గణాంకాలతో ఐఆర్‌జీసీ ప్రతినిధి వెల్లడి
టెహ్రాన్ : ఈ నెల 8వ తేదీ నుంచి 22వ తేదీ వరకూ పదిహేను రోజుల పాటు జరిగిన తాజా పోరులో అమెరికాకు భారీగా ఎదురు దెబ్బలు తగిలాయని ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (ఐఆర్‌జీసీ) తెలిపింది. అమెరికా సైనిక ఆస్తులు, సిబ్బందికి జరిగిన నష్టాన్ని ఐఆర్‌జీసీ ప్రతినిధి హుస్సేన్ మొహేబీ గణాంకాలతో సహా బయటపెట్టారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం…అమెరికా కమాండ్ కేంద్రాలు, గగనతల రక్షణ వ్యవస్థలు, లాజిస్టిక్ మౌలిక సదుపాయాలు, సంస్థాగత సౌకర్యాలు, విమానాలు, సైనిక మోహరింపు స్థావరాలను లక్ష్యంగా చేసుకొని ఇరాన్ దాడులు జరిపింది. ఈ దాడులలో ఏడు కమాండ్- కంట్రోల్ కేంద్రాలు, మూడు ఉపగ్రహ కమ్యూనికేషన్ వ్యవస్థలు, ఆరు పాట్రియాట్ గగనతల రక్షణ రాడార్లు, మూడు గగనతల – సముద్ర నిఘా రాడార్లు, ఎనిమిది ముందస్తు హెచ్చరిక వ్యవస్థలు, ఏడు క్షిపణి రక్షణ రాడార్లు, మూడు ఈపీఎస్ రాడార్ వ్యవస్థలు, రెండు ఎన్/టీపీఎస్ -117 రాడార్లు, ఐదు దూర శ్రేణి రాడార్ వ్యవస్థలు, రెండు అదనపు గగనతల రక్షణ రాడార్లు, ఒక వ్యూహాత్మక రాడార్ కాంప్లెక్స్ ధ్వంసమయ్యాయి.
క్షిపణులు, డ్రోన్లకే అడ్డే లేదు
పాట్రియాట్ వ్యవస్థలకు భారీ నష్టం జరగడంతో వాటి సామర్ధ్యం బాగా దెబ్బతింది. ఫలితంగా ఇరాన్ ప్రయోగిస్తున్న క్షిపణులు, డ్రోన్లు ఎలాంటి ఆటంకాలు లేకుండా లక్ష్యాలను తాకుతున్నాయి. అమెరికా సైనిక దళాలకు చెందిన లాజిస్టిక్ నెట్‌వర్క్‌ను కూడా ఇరాన్ దెబ్బతీసింది. ఆరు ఫైటర్ – హెలికాప్టర్ నిర్వహణ కేంద్రాలు, మూడు లాజిస్టిక్ – సహాయ కేంద్రాలు, పన్నెండు ఇంధన నిల్వ ట్యాంకులు, పదిహేడు మండుగుండు సామగ్రి- విడిభాగాల గిడ్డంగులు, ఆరు క్షిపణి నిల్వ బంకర్లు ధ్వంసమయ్యాయి.
సైనిక మౌలిక సదుపాయాలకు భారీ నష్టం
సైనిక మౌలిక సదుపాయాలకు జరిగిన నష్టాన్ని కూడా మొహేబీ వివరించారు. ఆరు ఎంక్యూ-9 డ్రోన్ హ్యాంగర్లు, ఒక ఎఫ్ -15 ఫైటర్ ప్రిపరేషన్ ఫెసిలిటీ, కొత్తగా సరఫరా అయిన ఎనిమిది డ్రోన్లను నిల్వ ఉంచిన కేంద్రం, రెండు కమాండ్ సెంటర్లు, ఒక విమాన వాహక రీఫ్యూయలింగ్ వేదిక, సముద్ర నిఘా కోసం ఉపయోగించే పీ – 8 విమానాలను ఉంచే కేంద్రం, నాలుగు క్షిపణి ప్రయోగ వేదికలు, ఐదు ఫైటర్ విమానాల షెల్టర్లు, నాలుగు పాట్రియాట్ ఎయిర్ డిఫెన్స్ ప్రాంగణాలు, ఆరు క్షిపణి ప్రయోగ ప్యాడ్లు, ఓ ఫ్యూయల్ పంపింగ్ కేంద్రం, రెండు సిగ్నల్ కమ్యూనికేషన్ కేంద్రాలు, ఓ ఇంటెలిజెన్స్ డేటా సెంటర్, బహ్‌రైన్‌లో అమెజాన్‌తో అనుసంధానించిన ఏఐ – డేటా ప్రాసెస్ కేంద్రం, రిమోట్‌తో నడిచే మానవ రహిత నౌకల డిపో, ఫ్యూయల్ పీర్, నాలుగు ఎయిర్‌క్రాఫ్ట్ షెల్టర్లు, ఆరు ఎయిర్‌క్రాఫ్ట్ పార్కింగ్`ఫ్లయిట్ ర్యాంపులు ఇరాన్ దాడులలో ధ్వంసమయ్యాయి.
‘విమాన’ నష్టాలు
సైనిక స్థావరాలలో నిలిపి ఉంచిన 11 యుద్ధ విమానాలు, హెలికాప్టర్లను ఇరాన్ దళాలు ధ్వంసం చేశాయని ఐఆర్‌జీసీ ప్రతినిధి చెప్పారు. ఎనిమిది సరికొత్త డ్రోన్లు సహా 17 నిఘా – ఆపరేషనల్ డ్రోన్లు, షెల్టర్‌లో ఉన్న ఎఫ్ – 15 యుద్ధ విమానం, పీ – 8 సముద్ర గస్తీ విమానం, సీ -17 సైనిక రవాణా విమానం, ఎనిమిది గగనతల ఇంధన సరఫరా విమానాలు, నాలుగు హెలికాప్టర్లు, నిల్వ ఉంచిన ఆరు క్షిపణులు ధ్వంసమయ్యాయని వివరించారు.
200 మంది సైనికుల మృతి
ఇరాన్ దాడులలో అమెరికాకు చెందిన ఎనిమిది సైనిక కేంద్రాలపై దాడి జరిగిందని, వీటిలో ఒక్కో కేంద్రంలో 20 భవనాలు ఉన్నాయని, వాటిలో సైనికులు నివసిస్తుందటారని, అవన్నీ తమ దాడులలో ధ్వంసమయ్యాయని మొహేబీ తెలిపారు. తమ దాడులలో 200 మందికి పైగా అమెరికా
సైనికులు మరణించారని, అనేక మంది గాయపడ్డారని చెప్పారు.
అమెరికాకు అన్నీ ఎదురుదెబ్బలే
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES


