Wednesday, September 23, 2026
E-PAPER
Homeఎడిట్ పేజిచరిత్రను పలకరించిన వీరవనితల స్ఫూర్తి యాత్ర

చరిత్రను పలకరించిన వీరవనితల స్ఫూర్తి యాత్ర

- Advertisement -

వీర తెలంగాణ వీరవనితల స్ఫూర్తి యాత్ర మూడు రోజుల ప్రయాణమే అయినా, అది ఒక తరానికి చెందిన పోరాట చరిత్రను మరో తరానికి చేరవేసిన స్ఫూర్తి యాత్రగా నిలిచింది. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం సాగిన నేలపై అడుగడుగునా అమరవీరుల జ్ఞాపకాలు, వీరవనితల త్యాగాలు, ప్రజల పోరాట గాథలు సజీవంగా కనిపించాయి. అమరవీరుల కుటుంబాలను కలుసుకోవడం, పోరాట ప్రాంతాలను సందర్శించడం, ఆనాటి సంఘటనలను స్థానికుల నుంచి తెలుసుకోవడం ద్వారా పుస్తకాల్లోని చరిత్రకు సజీవ రూపాలు కండ్ల ముందు సాక్షాత్కరించాయి.
తెలంగాణ సమాజంలో వచ్చిన మార్పుకు ఆనాటి సాయుధ పోరాటమే కీలకమైన పునాది. నిజాం నిరంకుశ పాలన, భూస్వాముల దౌర్జన్యాలు, వెట్టి చాకిరికి వ్యతిరేకంగా సాగిన ఆ మహత్తర పోరాటంలో రైతులు, కూలీలు, యువతతో పాటు మహిళల పాత్ర అత్యంత అసామాన్యమైనది. ఒకవైపు తుపాకులు పట్టిన వీరత్వం, మరోవైపు అడవుల్లోని దళాలకు ఆహారం, సమాచారం అందించడంలో అంకితభావం. కళ్లెదుటే భర్తలు, అన్నదమ్ములు నేలకొరిగినా… ఆ కన్నీటినే ఆయుధంగా మార్చుకుని రణక్షేత్రంలో అజేయంగా నిలిచారు ఆ వీరనారీమణులు.
తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో మహిళల వీరోచిత పాత్రను స్మరించుకుంటూ, ఆ నాటి వీరగాథలను నేటి తరానికి అందించేందుకు ‘వీర తెలంగాణ వీరవనితల స్ఫూర్తి యాత్ర’ సాగింది. సెప్టెంబర్ 15 నుండి 17 వరకు ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్లగొండ జిల్లాల్లోని చారిత్రక పోరాట ప్రాంతాల మీదుగా ఈ యాత్ర సాగింది.

త్యాగాల నేలపై అడుగులు
పాలకుర్తిలో వీరనారి ఐలమ్మ విగ్రహానికి పూలమాల వేయడంతో యాత్ర ప్రారంభమైంది. ఐలమ్మ ఒక వ్యక్తి మాత్రమే కాదు. భూమి, శ్రమ, ఆత్మగౌరవం కోసం అణగారిన ప్రజలు సాగించిన పోరాటానికి ఆమె ఒక ప్రతీక. తాను సాగు చేసిన భూమి పంటపై హక్కు కోసం భూస్వామ్య దౌర్జన్యాలను ఎదిరించిన ఐలమ్మ పోరాటం తెలంగాణ మహిళా చరిత్రలో చెరగని అధ్యాయం. పాలకుర్తి నుంచి తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమరయ్య స్మారక ప్రాంతానికి యాత్ర సాగింది. అక్కడ నివాళులు అర్పించిన అనంతరం దర్గా నాయక్‌, షేక్ బందగి విగ్రహాలకు పూలమాలలు వేసి బైరాన్‌పల్లికి చేరుకుంది.
రక్తం చిందిన బైరాన్‌పల్లి బురుజు వద్ద నిలబడితే… ఆనాటి వీరుల ఆక్రందనలు, ఆత్మగౌరవ పోరాట ఘోషలు గుండెను కదిలించివేస్తాయి. రాక్షస సైన్యాన్ని ఎదుర్కొంటూ ఊరి ఉనికి కోసం, స్వేచ్ఛ కోసం అక్కడి ప్రజలు చిందించిన ప్రతీ నెత్తురు బొట్టు ఒక చరిత్ర పుట. మరీ ముఖ్యంగా నిశ్శబ్దంగా ఉన్న ఇళ్ల నుంచి రణరంగానికి కదిలివచ్చిన మహిళల తెగువ ఈ యాత్రకు అసలైన అర్థాన్ని ఇచ్చింది. ఆ అమరవీరుల త్యాగాలకు స్మరిస్తూ, వారి పోరాట జ్వాలను నేటి తరానికి అందించాల్సిన బాధ్యతను ఈ యాత్ర ప్రతీ ఒక్కరి గుండెల్లో రగిలించింది.

పిండిప్రోలు నుంచి సూర్యాపేట వరకు…
వీరవనితల త్యాగగాథ
పిండిప్రోలు గ్రామం వీరవనితల త్యాగగాథలకు సజీవ సాక్ష్యంగా నిలిచింది. చిన్న వయసులోనే భర్తను కోల్పోయి, ఇంటికే పరిమితమైన సాధారణ మహిళ రాయల రాంబాయమ్మను ఖమ్మంలో జరిగిన ఆంధ్ర మహాసభ కదిలించివేసింది. ప్రజా ఉద్యమ వైపు అడుగులు వేసి కమ్యూనిస్టు పార్టీలో చేరిన ఆమె, సాయుధ పోరాటంలో దళాలకు ప్రాణంగా నిలిచింది. సాయుధ పోరాటంలో దళాలకు సమాచారం అందించడంలో ఆమెది కీలక భూమిక. ఉద్యమానికి అండగా నిలిచారన్న కోపంతో 1949లో పోలీసులు ఆమెను జైలుపాలు చేశారు. కానీ, ఆ జైలుగోడలు ఆమె ధైర్యాన్ని బంధించలేకపోయాయి. జైలులో మహిళా ఖైదీలకు జరుగుతున్న అన్యాయాలు, నరకయాతనపై సింహంలా గర్జించారు. చివరకు కఠిన చిత్రహింసల కోరల్లో చిక్కి, కారాగారంలోనే ఆ వీరనారి చివరి శ్వాస విడిచింది. ఆ రాంబాయమ్మ త్యాగాన్ని స్థానికులు కండ్లకు కట్టినట్టు చెబుతుంటే మా కండ్లు చెమ్మగిల్లాయి. అదే నేలలో పుట్టిన బుగ్గారపు అప్పమ్మ సైతం ఏనాడూ భయపడలేదు. అడవుల్లోని దళాలకు అన్నమై నిలిచి ఉద్యమానికి అండగా నిలిచింది. జైలు గోడల మధ్యే ప్రాణాలు విడిచినా, ఆ వీరనారీమణుల త్యాగాలు పిండిప్రోలు మట్టిలో సదా సజీవంగానే ఉంటాయి. వారి చేతుల్లో పేలే తుపాకులు లేకపోవచ్చు… కానీ, పోరాట రణరంగంలో ప్రతి గుండెకోతను, ప్రతి బాధ్యతను మోసిన కొండంత ధైర్యముంది! ప్రజా ఉద్యమం అంటే కేవలం ఆయుధం చేతబట్టడమే కాదు… అడుగడుగునా ఎదురయ్యే ముళ్లబాటను స్వీకరిస్తూ, ప్రాణాలను పణంగా పెట్టి ఉద్యమానికి వెన్నుముకగా నిలవడం కూడా గొప్ప పోరాటమేనని ఆ వీరనారీమణుల త్యాగనిర్భర జీవితాలు సగర్వంగా చాటాయి.

పిండిప్రోలు మట్టిలో వీరయోధురాలు మల్లు స్వరాజ్యం చిన్ననాటి అడుగుల జ్ఞాపకాలు నేటికీ పదిలంగానే ఉన్నాయి. ఆనాటి బాల్యంలో ఆమె ఆటపాటల వయసులోనే అడవి బాట పట్టి, ఉద్యమంలో మమేకమవుతుంటే ఆ పసిపాప భవిష్యత్తు తలచుకుని ఊరి జనం కంగారుపడేవారు. కానీ, అదే చిన్నారి పదమూడేళ్ల లేత వయసులోనే భయమనే పదాన్ని తుడిచేసి, భుజాన తుపాకీ పట్టి రణరంగాన నిలిచింది. ఐదేళ్ల పాటు కంటిమీద కునుకు లేకుండా అజ్ఞాతంలోఉంటూనే పోరాటజ్వాలని రగిలించిన ఆమె ధీరత్వం చరిత్ర పేజీల్లో చిరస్మరణీయం. గోకనపల్లిలో ఎర్రమనేని వెంకట నరసయ్య, ఆయన భార్య రాజమ్మ పోరాట జీవితాన్ని స్థానికులు వివరించారు. పోరాటంలో భర్తతో పాటు తాను కూడా నడుస్తానని, ఆయన ఎటు వెళ్తే తానూ అటే వస్తానని రాజమ్మ ప్రకటించి పోరాట మార్గాన్ని ఎంచుకున్న గాథ మహిళల నిబద్ధతకు ప్రతీకగా నిలిచింది.
సూర్యాపేట జిల్లాలోని మోతె, బాలెంల, తిమ్మాపురం, అర్వపల్లి, కాసర్లపాడు, కరివిరాల కొత్తగూడెం, గోరంట్ల వంటి వీరభూముల గుండా ఈ స్ఫూర్తి యాత్ర ముందుకు సాగింది. అక్కడ ప్రతీ ఊరు ఒక పోరాట చరిత్రను, ప్రతీ నేల ఒక త్యాగగాథను వినిపించింది. కాసర్లపాడులో 17 మంది అమాయకులను ఒకే కొట్టంలో బంధించి నిలువునా తగలబెట్టిన ఆ రాక్షసకాండ జరిగిన ప్రదేశానికి చేరగానే ప్రతీ ఒక్కరి గుండె నిశ్శబ్దంగా రోదించింది. ఆ ఘోరకలిలో అమరులైన వారి కుటుంబాలను కలుసుకొని, వారి వారసులను సన్మానిస్తుంటే… ఒక తరం చిందించిన రక్తం, మరో తరానికి స్ఫూర్తిగా మారుతున్న క్షణాలు కళ్లెదుట మెదిలాయి. కరివిరాల కొత్తగూడెంలో భీంరెడ్డి నర్సింహారెడ్డి, మల్లు స్వరాజ్యం, మైసయ్య, కుషావలరెడ్డి వంటి వీరులకు నివాళులర్పించారు. జీవితాంతం అణగారిన వర్గాల కోసం శ్రమించిన మల్లు స్వరాజ్యం, ఆమె సోదరి శశిరేఖల వీరోచిత పాత్రను ఈ సందర్భంగా స్మరించుకున్నారు

అమరుల జ్ఞాపకాలు… నేటి తరానికి బాధ్యత
సూర్యాపేట నుంచి నల్గొండ జిల్లాలోని వనిపాకల, బొల్లెపల్లి గ్రామాలకు యాత్ర కొనసాగింది. అక్కడ అమరులకు నివాళులర్పించి, యోధుడు రావి నారాయణరెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి స్మరించుకున్నారు. యాత్ర చివరి రోజున ఆలేరు మండలం కొలనుపాకకు చేరుకుంది. తెలంగాణ ఉద్యమ వీరనారి ఆరుట్ల కమలాదేవి స్వగ్రామమైన కొలనుపాకలో యాత్రకు ఘన స్వాగతం లభించింది. ఆరుట్ల కమలాదేవి, రామచంద్రారెడ్డి, లక్ష్మీనరసింహారెడ్డి స్మారక స్థూపాల వద్ద నాయకులు, ప్రజలు నివాళులర్పించారు. కొలనుపాకలో జరిగిన ముగింపు సభలో ఎమ్మెల్సీ గోరెటి వెంకన్న పాల్గొని పోరాట స్ఫూర్తిని రగిలిస్తున్న యాత్ర బృందాన్ని అభినందించారు.
ఈ మూడు రోజుల స్ఫూర్తి యాత్ర కేవలం విగ్రహాల సందర్శనకే పరిమితం కాలేదు. అమరవీరుల పోరాట నేలలపై నడుస్తూ, వారి వారసుల మాటల్లో ఆనాటి వీరగాథలను విన్నారు. సాయుధ పోరాటంలో మహిళలు అనుభవించిన కష్టాలను, వారి ధీరత్వాన్ని స్వయంగా తెలుసుకుని, ఆ త్యాగాల వారసత్వాన్ని నేటి తరానికి అందించే ప్రయత్నం చేశారు. ప్రతి గ్రామంలో ప్రజలు, మహిళలు, యువకులు యాత్ర బృందానికి ఆత్మీయ స్వాగతం పలికారు. హారతులు, కోలాటాలు, డప్పు దరువులతో గ్రామాలు మార్మోగాయి. ఐలమ్మ మనుమరాళ్లు మంజుల, సంధ్యారాణి, పద్మ, అంజమ్మలను సన్మానించి పుస్తకాలను బహుకరించారు. ధర్మాపురంలో దర్గా నాయకు కుటుంబాన్ని ఆత్మీయంగా పరామర్శించారు. అమరవీరుల కుటుంబాలతో మమేకమవ్వడమే ఈ యాత్రలో ప్రధాన ఘట్టంగా నిలిచింది.

స్ఫూర్తికి కొత్త ఆరంభం
చరిత్రను పుస్తకాల్లో చదవడం వేరు, ఆ చరిత్ర పుట్టిన వీరభూముల్లో నిలబడి అమరుల వారసుల మాటలు వినడం వేరు. బైరాన్‌పల్లి బురుజు నుంచి పిండిప్రోలు, కాసర్లపాడు, కరివిరాల కొత్తగూడెం మీదుగా కొలనుపాక వరకు సాగిన ఈ స్ఫూర్తి యాత్ర తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట జ్ఞాపకాలను ప్రతి అడుగులోనూ పునరుజ్జీవింపజేసింది. సాయుధ పోరాటంలో మహిళలు కేవలం అణచివేతకు గురైనవారు మాత్రమే కాదు. వారు ఉద్యమకారులు, సమాచార వాహకులు, దళాలకు అండగా నిలిచిన యోధులు. సమయం వచ్చినప్పుడు తుపాకీ పట్టి పోరాడటమే కాకుండా జైలు కష్టాలెన్నో తట్టుకుని ఆత్మగౌరవాన్ని కాపాడుకున్నారు. చాకలి ఐలమ్మ, మల్లు స్వరాజ్యం, రాంబాయమ్మ, అప్పమ్మ, రాజమ్మ, ఆరుట్ల కమలాదేవితో పాటు పేర్లు తెలియని వేలాదిమంది మహిళల త్యాగాలతో ఈ పోరాట చరిత్ర రూపుదిద్దుకుంది. అందుకే ఈ స్ఫూర్తి యాత్ర ముగింపు ఒక కార్యక్రమానికి ఆఖరి ఘట్టం కాదు! మరుగున పడుతున్న త్యాగాలను తిరిగి వెలికితీసేందుకు, ఆనాటి పోరాట జ్వాలని నేటి తరానికి అందించేందుకు పడిన శ్రీకారం. పాలకుర్తిలో ఐలమ్మ నేలపై రగిలిన ఈ జ్వాల కొలనుపాకలో ఆరుట్ల కమలాదేవి నివాసంలో ముగిసి ఉండవచ్చు… కానీ ఐలమ్మ చూపిన ఆత్మగౌరవ దారికి, మల్లు స్వరాజ్యం ధైర్యానికి, ఆరుట్ల కమలాదేవి నిబద్ధతకు ఎన్నటికీ ముగింపు లేదు! వారి జీవితాలు గడిచిపోయిన కాలపు జ్ఞాపకాలు కావు… అన్యాయాన్ని ప్రశ్నించే ప్రతి తరానికి అవి సదా రగిలే నిత్య స్ఫూర్తిప్రదాతలు!
వీర తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట అమరవీరులకు జోహార్లు!
వీర తెలంగాణ వీరవనితలకు జోహార్లు!
వీరనారి ఐలమ్మకు జోహార్లు!
ఆరుట్ల కమలాదేవికి జోహార్లు!
మల్లు స్వరాజ్యానికి జోహార్లు!
వారి పోరాటం చరిత్ర.
వారి త్యాగం స్ఫూర్తి.
ఆ స్ఫూర్తిని తరతరాలకు అందించడమే ఈ యాత్రకు అసలైన అర్థం.
మల్లు లక్ష్మి 9848481099

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -