Wednesday, September 23, 2026
E-PAPER
Homeఎడిట్ పేజిఅందరి కోసం ఐక్యరాజ్యసమితి!

అందరి కోసం ఐక్యరాజ్యసమితి!

- Advertisement -

ఐక్యరాజ్య సమితి(ఐరాస) 81వ సాధారణ సభ ఈ నెల 21న ప్రారంభమైంది.. ప్రపంచ దేశాల అధినేతలు, ప్రతినిధులు ఒకే వేదికపైకి వచ్చారు. ఉన్నతస్థాయి చర్చలు మొదలయ్యాయి. యుద్ధం, శాంతి, అభివృద్ధి, పేదరికం, వాతావరణ సంక్షోభం, మానవ హక్కులు, సాంకేతిక పరిజ్ఞానం… ఇలా ఈ కాలాన్ని కలవరపెడుతున్న ప్రతి అంశమూ అక్కడి ప్రసంగాల్లో చోటు చేసుకుంటోంది. “విశ్వాసాన్ని పునరుద్ధరించడం, మార్పునకు పాటుపడటం, అందరి కోసం ఐక్యరాజ్య సమితిగా రూపొందడం” అనేది ఈ సమావేశాల ఇతివృత్తం. కానీ సభ ప్రారంభమైన మొదటి రోజే ఆ ఇతివృత్తంలోని “విశ్వాసం” అనే పదం ఎంత సంక్షోభంలో ఉందో ప్రపంచానికి స్పష్టమైంది. ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెర్రెస్ తన చివరి ప్రసంగంలో… అంతర్జాతీయ వ్యవస్థలోని పగుళ్లు ఇప్పుడు “లోయలుగా” మారాయని హెచ్చరించారు. “యుద్ధం, అసమానత, వాతావరణ మార్పు, కృత్రిమ మేధస్సు” ఈ నాలుగింటినీ ప్రపంచం ముందున్న ప్రధాన సవాళ్లుగా ఆయన ప్రస్తావించారు. అంతర్జాతీయ చట్టం పక్కకు నెట్టబడుతోందని, ప్రపంచం ప్రత్యర్థి కూటములుగా విడిపోవడం ప్రమాదకరమని అన్నారు.
ఈ సమావేశాలకు వెలుపల జరుగుతున్న పరిణామాలకు గుటెర్రస్ మాటలు అద్ధం పడుతున్నాయి. మధ్యప్రాచ్యం ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ. గాజాలో యుద్ధం, పౌరుల మరణాలు, నిర్వాసితత్వం, మానవతా సంక్షోభం కొనసాగు తూనే ఉన్నాయి. వెస్ట్‌బ్యాంక్‌లో సెటిల్‌మెంట్ల విస్తరణ రెండు దేశాల పరిష్కారాన్ని మరింత సంక్లిష్టం చేస్తోందని గుటెర్రెస్ హెచ్చరించారు. అంతర్జాతీయ న్యాయస్థానం ఆదేశాలను పాటించాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రపంచశాంతిని ఆకాంక్షించారు. అదే వేదిక నుంచి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన యుద్ధోన్మాదాన్ని ప్రదర్శించారు. ఇరాన్‌కు తీవ్రమైన సైనిక హెచ్చరిక చేశారు. అయితే అదే రోజు న్యూయార్క్‌లో ఇరాన్-అమెరికా మధ్య మధ్యవర్తుల ద్వారా చర్చలు కూడా జరిగాయి. ఇక్కడే ఈ సమావేశాల అసలు వైరుధ్యం కనిపిస్తోంది. ఒకే రోజు, ఒకే నగరంలో, ఒకే అంతర్జాతీయ వేదిక నీడలో… ఒకవైపు యుద్ధ హెచ్చరిక వినిపిస్తోంది, మరోవైపు దౌత్యయత్నం కూడా జరుగుతోంది. ఇది ఐరాస బలమా? బలహీనతా? సమాధానం అంత సులభం కాదు.

