హెచ్‌ఎండీఏ మెగా ఈ-వేలానికి
రెస్పాన్స్ అదుర్స్
63 ప్లాట్లు విక్రయం.. రూ. 120 కోట్ల ఆదాయం
సగటున గజం ధర రూ. 56,260
నవతెలంగాణ-సిటీబ్యూరో
హైదరాబాద్‌లో హెచ్‌ఎండీఏ మేడిపల్లి లేఅవుట్‌లో నిర్వహించిన మూడో విడత ప్లాట్ల ఈ-వేలానికి కొనుగోలుదారుల నుంచి అనూహ్య స్పందన లభించింది. బుధవారం నిర్వహించిన ఈ వేలంలో నివాస స్థలాల కోసం రియల్టర్లు, గృహ వినియోగదారులు పోటెత్తారు. మేడిపల్లి ప్రాంతానికి ఉన్న డిమాండ్‌ను ప్రతిబింబిస్తూ వేలం పాట హోరాహోరీగా సాగింది. మార్కెట్ అంచనాలను మించి స్థలాల ధరలు పలకడం విశేషం.
గజం గరిష్ట ధర రూ. 80వేలు
ఈ లేఅవుట్‌లో మొత్తం 68 ప్లాట్లను వేలానికి ఉంచగా, అందులో 63 ప్లాట్లు అమ్ముడయ్యాయి. వీటిలో ఒక ప్లాట్‌కు గరిష్టంగా గజానికి రూ. 80,000 ధర పలికింది. ఇక సగటున గజం ధర రూ. 56,260గా నమోదైంది. ఈ విక్రయాల ద్వారా ప్రభుత్వానికి సుమారు రూ. 120 కోట్ల ఆదాయం సమకూరినట్టు అధికారులు వెల్లడించారు. వేలంలో ప్లాట్లు పొందిన వారు నిబంధనల ప్రకారం మొత్తం ధరలో(ఈఎండీ మినహాయించి) 25 శాతాన్ని ప్రాథమికంగా చెల్లించాల్సి ఉంటుంది. మిగిలిన మొత్తాన్ని 60 రోజుల వ్యవధిలో చెల్లించేందుకు అవకాశం కల్పించారు. ఇదిలావుంటే మిగిలిన ఐదు ప్లాట్లు మాత్రం ఇరుకైనా రోడ్లు, శ్మశాన వాటికకు సమీపంలో ఉండటం వంటి కారణాల వల్ల బిడ్డింగ్‌కు రాలేదని సమాచారం.
తూర్పు వైపు పరుగులు తీస్తున్న అభివృద్ధి
హైదరాబాద్ నగరం పశ్చిమ వైపుకే పరిమితం కాకుండా తూర్పు దిశలో ఉన్న ‘ఈస్టర్న్ గ్రోత్ కారిడా ర్’లో రియల్ ఎస్టేట్ రంగానికి పెరుగుతున్న ఆదరణను ఈ వేలం ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి. దానికితోడు మేడిపల్లి ప్రాంతంలో రవాణా సౌకర్యాలు మెరుగుపడటం, మౌలిక వసతుల కల్పన వంటి అంశాలు పెట్టుబడిదారులను ఆకర్షించాయి. ఫలితంగా ప్లాట్ల కోసం జరిగిన పోటీ మార్కెట్ నమ్మకాన్ని, హెచ్‌ఎండీఏ అభివృద్ధి చేసిన లేఅవుట్లపై ఉన్న క్రేజ్‌ను చాటిచెప్పింది.
హోరాహోరీగా బిడ్డింగ్
ఒక్కో ప్లాట్ కోసం పలువురు బిడ్డర్లు పోటీ పడటంతో వేలం ప్రక్రియ ఆసక్తికరంగా సాగింది. పారదర్శకంగా జరిగిన ఈ-వేలంలో హైదరాబాద్‌తో పాటు పరిసర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో పెట్టుబడిదారులు పాల్గొన్నారు. ఈ విజయవంతమైన వేలంతో మేడిపల్లి, దాని పరిసర ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధి మరింత వేగవంతం కానుందని రియల్ రంగం నిపుణులు విశ్లేషిస్తున్నారు.
మేడిపల్లిలో గజం రూ. 80 వేలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



