Wednesday, April 15, 2026
E-PAPER
Homeతాజా వార్తలుప్ర‌జ‌ల్ని చైత‌న్య‌ప‌రిచేవి క‌ళ‌లే..స‌మాజ జ‌బ్బును పోగొట్టేది క‌ళాకారుడే

ప్ర‌జ‌ల్ని చైత‌న్య‌ప‌రిచేవి క‌ళ‌లే..స‌మాజ జ‌బ్బును పోగొట్టేది క‌ళాకారుడే

- Advertisement -


– సినీన‌టుల ఎదుగుద‌ల‌లో పీ.ఎన్‌.ఎం పాత్ర కీల‌కం
– పైసా ఖ‌ర్చుపెట్ట‌కుండా అంద‌రికీ విద్యా వైద్యం అందింతేనే అభివృద్ధి సాధ్యం
– సినీన‌టుడు, డాక్ట‌ర్ మాదాల ర‌వి
– మ‌నం నెమ్మ‌దిగా గెలుస్తున్నాం…పాల‌కుల‌కు భ‌యం పుట్టిస్తున్నాం
– విలువ‌ల‌కు నిలువుట‌ద్ధం పీ.ఎన్‌.ఎమ్ క‌ళాకారులు
– వాగ్గేయ క‌ళాకారుడు, క‌వి, ఎమ్మెల్సీ గోర‌టి వెంక‌న్న‌
– ర‌వీంద్ర‌భార‌తిలో పీ.ఎన్‌.ఎమ్ రాష్ట్ర మూడో మ‌హాస‌భ‌లు ప్రారంభం
న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : ప్ర‌జ‌లను చైత‌న్య‌ప‌ర్చ‌డంలో క‌ళ‌ల‌దే కీల‌క పాత్ర అని సినీన‌టుడు, మ‌హాస‌భ‌ల ఆహ్వాన సంఘం చైర్మెన్‌ డాక్ట‌ర్ మాదాల ర‌వి చెప్పారు. మ‌నిషి శ‌రీరానికి వ‌చ్చిన జ‌బ్బుల‌ను త‌గ్గించ‌డంలో డాక్ట‌ర్ల పాత్ర కీల‌కమ‌నీ, స‌మాజానికి ప‌ట్టిన జ‌బ్బును పోగొట్టేది క‌ళాకారుడే అని కొనియ‌డారు. బుధ‌వారం హైద‌రాబాద్‌లోని ర‌వీంద్ర‌భార‌తిలో ప్ర‌జానాట్య‌మండ‌లి రాష్ట్ర మూడో మ‌హాస‌భ‌లను పీ.ఎన్‌.ఎమ్ సీనియ‌ర్ నేత న‌ర్స‌య్య జెండా ఆవిష్క‌రించి ప్రారంభించారు. అనంత‌రం జ‌రిగిన ప్రారంభ స‌భ‌లో మాదాల ర‌వి అధ్య‌క్ష ఉప‌న్యాసం చేశారు. ప్ర‌పంచంలోనే గొప్ప పోరాటంగా ప్ర‌సిద్ధి చెందిన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో మ‌ట్టిమ‌నుషుల‌ను పులులుగా మార్చి పోరుబాట ప‌ట్టించ‌డంలో మా భూమి నాట‌కం పోషించిన పాత్ర‌ను గుర్తుచేశారు. సినీరంగంలో ఎంతోమంది నిల‌దొక్కుకునే అవ‌కాశం క‌ల్పించిన వారిలో పీ.ఎన్‌.ఎమ్ వ్య‌వ‌స్థాప‌క అధ్య‌క్షులు గ‌రిక‌పాటి రాజారావు ఒక‌ర‌నీ, సినీరంగంలోని అల్లూరి రామ‌లింగ‌య్య‌, జ‌మున‌, కే.ఎస్‌.ప్ర‌కాశ్‌, మిక్కిలినేని, ఇలా ఎంద‌రో క‌ళాకారులు పీ.ఎన్‌.ఎమ్ నుంచి వ‌చ్చిన‌వారేన‌ని వివ‌రించారు. వందేళ్ల సినీరంగ చ‌రిత్ర‌లో విలువ‌ల‌తో కూడిన గొప్ప సినిమాలు రావ‌డంలో పీ.ఎన్‌.ఎమ్ పాత్ర కీల‌క‌మ‌ని నొక్కి చెప్పారు. కొన్ని ప్రాంతాల‌కు, మ‌రికొన్ని రాష్ర్టాల‌కు, ఇంకొన్ని జాతీయ‌స్థాయికి మాత్ర‌మే ప‌రిమితం కాగా క‌మ్యూనిస్టు పార్టీ 140కిపైగా దేశాల్లో ఉన్న‌ద‌నీ, మార్క్సిజం గొప్ప సిద్ధాంతం అని కొనియాడారు. దేశం కోసం ఉరికంభం ఎక్కిన భ‌గ‌త్‌సింగ్‌, బ‌డుగు జీవితాల కోసం నిరంత‌రం ఆలోచించిన అంబేద్క‌ర్‌, పేద‌ల ప‌క్షాన నిల‌బ‌డ్డ సుంద‌ర‌య్య లాంటి మ‌హ‌నీయులు నిజ‌మైన హీరోల‌ని కొనియాడారు. సంప‌ద అంద‌రిద‌నీ, కానీ, ప్ర‌స్తుత స‌మాజంలో కేవ‌లం ఐదు శాతం మంది చేతుల్లో కేంద్రీకృతం అవుతున్న తీరును వివ‌రించారు. నేడు మ‌న దేశంలో విద్య‌, వైద్యం పూర్తిగా వ్యాపార‌మ‌యం కావ‌డం ప‌ట్ల ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. పైసా ఖ‌ర్చు లేకుండా ప్ర‌తి ఒక్క‌రికీ విద్య‌, వైద్యం అందిన‌నాడే మ‌న దేశం అభివృద్ధిలో ముందుకెళ్తుంద‌ని నొక్కి చెప్పారు. ఉచిత‌ విద్య‌, వైద్యం కోసం పాల‌కుల‌పై పోరాటం చేసేందుకు దోహ‌ద‌ప‌డేలా పీ.ఎన్‌.ఎమ్ క‌ళారూపాలుండాల‌ని ఆకాంక్షించారు. ఒక్కో నియోజ‌క‌వ‌ర్గంలో వంద కోట్ల‌రూపాయ‌లు, 70 కోట్ల రూపాయ‌లు ఖ‌ర్చుపెట్టి గెలిచిన ఎంపీలు, ఎమ్మేల్యేలు ప్ర‌జ‌ల కోసం ఎలా ప‌నిచేస్తార‌ని ప్ర‌శ్నించారు. పైసా ఖ‌ర్చుపెట్ట‌కుండా ఎమ్మెల్యేలు, ఎంపీలు గెలిచిన నాడే మ‌న దేశం ముందుకెళ్తుంద‌నీ, లేదంటే సంప‌ద మొత్తం కొంద‌రి చేతుల్లోనే కేంద్రీకృతం అవుతుంద‌ని హెచ్చ‌రించారు. డ‌బ్బు రాజ‌కీయాల‌ను దూరం చేసేలా, ప్ర‌జా సేవ‌కుల‌ను గెలిపించేలా పీ.ఎన్‌.ఎమ్ క‌ళాకారులు కృషి చేయాల‌ని కోరారు. శ‌త్రువు బ‌లంగా ఉన్న నేప‌థ్యంలో అభ్యుద‌య శ‌క్తులు, వామ‌ప‌క్ష శ‌క్తులు ఐక్యం కావాల్సిన ఆవ‌శ్య‌క‌త‌ను, ప్ర‌జాక‌ళ‌లు బ‌ల‌ప‌డాల్సిన అవ‌స‌రాన్ని విడ‌మ‌ర్చి చెప్పారు.

వాగ్గేయ క‌ళాకారుడు, ఎమ్మెల్సీ గోర‌టి వెంక‌న్న మాట్లాడుతూ..తాను ఈ స్థాయి ఎద‌గ‌డానికి క‌మ్యూనిస్టు ఉద్య‌మమే కార‌ణ‌మ‌ని చెప్పారు. స‌మాజంలో గొప్ప గొప్ప అవ‌కాశాలు వ‌చ్చిన‌ప్ప‌టికీ వాటిని కాద‌ని ప్రజ‌ల కోసం, విలువ‌ల కోసం ప్ర‌జానాట్య‌మండ‌లినే న‌మ్ముకుని ఉన్న క‌ళాకారుల‌కు ధ‌న్య‌వాదాలు తెలిపారు. విలువ‌లున్న గాంధీ, సుంద‌ర‌య్య‌, అంబేద్క‌ర్ లాంటి నేత‌లు నేడు క‌రువయ్యార‌ని వాపోయారు. మనుషుల‌ను మార్కెట్‌కు బానిస‌లుగా మార్చి స‌మాజాన్ని కులం, మ‌తం పేరుతో విభ‌జన రాజ‌కీయాలు చేస్తున్న శ‌క్తుల ప‌ట్ల ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. విలువ‌ల‌ను హ‌న‌నం చేసి మ‌నుషుల‌ను క్రూరంగా త‌యారు చేస్తున్న ప్ర‌మాద‌క‌ర స్థితిని ఎత్తిచూపారు. దోపిడీకి క‌రుణ ఉండ‌ద‌నీ, దాని లాభార్జ‌నే ముఖ్య‌మ‌ని చెప్పారు. ఇలాంటి త‌రుణంలో క‌మ్యూనిస్టులు బ‌ల‌ప‌డాల్సిన అవ‌స‌ర‌ముంద‌ని ఆకాంక్షించారు. 40 ఏండ్లుగా ఒకే సిద్ధాంతం ప‌ట్ల క‌లిసిక‌ట్టుగా ఉంటున్న‌ గంగ‌దేవిప‌ల్లి, పైసా ఖ‌ర్చుపెట్ట‌కుండా స‌ర్పంచిగా గెలిపించిన మునిపంపుల గ్రామాల్లోని బ‌ల‌మైన‌ పునాది వ్య‌వ‌స్థ‌ను మ‌రిన్ని ప్రాంతాల‌కు విస్త‌రించాల‌ని కోరారు. మ‌నం నెమ్మ‌దిగా గెలుస్తున్నామ‌నీ, మ‌న గెలుపు శ‌త్రువుల‌కు భ‌యం పుట్టిస్తున్న‌ద‌నీ, అందుకే అణ‌చివేత‌లు, దాడులు పెరుగుతున్నాయ‌ని చెప్పారు. ఆ ఆట‌లు ఎల్ల‌కాలం చెల్లుబాటు కావ‌నీ, పెరుగుట విర‌గ‌టం కోస‌మేన‌ని చెప్పారు. అంతిమంగా ప్ర‌జ‌లే యుగ‌క‌ర్త‌ల‌నీ, ప్ర‌జా క‌ళ‌లు వ‌ర్థిల్లాల‌ని ఆకాంక్షించారు. సామాజిక కార్య‌క‌ర్త‌, ప్ర‌జానాట్య‌మండ‌లి ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర మాజీ కార్య‌ద‌ర్శి పీఏ.దేవి మాట్లాడుతూ..రెండో ప్ర‌పంచ యుద్ధ కాలంలో హిట్ల‌ర్ నాజీయిజాన్ని వ్య‌తిరేకిస్తూ ప్ర‌జానాట్య‌మండ‌లి నాట‌కాన్ని ప్ర‌ద‌ర్శించింద‌ని గుర్తుచేశారు. యుద్ధాల‌న్నీ ఆర్థిక ఆధిపత్యం, మార్కెట్ విస్త‌ర‌ణ కోస‌మే జ‌రుగుతున్నాయ‌ని ఎత్తిచూపారు. వెనిజుల అధ్య‌క్షుడు మ‌ధురో దంప‌తుల‌ను అమెరికా అధ్య‌క్షులు ట్రంప్ కిడ్నాప్ చేయిస్తే ఒక్క దేశ‌మూ ఖండించ‌క‌పోవ‌డాన్ని తీవ్రంగా ఆక్షేపించారు. ఎఫ్‌స్టిన్ ఫైల్స్‌లో త‌న పేరుండ‌టం, ఆ ఫైల్స్ డేటా నెత‌న్యాహూ చేతిలో ఉండ‌టం, మ‌రోవైపు డాల‌ర్ విలువ ప‌త‌నం అవుతుండ‌టంతో ఏమి చేయాలో అర్థం కాక ఇరాన్‌పై ట్రంప్ యుద్ధానికి పూనుకున్నార‌ని విమ‌ర్శించారు. మ‌ధ్య‌ప్రాచ్యంపై పూర్తిగా ప‌ట్టుసాధించి చ‌మురు నిల్వ‌ల‌పై త‌న ఆధిపత్యాన్ని పెంచుకునేందుకు ట్రంప్ ప్ర‌య‌త్న‌స్తున్నార‌న్నారు. ఇరాన్‌పై అమెరికా యుద్ధానికి పూనుకుంటే మ‌న ప్ర‌ధాని దాన్ని ఖండించ‌క‌పోవ‌డాన్ని త‌ప్పుబ‌ట్టారు. పైగా అమెరికా స్థావ‌రాల‌పై ఇరాన్ దాడి చేయ‌డాన్ని మోడీ ఖండించార‌ని గుర్తుచేశారు. శ‌తాబ్దాలుగా ఇరాన్‌తో ఇండియాకు ప్ర‌త్యేక అనుబంధం ఉంద‌నీ, దాన్ని మోడీ తెగ‌దెంపుతున్నార‌ని విమ‌ర్శించారు. ఇలాంటి త‌రుణంలో ప్ర‌జల ప‌క్షాన నిలిచే క‌ళ‌లు రావాల‌ని ఆకాంక్షించారు. రైతు సంఘం రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి టి.సాగ‌ర్ మాట్లాడుతూ..అమెరికా సామ్రాజ్య‌వాదానికి వ్య‌తిరేకంగా పీ.ఎన్‌.ఎమ్ క‌ళారూపాలుండాల‌ని ఆకాంక్షించారు. అమెరికా పెట్టే ప్ర‌తి వాణిజ్య ష‌ర‌తుకూ మోడీ స‌ర్కారు త‌లూప‌డం దేశ ప్ర‌యోజ‌నాల‌కు న‌ష్ట‌దాయ‌క‌మ‌ని హెచ్చ‌రించారు. గ‌తంలో ప‌త్తి దిగుమ‌తుల‌పై 30 శాతం సుంకం ఉండ‌గా మోడీ స‌ర్కారు వ‌చ్చాక దాన్ని 11 శాతానికి, ఇప్పుడు పూర్తిగా ఎత్తివేశార‌ని విమ‌ర్శించారు. ఇది 60 ల‌క్ష‌ల మంది ప‌త్తి రైతుల‌కు న‌ష్ట‌దాయ‌కంగా మారింద‌ని ఎత్తిచూపారు. పాడి దిగుమ‌తుల‌పైనా సుంకాల‌ను ఎత్తేయ‌డం దారుణ‌మ‌న్నారు. మోడీ ప్ర‌చారం చేస్తున్న‌ ఆత్మ‌నిర్భ‌ర భార‌త్‌, దేశ‌భ‌క్తి డొల్ల అనీ, ఆయ‌న దేశాన్ని సామ్రాజ్య‌వాదుల‌కు తాక‌ట్టు పెట్టేందుకు ప్ర‌య‌త్నిస్తున్నార‌ని విమ‌ర్శించారు. ప్ర‌జానాట్య‌మండ‌లి తెలంగాణ మాజీ అధ్య‌క్షులు కె.దేవేంద్ర మాట్లాడుతూ..ప్ర‌జ‌ల ద‌గ్గ‌ర‌కు క‌ళ‌ల‌ను తీసుకెళ్లేందుకు మ‌రింత అధ్య‌య‌నం అవ‌స‌రమ‌ని నొక్కి చెప్పారు. సాంస్కృతిక రంగంలో వ‌ర్గ పోరాటాన్ని విస్తృత‌ప‌ర్చాల‌న్నారు. మీడియా కార్పొరేట్ గుత్తాధిప‌త్యంలో ఉన్న త‌రుణంలో సోష‌ల్‌మీడియా వేదిక‌గా ప్ర‌త్యామ్నాయ భావ‌జాల విస్త‌ర‌ణ‌కు క‌ళాకారులు పూనుకోవాల‌ని పిలుపునిచ్చారు. పీ.ఎన్‌.ఎమ్ రాష్ట్ర అధ్య‌క్షులు వేముల ఆనంద్ అధ్య‌క్ష‌త‌న జ‌రిగిన ఈ ప్రారంభ స‌భ‌లో ఆ సంఘం రాష్ట్ర కార్య‌ద‌ర్శి క‌ట్ట న‌ర్సింహ, న‌వ‌తెలంగాణ ఎడిట‌ర్ రాంప‌ల్లి ర‌మేశ్‌, పీ.ఎన్‌.ఎమ్ రాష్ట్ర ఉపాధ్య‌క్షులు, నాట‌క ర‌చ‌యిత కె.శాంతారావు, మ‌హాస‌భ ఆహ్వాన సంఘం ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ఎన్‌.మార‌న్న‌, ప్ర‌జానాట్య‌మండ‌లి ఏపీ అధ్య‌క్ష‌, కార్య‌ద‌ర్శులు మంగ‌రాజు, అనిల్‌, మ‌హారాష్ట్ర షోలాపూర్ టీమ్ లీడ‌ర్ ర‌ఘు, పీ.ఎన్‌.ఎమ్ ఆఫీస్ బేర‌ర్లు, త‌దిత‌రులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -