నవతెలంగాణ-హైదరాబాద్: ఇరాన్‌ను బలవంతంగా లొంగదీసుకోవాలని చేసే ఏ ప్రయత్నమైనా విఫలమవుతుంది అని బుధవారం ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియన్ హెచ్చరించారు. తాజాగా పాకిస్తాన్‌లో జరిగిన శాంతి చర్చలు విఫలమవ్వడంతో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆగ్రహావేశంతో హార్మూజ్ జలసంధిని దిగ్బంధిస్తామని ప్రకటించాడు. అనుకున్నట్టుగానే ఇరాన్ పోర్టులకి వెళ్లే నౌకల్ని అమెరికా సైన్యం అడ్డుకుంది. ఈ తాజా పరిణామాలపై ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియన్ స్పందించారు. ఇరాన్‌పై బలప్రయోగం చేసే ఏ ప్రయత్నమైనా విఫలమవుతుందని ఆయన హెచ్చరించారు. ‘మేము నిర్మాణాత్మక చర్చలకే ప్రాధాన్యత ఇస్తాము. ఇరాన్‌ను లొంగిపోయేలా బలవంతం చేసే ఏ ప్రయత్నమైనా విఫలమవుతుంది. ప్రజలు అటువంటి విధానాన్ని ఎన్నటికీ అంగీకరించరు. ఇరాన్ యుద్ధాన్ని కోరుకోవడం లేదు అని ఇరాన్ ప్రభుత్వ మీడియా ఐఎస్‌ఎన్‌ఎకి ఆయన వెల్లడించారు.
కాగా, ఏ అధికారంతో, ఏ నేరానికి పాల్పడి మా దేశంపై దాడి జరిగింది. అంతర్జాతీయ చట్టాన్ని ఉల్లంఘించి పౌరులను, ఉన్నత వర్గాలను, పిల్లలను లక్ష్యంగా చేసుకోవడం, పాఠశాలలు, ఆసుపత్రులతో సహా కీలక కేంద్రాలను ధ్వంసం చేయడాన్ని అమెరికా ఎలా సమర్థించుకుంటుంది అని ఆయన మీడియా ద్వారా ప్రశ్నించారు. తమ దేశం శాంతిని, దౌత్య సంబంధాలను కోరుకుంటుంది. అయితే దాని సార్వభౌమత్వాన్ని దెబ్బతీసే ఎలాంటి బాహ్య దురాక్రమణనైనా లేదా ఒత్తిడినైనా గట్టిగా ప్రతిఘటిస్తుందని ఇరాన్ అధ్యక్షుడు పునరుద్ఘాటించారు.



