నల్లు చిత్తరంజన్ రెడ్డి దంపతులు
నవతెలంగాణ-తుంగతుర్తి
గ్రామాభివృద్దే ద్యేయంగా గ్రామ ప్రజలే తమ బిడ్డలుగా అనుకుని పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న నల్లు చిత్తరంజన్ రెడ్డి ఉమ దంపతులు. తమ సొంత ఊరికి కావాల్సిన సహాయ సహకారాలు అందిస్తూ ప్రజల మన్ననలు పొందుతున్నారు. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండల పరిధిలోని గానుగుబండ గ్రామానికి చెందిన చిత్తరంజన్ రెడ్డి. కీర్తిశేషులు నల్లు నరసింహారెడ్డి అమృతా దేవి ల జ్ఞాపకార్ధంగా వారి కుమారుడు చిత్తరంజన్ రెడ్డి రూ.2,20,000లతో మినరల్ వాటర్ ప్లాంట్, రూ.60,000లతో ఫ్రీజర్ను గ్రామానికి అందించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజల దాహార్తిని తీర్చేందుకు ముఖ్యంగా పేద మధ్యతరగతి ప్రజలకు శుద్ధమైన త్రాగునీటిని అందించాలనే సంకల్పంతో వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. అదేవిధంగా ఊరిలో ఎవరన్నా చనిపోతే వారి పిల్లలు దూర ప్రాంతాల నుండి వచ్చేదాకా ఇబ్బంది పడకూడదు అని ఫ్రీజర్ తెప్పించడం జరిగింది అన్నారు. ఊరికి సేవ చేయడం చాలా సంతృప్తిగా ఉందన్నారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలు చిత్తరంజన్ రెడ్డి కుటుంబ సభ్యులకు స్వాగతం పలికి ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ మాతంగి వెంకటమ్మ కరుణాకర్, ఉపసర్పంచ్ యనగందుల లావణ్య మధుసూదన్, మాజీ సర్పంచ్ నల్లు రామచంద్రారెడ్డి, గుండగాని రాములు, సూర్యప్రకాష్, దుర్గయ్య, వీరన్న, సోమయ్య, పులి ముత్తయ్య, రామచంద్రు వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు.



