ఆదివాసీ గ్రామాల అభివృద్ధికి
తొలగిన అటవీ శాఖ అడ్డంకులు
ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ హామీతో
నిరవధిక దీక్షలు విరమణ
కలెక్టర్, అటవీ శాఖ అధికారుల సమక్షంలో చర్చలు
ఆదివాసీ గ్రామాల అభివృద్ధి అనుమతులకు అటవీ శాఖ అధికారుల హామీలు
నవతెలంగాణ-పెంబి
నిర్మల్ జిల్లా పెంబి మండలంలోని గుమేనా ఇంగ్లాపూర్, చాకిరేవ్, రవీగూడ, గుమేనా కొత్తగూడ గ్రామాల అభివృద్ధికి ఆటంకంగా ఉన్న అటవీ శాఖ ఆంక్షలను తొలగించి, పెండింగ్‌లో ఉన్న అనుమతులను తక్షణమే మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో పెంబి అటవీ శాఖ రేంజ్ అధికారి(ఎఫ్‌ఆర్‌ఓ) కార్యాలయం ఎదుట చేపట్టిన నిరవధిక దీక్షలు శుక్రవారం ముగిశాయి. 13వ రోజు దీక్షా శిబిరాన్ని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ సందర్శించి ఆదివాసీ గిరిజన గ్రామాల ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. అనంతరం ఉద్యమ నాయకులను వెంటబెట్టుకొని నిర్మల్ జిల్లా కలెక్టర్ కార్యాలయానికి వెళ్లి.. కలెక్టర్, జిల్లా అటవీ శాఖ అధికారి(డీఎఫ్‌ఓ)తో ఉమ్మడి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆదివాసీ గ్రామాల అభివృద్ధి సమస్యలపై చర్చించారు. దశాబ్దాలుగా మౌలిక సదుపాయాలకు నోచుకోని గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలకు అటవీ శాఖ అనుమతుల పేరుతో అడ్డంకులు సృష్టించకుండా అవసరమైన అన్ని అనుమతులు మంజూరు చేస్తామని అధికారులు నాయకులకు హామీ ఇచ్చారు.
గుమేనా ఇంగ్లాపూర్ గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు, త్రీఫేజ్ విద్యుత్ లైన్, రహదారి, దోతి వాగుపై వంతెన నిర్మాణం, బావులు, బోర్‌వెల్స్ ఏర్పాటుకు సంబంధించిన అనుమతులను వెంటనే మంజూరు చేయాలని ఎమ్మెల్యే అధికారులను కోరగా అధికారులు సానుకూలంగా స్పందించారు. అదేవిధంగా చాకిరేవ్, రవీగూడ, గుమేనా కొత్తగూడ గ్రామాల్లో ఇందిరమ్మ ఇండ్లు, విద్యుత్ సౌకర్యాలు, సీసీ రోడ్లు, గ్రామ రహదారులు, బోర్‌వెల్స్ ఏర్పాటుకు అవసరమైన అనుమతు లను తక్షణమే మంజూరు చేయనున్నట్టు హామీ ఇచ్చారు. ఇందిరమ్మ ఇండ్ల పథకం, విద్యుత్ సౌకర్యాలు, రహదారులు, వంతెనలు, తాగునీటి వసతులు, సాగునీటి కోసం బావులు, బోర్‌వెల్స్ తవ్వకం వంటి అభివృద్ధి కార్యక్రమాలకు ఇకపై అటవీ శాఖ అడ్డంకులు ఉండబోవని స్పష్టం చేశారు. అధికారుల హామీతో సంతృప్తి చెందిన ఉద్యమకారులు ఎమ్మెల్యే బొజ్జు పటేల్ సమక్షంలో నిరవధిక దీక్షలను విరమించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు నూతన్‌కుమార్, జిల్లా కమిటీ సభ్యులు ఫసీయుద్దీన్, సర్పంచ్ అర్జున్, ఉపసర్పంచ్ పగ్గు, పెంబి మండల నాయకులు ఆత్రం బాపురావు, నిర్మల, లక్ష్మణ్, గ్రామ నాయకులు, కార్యకర్తలు, ఆదివాసులు పాల్గొన్నారు.
ఫలించిన సీపీఐ(ఎం) పోరాటం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



