Wednesday, September 23, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్పరకాల ఏరియా ఆస్పత్రిలో వెంటనే వైద్య సేవలు ప్రారంభించాలి

పరకాల ఏరియా ఆస్పత్రిలో వెంటనే వైద్య సేవలు ప్రారంభించాలి

- Advertisement -

కలెక్టర్ చాహత్ బాజ్‌పాయి
నవతెలంగాణ – పరకాల 

నూతనంగా నిర్మించిన ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో ప్రజలకు వైద్య సేవలను త్వరగా అందుబాటులోకి తీసుకురావాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్‌పాయి అధికారులను ఆదేశించారు. మంగళవారం నూతన ఏరియా ఆస్పత్రి భవనాన్ని సందర్శించిన కలెక్టర్ వివిధ విభాగాల్లో కల్పించిన మౌలిక వసతులు, ఏర్పాట్లను పరిశీలించారు.

ఆస్పత్రి గ్రౌండ్‌ఫ్లోర్‌లో రేడియాలజీ, ప్రసూతి గదులు, రక్తనిధి, అత్యవసర, ప్రమాద చికిత్స విభాగాలను ఏర్పాటు చేసినట్లు అధికారులు కలెక్టర్‌కు వివరించారు. మొదటి అంతస్తులో బాహ్య రోగుల విభాగం, ఆస్పత్రి పర్యవేక్షకుల కార్యాలయం, పరిపాలనా విభాగం, నవజాత శిశు సంరక్షణ కేంద్రం, ప్రత్యేక చికిత్స గదులు, ఐసీటీసీ క్లినికల్ సేవలకు సంబంధించిన కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

రెండో అంతస్తులో చిన్నపిల్లల, ప్రసవానంతర, గర్భిణుల, ఎముకలు–కీళ్ల, చెవి–ముక్కు–గొంతు, కంటి, సాధారణ వైద్య విభాగాలతో పాటు పురుషులు, మహిళలకు ప్రత్యేక వార్డులు, చెల్లింపు గదులు, రోగ నిర్ధారణ పరీక్షల విభాగానికి సంబంధించిన గదులను ఏర్పాటు చేసినట్లు వివరించారు. మూడో అంతస్తులో శస్త్రచికిత్స గదులు, అత్యవసర చికిత్స విభాగం, సాధారణ శస్త్రచికిత్సకు సంబంధించిన పురుషులు, మహిళల వార్డులను ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు.

ఆస్పత్రిలోని వివిధ విభాగాలను పరిశీలించిన కలెక్టర్ చాహత్ బాజ్‌పాయి, వాటి ఏర్పాట్లు, అందుబాటులో ఉన్న మౌలిక వసతులపై ఆస్పత్రి పర్యవేక్షకులు డాక్టర్ వంశీకృష్ణతో పాటు సంబంధిత అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. పాత ఆస్పత్రి నుంచి నూతన ఏరియా ఆస్పత్రికి అన్ని విభాగాలను తరలించే ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు. ప్రజలకు వైద్య సేవలు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అందేలా అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలన్నారు. ఆస్పత్రిలో విద్యుత్ పనులు నాణ్యతా ప్రమాణాలతో చేపట్టాలని, వైద్య సేవలకు కీలకమైన ఆక్సిజన్ పైప్‌లైన్ వ్యవస్థను పకడ్బందీగా ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.

కార్యక్రమంలో పరకాల మున్సిపల్ చైర్మన్ పావుశెట్టి సునీల్ కుమార్, మున్సిపల్ కమిషనర్ పవన్, టీజీఎంఎస్‌ఐడీసీ కార్యనిర్వాహక ఇంజనీర్ నందు పటేల్, పరకాల ఆర్డీఓ డీఎస్. వెంకన్న, తహసీల్దార్ విజయలక్ష్మి, ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది, ఇతర అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -