనా దానికుండే శక్తి సామర్థ్యాలు విలువైనవి. హఠాత్తుగా ప్రారంభమై, హఠాత్తుగా అంతమవుతుంది. “A short story clears with a single character or a single event on a single emotion ” అంటారు -BRANDE MATTEWS.. పిల్లలతో మాట్లాడకపోవటం పెద్ద తప్పు కాదు గాని, అంతకంటే దురదృష్టకరమైన విషయం మరొకటి లేదు. బాల సాహిత్యంలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్న బాల కథా రచయితలలో పుప్పాల కృష్ణమూర్తి ఒకరు. వారిది నిత్య నూతన నిర్మాణం. ప్రతిక్షణం పనిచేయటమే ఒక సృజన, అలాంటి సృజనావేశం ఉన్న రచయితలలో పుప్పాల కృష్ణమూర్తి ఒకరు. వారిది చిటికెన వేలా? చూపుడువేలా? అనేది ముఖ్యం కాదు.. భవిష్యత్ తరాలకు దారిచూపించే వేలు. తరాలు తయారు చేయడం అంటే తమాషా కాదంటారు గుంటూరు శేషేంద్ర శర్మ. పుప్పాల కృష్ణమూర్తి తన బాల సాహిత్యం తోనే భవిష్యత్ తరాలపై ప్రగాఢ ముద్ర వేస్తారు. వారి కలం నుంచి జాలువారిన కథా జల్లు రంగు పూల వాగు.
“తుంటరి కోతికి వచ్చినతంట” అనే కథలో పరిసరాలు వర్ణించిన విధానం అమితంగా ఆ కట్టుకుంటుంది.

వారు వర్ణించిన విధానం చూస్తుంటే పిల్లల సృజన స్థాయిని పెంచినట్టు, ఇమేజినేషన్ పవర్ పెంచుతున్నట్టుగా ఉంటుంది. పాత్రల విస్తృతి లేకుండా ప్రతి అంశము ప్రధానంగాను ప్రయోజనాత్మకంగానూ ఉంటుంది. ఈ కథలో సంక్షిప్తత ప్రధాన భూమికను పోషిస్తుంది.ఒకే అంశం లక్ష్యంగా ఉండి మొదటి నుంచి చివరి దాకా ఒకే ప్రదానాంశంగా కొనసాగుతుంది. ఈ కథలో పాత్రల మధ్య సంవాద చాతుర్యం ఈ కథకు మరింత బలం చేకూర్చింది. పాఠకుడి పై ప్రగాఢ ముద్ర వేసి వికాసానికి వివరణకి తోడ్పడినట్టుగా ఉంటుంది. ఇటు పాఠకుడిలో, అటు రచయితలో ఒకే భావం కదలాడుతుంది. స్వయం సమగ్రత ఈ కథలో మరింత బలాన్ని చేకూర్చింది. ఈ కథ విద్యార్థులలో కుసంస్కారాలు తొలగించి, వివేకవంతుని చేస్తుంది, సంస్కరిస్తుంది. విద్యార్థుల్లో ఓర్పు నేర్పించి ఉదాత్తమైన తీర్పునిస్తుంది. నేడు నాలుగు గోడల మధ్య రెండు అట్టముక్కల మధ్య నలుగుతున్న బాల్యాన్ని తొలగించి వారి మనోఫలకాలపై సద్బుద్ధిని లిఖిస్తుంది. మీడియా మోజులో పడి ఇంగ్లీష్ మీడియం క్రేజీ పెరిగి విద్యార్థులు స్వచ్ఛమైన ఆనందాన్ని కోల్పోతున్నారు. వారందరిని ఆకట్టుకునే కథలు ఈ పుస్తకం నిండా ఉంటాయి. పాత్రల మధ్య భావావేశం ప్రదర్శిస్తూనే సృజనావేశం తగ్గకుండా ఉంటుంది. కోతి, కుక్కల మధ్య వైరాన్ని అక్షరబద్ధం చేసిన తీరు చూస్తుంటే ఈ కధారచయిత అసామాన్య రచయితలా కనపడతాడు.

“పరుల కోసం….” అనే కథలో మానవత్వ ఆనవాళ్లు వెతికి పట్టమంటాడు ఈ కథా రచయిత. ఈ కథ అసాంతం కనుమరుగవుతున్న మనిషి జాడను వెతుకుతున్నట్టుగా ఉంటుంది. పల్లెటూరులో కుల పట్టింపు లేని అనుబంధాలను అక్షర బంధంతో మన ముందు ఉంచుతాడు. పరుల కోసం బతకడమే అసలైన మానవత్వం అని రాఘవయ్య పాత్ర ద్వారా ఈ ప్రపంచానికి తెలియజేస్తాడు. ఈ కథ చక్కని సంక్షిప్తత కలిగి ఉంటుంది. కొద్దిపాటి సంవాద చాతుర్యం ఉన్న అది కూడా మనసుకు హత్తుకునేలా ఉంటుంది. ఈ కథకు మరో లక్షణం ప్రభావాన్వితి. ఈ కథ పాఠకుల హృదయాలపై బలమైన ముద్రనే వేస్తుంది అని ఖచ్చితంగా చెప్పవచ్చు. ప్రతి పాత్ర చక్కని కొలమానం కలిగి ఉంటుంది… నిండైన నిర్భరత కలిగి పాఠకుడిని ఇట్టే ఆకట్టుకుంటుంది.. డాడీ లకు దూరమై డాలర్లకు దగ్గరవుతున్న పరిస్థితిని గురించి హెచ్చరిస్తుంది. భారతీయ ధర్మబద్ధమైన జీవన విధానాన్ని అణువణువునా అక్షరబద్ధం చేస్తున్న ఈ కథా రచయిత తక్కువ నిడివితో నిండైన పరిపక్వతతో రచించడం ఈ కథా రచయితను బలమైన కధారచయితగా మన ముందు నిలబెడుతుంది. “సంతలో చంటోడు” ‘అనే కథలో అంబపాలెం అనే గ్రామీణ నేపథ్యం తో సాగుతుంది ఈ కథ కూడా పిల్లల్లో ఉన్న సృజన, సందర్భోచిత వాక్చాతుర్యం, ఈ రెండిటికి మించి సమాజంలో ఉండే మోసగాళ్ల నుండి తనను తాను కాపాడుకునే విధానం చక్కగా ఉంటుంది.

ఈ కథలో ప్రతి పాత్ర చక్కని నిడివి ని కలిగి ఉండటం ఈ కథకు నిజమైన బలం. ఈ కథలో సంవాద చాతుర్యం బలంగా పండుతుంది. ఈ కథ పాఠకుడిని రచయితకు మరింత దగ్గర చేస్తుంది. చక్కని నిర్భరత కలిగి ఒకే అంశ లక్ష్యంగా కొనసాగుతుంది. పాఠకుల మూర్తిమత్వంపై బలమైన ముద్రనే వేస్తుంది. ఈ కథలో పదాలు చిత్రాలుగా కళ్ళ ముందే కదలాడుతుంది. చక్కని పోషణ కలిగి బుద్ధి బలాన్ని పెంచుతుంది. ప్రతి కథ నిండైన విలువలతో సమాజాన్ని సంస్కరిస్తున్నట్టుగానే ఉంటుంది. సెల్ ఫోన్ యుగంలో సెల్ఫ్ రీడింగ్ పెంచే ఇలాంటి కథలు పాఠ్యపుస్తకాల్లో బోధిస్తే విలువలతో కూడిన విద్యను ప్రత్యేకంగా బోధించాల్సిన అవసరం ఉండదు. “వ్యాపార సూత్రం” అనే కథ ఆద్యంతం ఆకట్టుకుంటుంది. ఈ కథలో విలువల ఆవశ్యకతను వ్యాపార సూత్రమును, మాట్లాడే ప్రతి మాట యొక్క గొప్పదనాన్ని తెలియజెప్పే కథ. ఈ కథలో మూడు పాత్రలతో చెప్పదలుచుకున్న విషయాన్ని కధాత్మకంగా చెబుతాడు ఈ కథ రచయిత. అమ్మటానికి వస్తువులు ఉంటే సరిపోదు విలువలు ఉండాలని, వినయం ఉండాలని వాటిని వ్యాపారత్మకంగా మలుచుకొని మానవీయ కోణాన్ని ఆవిష్కరించాలంటారు.

ప్రతి మాటపై పొదుపు, బుద్ధిపై అదుపు ఉండాలని తెలియజెప్పే కథ. మార్కెట్ పరిస్థితులను కనిపెట్టి వ్యాపారం చేస్తున్నావ్ సరే, మనుషుల తత్వం కనిపెట్టి కూడా వ్యాపారం చేయాలి అని చెప్పే వాక్యాలు వింటుంటే హృదయానందంగా ఉండి, విశాల తత్వాన్ని పెంచి, వ్యాపారాత్మకత సూత్రాన్ని గుట్టు విప్పినట్టుగా అనిపిస్తుంది. కిరాణ షాపులు నేడు విస్తరించి సూపర్ మార్కెట్లుగా, సూపర్ మార్కెట్లు విస్తరించి డి మార్ట్ గా, ఆన్లైన్ బిజినెస్లుగా నేటి రోజులలో విస్తరించిన మూల సూత్రాన్ని గుట్టు విప్పే కథ. గతంలో బాలల కోసం 15 పుస్తకాలను వెలువరించిన ఈ రచయిత, బాలసాహిత్యాన్నే శ్వాసగా కలాన్ని కదం తొక్కిస్తున్నాడు. “రంగు పూల వాగు” కథా పుస్తకంలో ఉన్న 19 కథలు అత్యంత ఆసక్తిగా కొన సాగుతాయి. ఈ కథా పుస్తకానికి పరిపక్వత నిండిన పదాలతో, పదునుగా ఉన్న వాక్యాలతో ముందుమాట రాసిన శిరంశెట్టి కాంతారావు మరింత ఆకర్షణ తీసుకొచ్చారు. ఈ రచయిత కథా ప్రపంచం గురించి తెలకపల్లి రవి, పి చంద్రశేఖర్ ఆజాద్, వి ఆర్ రాసాని, బాలోత్సవ్ రమేష్ బాబు చెప్పిన మాటలు ఈ పుస్తకానికి మరింత శోభను ఇచ్చాయి. ఆకర్షణీయమైన ముఖచిత్రాన్ని చిత్రించిన వారు కంచర్ల రామాచారి. ఈ పుస్తకానికి ఇన్నర్ ఆర్ట్ భాస్కరన్ కిషోర్, ఇన్నర్ హార్ట్ కు హత్తుకునేలా చిత్రించినారు. ప్రతి అక్షరంలో అమృతానందాన్ని, ప్రతి మాటలో మమకారాన్ని, ప్రతి వాక్యంలో వాయిద్య స్వరాలని పలికించిన “రంగు పూల వాగు ” ప్రతి ఒక్కరికి హృదయాంతరాళాలలో ఉండవలసిన కథాగుచ్చం.

సాదె. సురేష్, 9441692519

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -