హర్ కిషన్ సింగ్ సుర్జీత్ భవన్‌లో
న్యూఢిల్లీ: అమెరికా దుశ్చర్యను ప్రతిఘటిస్తున్న క్యూబాకు అండగా నిలుద్దామమని సీపీఐ(ఎం) సంఘీభావం తెలిపింది. న్యూఢిల్లీలోని హర్ కిషన్ సింగ్ సుర్జీత్ భవన్‌లో ఆదివారం జరిగిన కార్యక్రమంలో భారీసంఖ్యలో పార్టీ సభ్యులు, కార్యకర్తలు, మద్దతుదారులు తరలివచ్చారు. ఈ సమావేశంలో భారతదేశంలోని క్యూబా రాయబారి జువాన్ కార్లోస్ మార్సన్ ప్రసంగించారు. క్యూబాకు నిరంతరం మద్దతు ఇస్తున్నందుకు భారత ప్రజలకు, ప్రగతిశీల సంస్థలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దశాబ్దాల ఆర్థిక దిగ్బంధనం, బాహ్య ఒత్తిళ్లు ఉన్నప్పటికీ క్యూబా ప్రదర్శించిన దృఢత్వాన్ని ప్రముఖంగా ప్రస్తావించారు. శాంతి, సార్వభౌమత్వం, సామాజిక న్యాయాన్ని పరిరక్షించడంలో అంతర్జాతీయ సంఘీభావం యొక్క ప్రాముఖ్యతను ఆయన నొక్కి చెప్పారు. ఆయన ప్రసంగాన్ని ప్రొఫెసర్ సోనియా హిందీలోకి అనువదించారు. సీపీఐ(ఎం) పొలిట్ బ్యూరో సభ్యుడు అరుణ్ కుమార్ కూడా ఈ సభను ఉద్దేశించి ప్రసంగిస్తూ, క్యూబాకు తమ పార్టీ అచంచలమైన మద్దతును పునరుద్ఘాటించారు. ఆ దేశంపై కొనసాగుతున్న ఆర్థిక దిగ్బంధనాన్ని ఆయన ఖండించారు. ఈ కార్యక్రమాన్ని సీపీఐ(ఎం) ఢిల్లీ రాష్ట్ర కార్యదర్శి అనురాగ్ సక్సేనా నిర్వహించారు. వేదికపై హాజరైన వారిలో సీపీఐ(ఎం) పొలిట్ బ్యూరో సభ్యురాలు మరియం ధవాలే, ఎస్ఎఫ్ఐ ప్రధాన కార్యదర్శి శ్రీజన్ భట్టాచార్య; డీవైఎఫ్ఐ ప్రధాన కార్యదర్శి హిమగ్న భట్టాచార్య; ఏఐడీడబ్ల్యూఏ ప్రధాన కార్యదర్శి కొనికా ఘోష్, ప్రొఫెసర్ సోనియాతో పాటు పలువురు ఇతర నాయకులు ఉన్నారు. క్యూబా సార్వభౌమత్వాన్ని, స్వీయ నిర్ణయాధికారాన్ని సమర్థిస్తూ, ఆర్థిక దిగ్బంధనాన్ని అంతం చేయాలని పిలుపునిస్తూ, క్యూబా ప్రజలకు మద్దతును పునరుద్ఘాటిస్తూ, అంతర్జాతీయ సంఘీభావం యొక్క బలమైన సందేశంతో ఈ కార్యక్రమం ముగిసింది.క్యూబాకు సీపీఐ(ఎం) సంఘీభావం
క్యూబాకు అండగా నిలుద్దాం
- Advertisement -
- Advertisement -



