Thursday, June 25, 2026
E-PAPER
Homeజాతీయంమహారాష్ట్రను ముంచెత్తిన భారీ వర్షాలు

మహారాష్ట్రను ముంచెత్తిన భారీ వర్షాలు

- Advertisement -

కూలిన చెట్లు -తెగిన రహదారులు
మల్షేజ్ ఘాట్‌లో విరిగిపడిన కొండచరియలు

ముంబయి: మహారాష్ట్రలోని ముంబయి, థానే, పాల్ఘర్ జిల్లాల్లో కురుస్తున్న భారీ వర్షాలు జనజీవనాన్ని అస్తవ్యస్తం చేశాయి. ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాల కారణంగా ప్రముఖ పర్యాటక ప్రాంతమైన మాల్షేజ్‌ ఘాట్‌లో స్వల్ప కొండచరియలు విరిగిపడగా, జిల్లాలో పలు చోట్ల చెట్లు కూలిపోయాయి. ఇదిలా ఉండగా ముంబయి, థానే, రాయ్‌గఢ్‌, పాల్ఘర్‌, సింధుదుర్గ్ జిల్లాలోలకు వాతావరణ శాఖ ఆరెండ్ అలర్ట్ జారీ చేసింది. పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది.

మల్షేజ్ ఘాట్‌లో కొండచరియలు
థానే జిల్లా రెసిడెంట్ డిప్యూటీ కలెక్టర్ సందీప్ మానే తెలిపిన వివరాల ప్రకారం, మంగళవారం సాయంత్రం 6 గంటల నుంచి 7 గంటల మధ్య మల్షేజ్ ఘాట్‌లోని ‘వాష్ పాయింట్’, ‘అంబ్రెల్లా పాయింట్’ మధ్య కొండచరియలు విరిగిపడ్డాయి. ఘటన సమాచారం అందుకున్న వెంటనే అధికారులు భూమి తవ్వే యంత్రాలను ఘటనాస్థలికి తరలించారు. కొద్దిసేపట్లోనే శిథిలాలను తొలగించి రాకపోకలను పునరుద్ధరించారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు తెలిపారు.
గత 24 గంటల్లో థానే జిల్లాలో మొత్తం 27 ఫిర్యాదులు నమోదయ్యాయని ప్రాంతీయ విపత్తు నిర్వహణ విభాగం (ఆర్‌డీఎంసీ) చీఫ్ యాసిన్ తడ్వీ వెల్లడించారు. వీటిలో 18 చెట్లు లేదా చెట్ల కొమ్మలు కూలిపోవడానికి సంబంధించినవి కాగా, మరో నాలుగు అగ్నిప్రమాదాలకు సంబంధించిన ఫిర్యాదులు ఉన్నాయి. బుధవారం ఉదయం థానే నగరంలోని చారాయ్ ప్రాంతంలో ఒక భారీ చెట్టు రహదారి పక్కన నిలిపి ఉంచిన రెండు కార్లపై కూలిపోయింది. దీంతో రెండు వాహనాలు దెబ్బతిన్నాయి. చెట్టు కూలిన ఘటనలో ఎవరూ గాయపడకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. సమాచారం అందుకున్న వెంటనే విపత్తు నిర్వహణ సిబ్బంది, అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని చెట్టును తొలగించే పనులు చేపట్టారు. బుధవారం ఉదయం 8.30 గంటలతో ముగిసిన 24 గంటల్లో థానే నగరంలో 77.97 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.

ముంబయిలో భారీ వర్షం
మంగళవారం రాత్రి నుంచి తెల్లవారుజాము వరకు ఎడతెరపి లేకుండా కురిసిన వర్షానికి నగరంతో పాటు నవీ ముంబయిలోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. కోపర్ ఖైరానే-గన్‌సోలి స్టేషన్ల మధ్య రైలు పట్టాల కింద మట్టి కొట్టుకపోవడంతో రైళ్ల రాకపోకలను నిలిపివేశారు. ప్రస్తుతం అక్కడ ట్రాక్‌ పునరుద్ధరణ పనులు జరుగుతున్నాయి. దాదర్ స్టేషన్‌లో రైలు పట్టాలపై నీరు నిలిచింది. విక్రోలి వెస్ట్‌లో రిటైయినింగ్ వాల్ కూలిపోయింది. ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. అనేక చోట్ల రహదారులపై నీరు నిలిచిపోవడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. వరద నీరు భారీగా చేరడంతో అంధేరీలోని అండర్‌పాస్‌లో వాహనాల రాకపోకలను తాత్కాలికంగా నిలిపివేశారు. నవీ ముంబయిలోని భాజీ మార్కెట్‌లోకి నీరు చేరడంతో నిత్యావసర వస్తువుల రవాణాకు అంతరాయం ఏర్పడింది. గత 24 గంటల్లో 300 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని బృహన్ ముంబయి మున్సిపల్ కార్పొరేషన్ వెల్లడించింది.
మహారాష్ట్రలో రానున్న రోజుల్లో మరింత వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో థానే, పాల్ఘర్ జిల్లాల యంత్రాంగం అప్రమత్తమైంది. కొండచరియలు విరిగిపడే ప్రాంతాలు, చెట్లు కూలే ప్రమాదం ఉన్న ప్రాంతాల్లో ప్రత్యేక పర్యవేక్షణ చేపట్టాలని అధికారులను ఆదేశించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -