Tuesday, August 25, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలల ప్రయివేటీకరణ ఆపాలి

ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలల ప్రయివేటీకరణ ఆపాలి

- Advertisement -


జీవో 97ను తక్షణమే రద్దు చేయాలి
విద్యార్థుల ఆందోళనలపై నిర్బంధం అప్రజాస్వామికం
సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌

రాష్ట్రంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలను ప్రయివేటీకరణ దిశగా తీసుకెళ్లే చర్యలను ప్రభుత్వం తక్షణమే నిలిపేయాలని సీపీఐ(ఎం) తెలంగాణ రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసింది. ఈ మేరకు ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి జాన్‌ ‌వెస్లీ సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. స్కిల్, ఉపాధి కల్పిస్తామనే పేరుతో పేద, మధ్యతరగతి విద్యార్థులకు అందుబాటులో ఉన్న ప్రభుత్వ సాంకేతిక విద్యను బలహీనపరచడమేంటని ప్రశ్నించారు. ప్రభుత్వ కళాశాలలకు అవసరమైన నిధులు కేటాయించి మౌలిక వసతులు, ప్రయోగశాలలు, హాస్టళ్లు, బోధనా సిబ్బందిని పెంచి విద్యా ప్రమాణాలను మెరుగుపరచాల్సిన ప్రభుత్వం, అందుకు విరుద్ధంగా వ్యవహరించడం ఆందోళనకరమని పేర్కొన్నారు. జీవోనెం97ను తక్షణమే రద్దు చేసి, పాలిటెక్నిక్ విద్యను రాష్ట్ర సాంకేతిక విద్యా వ్యవస్థలోనే కొనసాగించాలని డిమాండ్‌ ‌చేశారు.
ప్రజాపాలన అంటే ప్రజల గొంతును వినడం, వారి సమస్యలపై చర్చించడం, ఆందోళనలకు అవకాశం కల్పించడమనీ, కానీ రాష్ట్రంలో ధర్నా చౌక్‌లో కూడా శాంతియుతంగా నిరసన తెలిపే హక్కు లేకుండా పోయిందని పేర్కొన్నారు. ఇందిరా పార్కు ధర్నా వద్ద ఎస్‌ఎ‌ఫ్‌ఐ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆందోళన సందర్భంగా విద్యార్థి నాయకులను, కార్యకర్తలను ముందస్తు నిర్బంధాలతో అక్రమంగా అరెస్ట్ చేయడం దుర్మార్గమైన చర్యని తెలిపారు. విద్యార్థుల సమస్యలకు పరిష్కారం చూపాల్సిన ప్రభుత్వం వారిపై నిర్బంధాలు ప్రయోగించడం ద్వారా సమస్యను మరింత తీవ్రతరం చేస్తోందని విమర్శించారు. ప్రజాస్వామ్య హక్కుల కోసం పోరాడిన చరిత్ర తమదని చెప్పుకునే కాంగ్రెస్ అధికారంలోకొచ్చిన తర్వాత విద్యార్థుల నిరసనలను అణచివేయడం సిగ్గుచేటని విమర్శించారు. నియంత పాలన పోవాలని ప్రజలు పోరాడిన రాష్ట్రంలో, ప్రజా ఉద్యమాలపై ఆంక్షలు విధిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం నియంతృత్వ ధోరణులను ప్రదర్శించడం విడ్డూరంగా ఉందని తెలిపారు. విద్యార్థుల ప్రజాస్వామ్య హక్కులను కాపాడి, అక్రమ అరెస్టులకు స్వస్తి చెప్పాలని డిమాండ్ చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -