యువతరం తలచుకుంటే ఏదైనా సాధ్యం అనే విషయం అందరికీ తెలిసిందే. ఇందుకు నిదర్శనమే కేరళ మారుమూల ప్రాంత రైతులతో పని చేస్తున్న గ్రామ్య. కేరళలోని ఇడుక్కి కేంద్రంగా అను సన్నీ అనే యువతి స్థాపించిన సామాజిక సంస్థనే గ్రామ్య. గ్రామీణ రైతులకు దేశీయ సుగంధ ద్రవ్యాలకు విలువను జోడించడంలో, మెరుగైన మార్కెట్లను పొందడంలో సహాయపడటం ద్వారా సుస్థిర వ్యవసాయం లాభదాయకంగా ఉంటుందని ఈ సంస్థ నిరూపించింది. మరీ ముఖ్యంగా గ్రామీణ మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పిస్తూ, వ్యవసాయం దండగ కాదు పండగ అని మరోసారి రుజువు చేసింది.
అను సన్నీ.. కేరళలోని ఇడుక్కి జిల్లా ఎత్తైన పర్వత శ్రేణులలోని నెడుంకండం పంచాయతీలో టీ ఫ్యాక్టరీ, సుగంధ ద్రవ్యాల తోటల మధ్య పెరిగారు. సైన్స్‌లో గ్రాడ్యుయేట్ డిగ్రీ పూర్తి చేసిన తర్వాత సన్నీ ఏడాదిన్నర పాటు అన్వేషిస్తూ, ప్రయాణిస్తూ గడిపారు. ఈ సమయంలో ఆమె ఇండియా ఫెలో సోషల్ లీడర్‌షిప్ ప్రోగ్రామ్‌కు దరఖాస్తు చేసుకుని అభివృద్ధి రంగంలోకి ప్రవేశించారు. ఫెలోషిప్ సమయంలో తనకు అత్యంత ముఖ్యమైనది సమాజాలలో జీవన నాణ్యతను మెరుగుపరచడమేనని ఆమె గ్రహించారు.
గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి
ముంబైకి సుమారు 180 కిలోమీటర్ల దూరంలో ఉన్న భండార్దారా చుట్టుపక్కల గిరిజన ప్రాంతాలలో ప్రత్యామ్నాయ జీవనోపాధులపై పనిచేసే ‘గ్రాస్‌రూట్స్ జర్నీస్’ అనే సంస్థలో ఆమె చేరారు. ఇక్కడ కొన్నేండ్లు పనిచేయడం వల్ల, గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి నగదు ప్రవాహం చాలా కీలకమనే ఆమె నమ్మకం మరింత బలపడింది. “స్థానిక పరిస్థితులకు అనుగుణంగా ప్రత్యామ్నాయ జీవనోపాధి అవకాశాలను మెరుగుపరచడం, సృష్టించడమే సరైన విధానమని కూడా ఇది నిరూపించింది” అని ఆమె అంటున్నారు. 2018లో తన తల్లిదండ్రులకు టీ ఫ్యాక్టరీలో సహాయం అవసరం కావడంతో సన్నీ ఇడుక్కికి తిరిగి వచ్చారు. అతి తక్కువ కాలంలోనే సన్నీ అమ్మకాలు, బ్రాండ్ అభివృద్ధి పనులలో నిమగ్నమయ్యారు. కానీ సమాజాలను ఉన్నతీకరించాలనే తన లక్ష్యాన్ని మాత్రం వదులుకోలేదు. ఈ దిశగా అడుగులు వేయడానికి ఆమె మాజీ ఇండియా ఫెలో భావేష్‌తో కలిసి ‘గ్రామ్య’ను ప్రారంభించారు.
పర్యాటకం దెబ్బతింది
ఇడుక్కి సుందరమైన మున్నార్, తెక్కడి మార్గంలో ఉన్నందున ‘గ్రామ్య’ను ప్రారంభించడానికి గల ప్రాథమిక ఆలోచన సమాజ ఆధారిత గ్రామీణ పర్యాటకం అని చెప్పుకోవచ్చు. ఇడుక్కిలోని ఒక చర్చి ఆధారిత స్వచ్ఛంద సంస్థ అయిన హై రేంజ్ డెవలప్‌మెంట్ సొసైటీ ద్వారా వారికి మొదట కంజికుళి, ఆ తర్వాత పంచాయతీలోని మారుమూల, గ్రామమైన మక్కువల్లి పరిచయమయ్యాయి. ఈ ఆలోచన పట్ల ఆ ప్రాంత ప్రజలు ఉత్సాహం చూపారు. గ్రామ్య శిక్షణా తరగతులు నిర్వహించింది. కానీ 2018, 2019లలో కేరళను వరదలు ముంచెత్తాయి. దానివల్ల రాష్ట్రవ్యాప్తంగా పర్యాటకం దెబ్బతింది. ఆ తర్వాత కోవిడ్-19 మహమ్మారి వచ్చింది. ఈ ప్రయాణంలో ఇక్కడి రైతులు అత్యంత ఖరీదైన పంటలను పండిస్తున్నప్పటికీ, ఇడుక్కి కేరళలోని అత్యంత వెనుకబడిన జిల్లాలలో ఒకటిగా మిగిలిపోయిందని అను సన్నీ అర్థం చేసుకున్నారు.
నాగరికతకు చాలా దూరంగా
“నేను అమ్మానాన్నలతో కలిసి పనిచేసినప్పుడు వారు జీరో-బడ్జెట్ వ్యవసాయం చేస్తున్నప్పటికీ సుగంధ ద్రవ్యాల తోట నష్టాల్లో ఉంది. యాలకుల కొండ రిజర్వ్‌లో మిరియాలను అంతరపంటగా పండిస్తూ పచ్చి యాలకులను పండిస్తారు. మార్కెట్లో యాలకుల కిలో ధర రూ.2,500 పలుకుతున్నప్పటికీ అధిక ఖర్చుల వల్ల నష్టాల్లోనే ఉండేది” అని ఆమె వివరించింది. అయితే వాళ్లకు పరిచయమైన కంజికుళి పంచాయతీ సేంద్రియ వ్యవసాయానికి ప్రసిద్ధి చెందింది. అలాగే కంజికుళి పట్టణానికి 8 కిలోమీటర్ల దూరంలో ఉన్న మక్కువల్లిలో పక్కపక్కనే మూడు గ్రామా లు ఉన్నాయి. ఇక్కడ ఎగుమతికి అనువైన అత్యుత్తమ నాణ్యత గల మిరియాలు పండేవి. కానీ సౌకర్యాల పరంగా ఈ ప్రాంతాలు నాగరికతకు చాలా దూరంగా ఉండేవి.
మలుపు తిరిగింది
2019లో గ్రామీణ పర్యాటక ప్రణాళికలు పట్టాలు తప్పిన తర్వాత గ్రామ్యను ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రూరల్ మేనేజ్‌మెంట్‌లో ఇంక్యుబేట్ చేశారు. దాంతో గ్రామ్య ప్రస్తుత రూపంలో ఆవిర్భవించింది. గ్రామ్య సేంద్రియ వ్యవసాయం చేసే రైతులతో కలిసి పనిచేస్తుంది. ఇది మార్కెట్ విలువ కంటే 30 నుండి 50 శాతం అధిక ధరకు పంటను కొనుగోలు చేస్తుంది. ఈ పంటలలో నల్ల మిరియాలు, తెల్ల మిరియాలు, పచ్చ యాలకులు, లవంగం, జాజికాయ, మలబార్ చింతపండు ఉన్నాయి. గ్రామ్య.. నాణ్యతను మెరుగుపరచడానికి, ఒకేసారి మొత్తం కోయకుండా, కేవలం పండిన మిరియాలను మాత్రమే ఎంపిక చేసుకుని కోయడానికి రైతులకు శిక్షణ ఇస్తుంది. ఇది తెల్ల మిరియాల ప్రాసెసింగ్‌ను కూడా ప్రవేశపెట్టింది. దీనివల్ల నల్ల మిరియాలతో పోలిస్తే రైతులకు కిలోకు అదనంగా రూ. 300 లభిస్తుంది. ఇది ఐరోపా, యునైటెడ్ స్టేట్స్‌లో కొనుగోలుదారుల స్థావరాన్ని నిర్మిస్తోంది. ప్రత్యేకంగా దేశీయ రకాలను అన్వేషిస్తోంది. ఈ సంస్థ, ఇంతకుముందు విలువ లేని మిరప, కరివేపాకు, మలబార్ చింతపండును కూడా సేకరించడం ప్రారంభించింది. గ్రామ్యా ఇప్పుడు చెఫ్‌లతో కలిసి చాయ్ మసాలా, చేపల కూర మసాలాతో సహా మసాలా మిశ్రమాలను అభివృద్ధి చేయడానికి కృషి చేస్తోంది.
