Saturday, June 6, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంచిత్రహింసలకు ఆధారాల్లేవు

చిత్రహింసలకు ఆధారాల్లేవు

- Advertisement -
పిటిషన్‌ అభ్యర్థనను తిరస్కరించిన హైకోర్టు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్ 
ఒక కేసులో నిందితురాలిగా ఉన్న తనను పోలీసులు చిత్రహింసలకు గురి చేశారనీ, సిట్‌తో దర్యాప్తు చేయించి, రూ.50 లక్షల పరిహారం ఇప్పించాలన్న మహిళ అభ్యర్థనను హైకోర్టు తిరస్కరించింది. మేజిస్ట్రేట్‌ డాకెట్‌ ఉత్తర్వుల ప్రకారం పోలీసులు చిత్రహింసలకు గురి చేసినట్టు పిటిషనర్‌ చెప్పలేదనీ, అలాంటప్పుడు చిత్ర హింసలకు ఆధారాల్లేవని తేల్చి చెప్పింది.  దర్యాప్తు నిమిత్తం ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌)ను ఏర్పాటు చేయాలన్న మహిళ అభ్యర్థనను హైకోర్టు తిరస్కరించింది. జూబ్లీహిల్స్‌ పోలీసు స్టేషన్‌లో నమోదైన ఓ కేసులో పోలీసులు నిర్బంధంలో చిత్రహింసలకు గురి చేశారనీ, దీనిపై సీబీఐ, సిట్‌లతో దర్యాప్తు చేయించాలనీ, సీసీటీవీ ఫుటేజీ భద్రపరచేలా ఆదేశాలు జారీ చేయాలంటూ కోడూరి మీనాకుమారి హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్‌ జి.ఎం.మొహియుద్దీన్‌ ఇటీవల విచారణ చేపట్టారు. పిటిషనర్‌ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ ఫిర్యాదుదారు ప్రోత్సాహంతో పోలీసులు చిత్రహింసలకు గురి చేశారని ఆరోపించారు. రూ.50 లక్షల పరిహారం ఇప్పించాలనీ, సిట్‌తో దర్యాప్తు జరిపించాలని కోరారు. హోంశాఖ తరఫున ప్రభుత్వ న్యాయవాది వాదనలు వినిపిస్తూ పిటిషనర్‌ను మేజిస్ట్రేట్‌ ముందు హాజరు పరిచినపుడు పోలీసులు హింసకు గురి చేయలేదని చెప్పారనీ, ఇదే విషయాన్ని మేజిస్ట్రేట్‌ డాకెట్‌ ఉత్తర్వుల్లో నమోదు చేశారన్నారు. దీనికి విరుద్ధంగా ఇక్కడ వచ్చి చిత్రహింసలు పెట్టారని ఆరోపించడం సరి కాదన్నారు.

 వాదనలను విన్న న్యాయమూర్తి పిటిషనర్‌ ఆరోపణలకు ఆధారాల్లేవనీ, మేజిస్ట్రేట్‌ డాకెట్‌ ఆర్డర్‌ ప్రకారం పోలీసులు చిత్రహింసలకు గురిచేసినట్లు పిటిషనర్‌ చెప్పలేదన్నారు. అందువల్ల పిటిషనర్‌ కోరిన సిట్‌ ఏర్పాటు, ఫుటేజీని భద్రపరచాలన్న ఆదేశాలివ్వలేమంటూ పిటిషన్‌ను కొట్టివేస్తూ ఉత్తర్వులు జారీచేశారు.​గాదె ఇన్నయ్యకు మధ్యంతర బెయిలు ఎన్ఐఏ కేసులో అరెస్టయిన గాదె ఇన్నయ్యకు వైద్య చికిత్స నిమిత్తం రెండు నెలల మధ్యంతర బెయిలు మంజూరు చేస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. వైద్య చికిత్స నిమిత్తం మధ్యంతర బెయిలు మంజూరు చేయాలంటూ గాదె ఇన్నయ్య హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్‌ నగేశ్‌ భీమపాక, జస్టిస్‌ వాకిటి రామకృష్ణారెడ్డిలతో కూడిన ధర్మాసనం ఇటీవల విచారణ చేపట్టి జైలులో ఫిజియోథెరఫీ సౌకర్యం లేకపోవడంతో షరతులతో రెండు నెలల బెయిలు మంజూరు చేసింది. ఈ నెల 5 నుంచి ఆగస్టు 4వ తేదీ వరకు మధ్యంతర బెయిలు మంజూరు చేస్తూ కూకట్‌పల్లిలోని కుమార్తె ఇంటిలో ఉండాలని తెలిపింది. కుమార్తె, అల్లుడు, మరో ముగ్గురు సోదరీమణులకు మాత్రమే ఇన్నయ్యతో ఉండటానికి అనుమతించింది. దర్యాప్తులో ఎవరూ జోక్యం చేసుకోరాదని స్పష్టం చేసింది. ఇన్నయ్య కదలికలపై నిఘా ఉంచడానికి స్థానిక పోలీసు స్టేషన్‌ నుంచి ఇద్దరు పోలీసులను ఇంటి దగ్గర ఉంచాలని దర్యాప్తు అధికారికి ఆదేశించింది. షరతులు ఉల్లంఘిస్తే బెయిలు ఉపసంహరణ కోరవచ్చని పేర్కొంది. ఆగస్టు 5వ తేదీన జైలు సూపరింటెండెంట్‌ ముందు లొంగిపోవాలని ఆదేశించింది.
- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -