నవతెలంగాణ – హైదరాబాద్ : ఇథియోపియాలోని ఉత్తర అమ్హారా రీజియన్‌లో సోమవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ప్రయాణికులతో కిక్కిరిసి ఉన్న ఒక బస్సు.. ప్రమాదకరమైన ఘాట్ రోడ్డుపై నియంత్రణ కోల్పోయి సుమారు 100 మీటర్ల యలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో కనీసం 31 మంది ప్రయాణికులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, డజన్ల కొద్దీ ప్రజలు తీవ్రంగా గాయపడ్డారు. మృతులలో బస్సు డ్రైవర్ కూడా ఉన్నట్లు పోలీసులు ధ్రువీకరించారు.
ఈ బస్సు డెస్సీ ప్రాంతం నుంచి రాజధాని అడిస్ అబాబాకు వెళ్తుండగా కొంబోల్చా పరిధిలోని కొండ ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో పరిమితికి మించి ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. ప్రమాద తీవ్రతకు బస్సు పూర్తిగా నలిగిపోయింది. సమాచారం అందుకున్న వెంటనే రక్షణ సిబ్బంది రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టారు. శవాల దిబ్బగా మారిన ఆ లోయ నుంచి మృతదేహాలను బయటకు తీశారు. తీవ్రంగా గాయపడిన 33 మందిని చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రులకు తరలించారు. క్షతగాత్రులలో కొందరి పరిస్థితి విషమంగా ఉండటంతో మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని వైద్యులు తెలిపారు.



