Saturday, August 29, 2026
E-PAPER
Homeఖమ్మంఆయిల్‌ఫామ్ నర్సరీల్లో పీఈక్యూ బృందం ద్వితీయ దశ తనిఖీలు

ఆయిల్‌ఫామ్ నర్సరీల్లో పీఈక్యూ బృందం ద్వితీయ దశ తనిఖీలు

- Advertisement -

నవతెలంగాణ – అశ్వారావుపేట
అశ్వారావుపేట, అప్పారావు పేట ఆయిల్‌పామ్ నర్సరీలను పీఈక్యూ (పోస్ట్ ఎంట్రీ క్వారంటైన్) అధికారుల బృందం శనివారం సందర్శించి క్షేత్రస్థాయిలో ద్వితీయ దశ తనిఖీలు నిర్వహించింది. దమ్మపేట మండలం అప్పారావుపేట నర్సరీలోని రెండు కన్సైన్‌మెంట్లకు చెందిన 75 వేల మొక్కలను, అశ్వారావుపేట నర్సరీలోని మూడు కన్సైన్‌మెంట్లకు చెందిన 2.25 లక్షల మొక్కలను అధికారులు పరిశీలించారు. మొత్తంగా 3 లక్షల ఆయిల్‌పామ్ మొక్కల ఆరోగ్యం, పోషణ, ఎదుగుదలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు.

మొక్కలపై ఎలాంటి తెగుళ్ల లక్షణాలు లేకపోవడంతో పాటు పోషకాల లోపం, కలుపు సమస్యలు లేకుండా శాస్త్రీయ పద్ధతుల్లో పెంచుతున్న తీరుపై పీఈక్యూ బృందం సంతృప్తి వ్యక్తం చేసింది. నర్సరీ నిర్వహణను అభినందించింది. సింగిల్‌ రో విధానంలో వరుసల మధ్య, మొక్కల మధ్య తగిన దూరం పాటించడం వల్ల ఇతర నర్సరీలతో పోలిస్తే ఇక్కడి మొక్కల నాణ్యత మెరుగ్గా ఉందని అధికారులు పేర్కొన్నారు.

నాణ్యతా ప్రమాణాలను పాటించి పెంచిన మొక్కలను రైతులకు అందించడం ద్వారా ఆయిల్‌పామ్ తోటల్లో మంచి దిగుబడులు సాధించడంతో పాటు రైతులు పురోగతి సాధించే అవకాశం ఉంటుందని అధికారులు స్పష్టం చేశారు. ఈ మొక్కలకు వచ్చే నెలలో తృతీయ దశ తనిఖీలు నిర్వహించి క్లియరెన్స్/రిలీజింగ్ ఆర్డర్ జారీ చేయనున్నారు. ఆ తనిఖీలు పూర్తయిన వెంటనే మొక్కలు రైతులకు అందుబాటులోకి రానున్నాయి.

మొక్కలు తీసుకోవాలనుకునే రైతులు ముందుగానే పొలాల్లో గుంతలు సిద్ధం చేసుకోవాలని, ఎల్‌నినో ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని ముందస్తుగా డ్రిప్ ఇరిగేషన్ వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలని డివిజనల్ అధికారి ఎస్. శంకర్ సూచించారు. ఈ తనిఖీల్లో పీఈక్యూ అధీకృత తనిఖీ అధికారి డాక్టర్ బి. పుష్పవతి, ప్లాంట్ ప్రొటెక్షన్ అధికారులు రాం కుమార్, వెంకటరెడ్డి, ఆయిల్‌ఫెడ్ డీఓ ఎస్. శంకర్, నర్సరీ ఇన్‌చార్జీలు బి. మహేష్, బి. ముద్దు కృష్ణ పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -