జేఎస్ సీ సమావేశంలో
సీఎస్ రామకృష్ణారావు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
ఉద్యోగులకు మెరుగైన వైద్యం అందించడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు స్పష్టం చేశారు. సోమవారం హైదరాబాద్ లోని డాక్టర్ బి. ఆర్. అంబెద్కర్ తెలంగాణ సచివాలంలో జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ ప్రతినిధులతో ఉద్యోగుల హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్ (ఈహెచ్ఎస్) అమలుపై నిర్వహించిన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశానికి ఆయన అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఉద్యోగ సంఘాల నేతలు లేవనెత్తిన పలు అంశాలపై స్పందించారు. స్పష్టమైన హామీలు, వివరణలు ఇచ్చారు. ఉద్యోగుల ఆరోగ్య సంరక్షణ నిధిని పర్యవేక్షించే ‘ఎంప్లాయీస్ హెల్త్ కేర్ ట్రస్ట్’ ఒక స్వయంప్రతిపత్తి సంస్థగా పని చేస్తుందన్నారు. ఉద్యోగులు అందించే 1.5 శాతం వాటాకు సమానంగా ప్రభుత్వ వాటాను కూడా అదే రోజున ట్రస్ట్ ఖాతాలో ప్రభుత్వం జమ చేస్తుందని తెలిపారు. ఈ పథకం పర్యవేక్షణ కోసం రాబోయే 2 నుంచి 3 రోజుల్లో ప్రత్యేక ఈహెచ్ఎస్ కమిటీని ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించారు. పథకానికి సంబంధించిన పూర్తి నిబంధనలు, విధివిధానాలకు రాబోయే 7 రోజుల్లో తుది రూపం ఇస్తామని తెలిపారు. ఉద్యోగులకు అంతర్జాతీయ స్థాయి వైద్య సదుపాయాలు అందాలన్నదే ప్రభుత్వ సంకల్పమని సీఎస్ తెలిపారు. వైద్య సేవలు మరింత మెరుగ్గా ఉండాలంటే దానికి తగ్గట్టుగానే కాంట్రిబ్యూషన్ కూడా కొంత అదనంగా ఉంటుందని సీఎస్ పేర్కొన్నారు. ప్రతి నెల ఒకటిన (జీతాల రోజే) ఉద్యోగుల వాటాను మినహాయించడం వెనుక మరే ఇతర ఉద్దేశం లేదని స్పష్టం చేశారు. గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన హామీ ప్రకారం ఈ హెల్త్ స్కీంను అత్యంత వేగంగా, సమర్థవంతంగా అమలు చేయాలన్నదే ప్రభుత్వ ఏకైక లక్ష్యమని తెలిపారు. ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు బెన్ హర్ మహేశ్ ఎక్కా, దాన కిశోర్, ముఖ్య కార్యదర్శులు సందీప్ కుమార్ సుల్తానియా, క్రిస్టీనా జెడ్ చొంగ్తూ తదితర ఉన్నతాధికారులతో పాటు టీజీవోల అధ్యక్షులు ఏలూరి శ్రీనివాసరావు, టీఎన్జీవో అధ్యక్షులు ఎం.జగదీశ్వర్, డిప్యూటీ కలెక్టర్ల అసోసియేషన్ అధ్యక్షులు లచ్చిరెడ్డి, ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణ, టీఎస్ యూటీఎఫ్ అధ్యక్షులు చావ రవి, ప్రధాన కార్యదర్శి ఎ.వెంకట్ తదితర సంఘాల నేతలు పాల్గొన్నారు.
టీఎస్ యూటీఎఫ్ హర్షం
జూన్ 2 నుంచి ఉద్యోగుల ఆరోగ్య పథకం అమలు చేస్తానని సీఎస్ ప్రకటించడం పట్ల టీఎస్ యూటీఎఫ్ హర్షం వ్యక్తం చేసింది. ఈ మేరకు టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు చావ రవి, ప్రధాన కార్యదర్శి ఎ.వెంకట్ సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. మినహాయింపు తప్పనిసరి అయినందునే చేసినట్టు సీఎస్ వివరణ ఇచ్చారని తెలిపారు. ఉద్యోగులకు కనీస సమాచారం ఇవ్వకుండా వేతనాల కోత విధించడం అలాగే భార్యభర్తలు ఇద్దరు ఉద్యోగులు/పెన్షనర్లు అయినప్ప్పుడు ఇద్దరికి కోత విధించడం పై అసంతృప్తి వ్యక్తం చేసినట్టు వెల్లడించారు. అలాగే ఎలాంటి మార్గదర్శకాలు జారీ చేయకుండా ఒకవైపు ఆన్‌లైన్ సమాచారం సేకరిస్తూ మరోవైపు కోత విధించడంపై ఆస్పత్రులతో సంప్రదింపులు జరుపకపోవడంపై అలాగే వైద్యానికి ప్యాకేజీ రేట్లు నిర్ణయించకపోవడం ఉద్యోగుల వేతనం మినహాయింపుతోపాటు ప్రభుత్వ వాటా చెల్లింపుపై స్పష్టతనివ్వాలని వారు కోరారు. అవుట్ పేషంట్ ట్రిట్‌మెంట్‌కు అనుమతించాలని 50 ఏళ్ళు నిండిన అందరికి సంవత్సరానికి ఒకసారి మాస్టర్ హెల్త్‌చెకప్‌కు అవకాశం ఇవ్వాలని తదితర అంశాలను ప్రాతినిధ్యం చేశారు. సమావేశం ఏర్పాటు చేసి సందేహాలపై స్పందించినందుకు టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర కమిటీ పక్షాన హర్షం తెలిపారు.
ఉద్యోగులకు మెరుగైన వైద్యం అందించడమే ప్రభుత్వ లక్ష్యం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