మహిళలే నాయకత్వం వహిస్తారు
గ్రామ్యా ఇటీవల యాలకుల పరిశోధనా సంస్థ నుండి వచ్చిన కొత్త రకం పచ్చి యాలకులైన ICRI-10ను, ప్యాకేజ్డ్ D2C ఉత్పత్తిగా, ఎగుమతి వస్తువుగా విక్రయించిన మొదటి బ్రాండ్‌గా నిలిచింది. ఈ సంస్థ ప్రస్తుతం ఇడుక్కిలోని నెడుంకండం, ఉడుంబంచోళ, కంజికుళి, వాళతోపే, మురిక్కస్సేరి, తొడుపుళ, రాజకాడు, మలప్పురం జిల్లాలోని మంజేరిలో 155 మంది రైతులతో కలిసి పనిచేస్తోంది. గ్రామ్యలో పంట కోత అనంతర ప్రక్రియను మహిళలే నిర్వహిస్తారు. దాని వల్ల పని నాణ్యంగా ఉంటుందని ఆమె అంటున్నారు. అంతేకాకుండా వచ్చిన ఆదాయాన్ని కుటుంబంలోని మహిళలకు నేరుగా బ్యాంకు బదిలీ ద్వారా చెల్లిస్తారు. అలాగే అంతర్జాతీయ కొనుగోలుదారులు వచ్చినప్పుడు మహిళలే వారికి ఆతిథ్యం ఇస్తారు. అందుకు ప్రతిఫలంగా డబ్బు తీసుకుంటారు. గ్రామ బృందంలో అధికశాతం మహిళలే ఉన్నారు.
అతిపెద్ద సామాజిక మార్పు
‘‘వ్యవసాయం ఆదాయాన్ని ఇస్తుంది కనుక దాన్నే కొనసాగిద్దాం” అనే ఆలోచన రైతుల్లో వచ్చింది. గ్రామ్యతో కలిసి పనిచేసే రైతులలో అతి చిన్న వయస్కుడికి 23 ఏండ్లు. “తర్వాతి తరం వారు తాము పెరిగిన వ్యవసాయ పద్ధతులలో విలువను చూసి, తాము పండించే దాని నుండి స్థిరమైన జీవనోపాధిని నిర్మించుకోగలమని గుర్తిస్తే, నా దృష్టిలో అదే అతిపెద్ద సామాజిక మార్పు” అని ఆమె అంటారు. ప్రారంభంలో గ్రామ్య అనేది ఆమె చివరికి వదిలేసే ఒక సైడ్ ప్రాజెక్ట్ అని ప్రజలు భావించారు. ఆమె ఈ విషయంలో చాలా నిబద్ధతతో ఉందని, రైతులకు తానే ప్రధాన కొనుగోలుదారు అని వారికి స్పష్టమయ్యాక సందేహాలు తొలగిపోయాయి. “సమాజానికి ఏదైనా చేయాలంటే లింగభేదం ఒక సమస్య అని నేను అనుకోవడం లేదు” అని ఆమె అన్నారు.
మారుమూల గ్రామాల నుండి ప్రపంచానికి…
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