చరిత్ర ఒక్కచోట ఆగిపోదు
ఐరాసను అర్థం చేసుకోవాలంటే అది పుట్టిన చరిత్రను గుర్తు చేసుకోవాలి. రెండు ప్రపంచ యుద్ధాల రక్తపు మరకల మధ్య, కోట్లాది ప్రాణాల బలిదానాల అనంతరం ఆ సంస్థ పుట్టింది. మానవాళిని మళ్లీ ఓ మహాయుద్ధం మింగకూడదన్న ఆకాంక్ష దాని వెనుక ఉంది. వలస సంకెళ్లను తెంచుకుంటున్న దేశాల గొంతు వినిపించే ఒక అంతర్జాతీయ వేదికగా ఐరాసకు ఆనాడు చారిత్రక ప్రాధాన్యం వచ్చింది. కానీ నేడు ప్రపంచం మారిపోయింది. వలస సామ్రాజ్యాలు కూలిపోయాయి. కొత్త దేశాలు పుట్టాయి. ఆసియా, ఆఫ్రికా, లాటిన్ అమెరికా ప్రజలు స్వాతంత్య్రాన్ని సాధించారు. ప్రపంచ ఆర్థిక శక్తి కేంద్రాలు కదిలాయి. సోషలిస్టు శిబిరం ఆవిర్భవించింది, తరువాత దాని విచ్ఛిన్నం జరిగింది. ప్రపంచ పెట్టుబడి కొత్త రూపాలు ధరించింది. బహుళజాతి సంస్థలు దేశాల సరిహద్దులను దాటి తమ ప్రభావాన్ని విస్తరించాయి. ఫైనాన్స్ పెట్టుబడి క్షణాల్లో ఖండాలను దాటే శక్తిని సంపాదించింది. కానీ ప్రపంచ రాజకీయ సంస్థల నిర్మాణంలో రెండో ప్రపంచ యుద్ధం నాటి శక్తి సమీకరణాల ముద్ర ఇంకా చెరిగిపోలేదు. భద్రతామండలిలో ఐదు శాశ్వత సభ్య దేశాలకు ఉన్న వీటో అధికారమే దీనికి ప్రతీక. సాధారణ సభలో ప్రతి దేశానికీ ఒక ఓటు ఉండటం ప్రజాస్వామ్య సూత్రానికి ఒక రూపం. కానీ ప్రపంచ రాజకీయాల్లో ఓటు బలం ఒక్కటే శక్తి కాదు. సైనిక బలం, ఆర్థిక బలం, సాంకేతిక బలం, దౌత్య ప్రభావం… ఇవన్నీ కలిసే అసలు శక్తి సమీకరణాన్ని నిర్ణయిస్తాయి. అక్కడే ఐరాస వాగ్దానం, భౌతిక వాస్తవం పరస్పరం ఢీకొంటాయి. దేశాలు సమానమని అంతర్జాతీయ చట్టం చెబుతుంది. కానీ ప్రపంచం సమానంగా లేదు.
భారతదేశం కూడా ఈ చర్చలో తన స్థానాన్ని ముందుకు తెస్తోంది. విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ ఈ సందర్భంగా అంతర్జాతీయ సహకారం, అంతర్జాతీయ చట్టం, బహుళపక్ష వ్యవస్థను బలోపేతం చేయాల్సిన అవసరాన్ని ప్రస్తావించారు. గ్లోబల్ సౌత్ దేశాలు ఎదుర్కొంటున్న యుద్ధాలు, వాణిజ్య అంతరాయాలు, అప్పుల భారం, అభివృద్ధి ఆర్థిక వనరుల కొరత వంటి సమస్యలు కూడా ఈ చర్చలో కీలకంగా ఉన్నాయి. ఇది ఒక ముఖ్యమైన మార్పును సూచిస్తోంది. ప్రపంచ రాజకీయాలను కేవలం వాషింగ్టన్, మాస్కో, బీజింగ్, బ్రస్సెల్స్ వంటి శక్తి కేంద్రాల మధ్య పోటీగా మాత్రమే చూడలేం. ఆసియా, ఆఫ్రికా, లాటిన్ అమెరికా దేశాలు తమ ఆర్థిక, రాజకీయ, వ్యూహాత్మక ప్రయోజనాలకు మరింత స్థలం కోరుతున్నాయి. గ్లోబల్ సౌత్ దేశాల గొంతు ఇప్పుడు సహాయం కోసం విజ్ఞప్తి చేసే స్థాయిని దాటి, ప్రపంచ నిర్ణయ ప్రక్రియలో సమాన హక్కు అనే డిమాండ్‌గా మారుతోంది.

ఈ అసమానతకు మూలం ఎక్కడ?
ఈ ప్రశ్నను తప్పించుకుని ముందుకు వెళ్లలేం. రాజకీయాన్ని ఆర్థిక వ్యవస్థ నుంచి వేరుచేసి చూడటం అంటే చెట్టును చూసి దాని వేర్లను చూడనట్టే. ప్రపంచ రాజకీయాల ఉపరితలంపై దేశాలు, సరిహద్దులు, కూటములు, దౌత్య సంబంధాలు కనిపిస్తాయి. వాటి అడుగున మాత్రం పెట్టుబడి తన ప్రయాణాన్ని కొనసాగిస్తూనే ఉంటుంది. ముడిసరుకు ఎక్కడుంది? మార్కెట్ ఎక్కడుంది? చౌకైన శ్రమ ఎక్కడుంది? ఇంధన వనరులు ఎక్కడున్నాయి? రవాణా మార్గాలు ఎవరి ఆధీనంలో ఉన్నాయి? సాంకేతిక పరిజ్ఞానంపై పట్టు ఎవరిది? ఈ ప్రశ్నలన్నీ అంతర్జాతీయ రాజకీయాల గర్భంలోకి తీసుకెళ్తాయి. అందుకే యుద్ధం ఎప్పుడూ కేవలం సరిహద్దుల మధ్య జరిగే సంఘటన కాదు. దాని వెనుక భూభౌగోళిక ప్రయోజనాలు ఉంటాయి. వనరులపై ఆధిపత్యం ఉంటుంది. మార్కెట్లపై పట్టు కోసం పోటీ ఉంటుంది. సైనిక కూటముల ప్రయోజనాలు ఉంటాయి. ఆయుధ పరిశ్రమకు మార్కెట్లు ఉంటాయి. సామ్రాజ్యవాద శక్తి తన ప్రభావ పరిధిని నిలబెట్టుకోవాలనే ఆకాంక్ష ఉంటుంది. అందుకే మార్క్స్ పెట్టుబడిని కేవలం సంపదగా చూడలేదు, విస్తరణకు తహతహలాడే సామాజిక శక్తిగా చూశాడు. అది జాతీయ సరిహద్దులను దాటినప్పుడు ప్రపంచీకరణ రూపం తీసుకుంటుంది. ఈ పెట్టుబడి మొత్తం ప్రపంచాన్నంతా ఒకే మార్కెట్‌గా కుట్టేస్తుంది. కానీ సంపదను మాత్రం సమానంగా పంచదు.
ఇక్కడే నేటి ప్రపంచపు ప్రధాన వైరుధ్యం దాగి ఉంది. ఉత్పత్తి ప్రపంచవ్యాప్తమైంది. శ్రమ ప్రపంచవ్యాప్తమైంది. మార్కెట్ ప్రపంచవ్యాప్తమైంది. కానీ సంపదపై నియంత్రణ మాత్రం కేంద్రీకృతమైంది. అందుకే ప్రపంచ పేదరికాన్ని కేవలం పేద దేశాల లోపంగా చూడటం చరిత్రను తలకిందులు చేయడమే. వలస పాలన శతాబ్దాల పాటు ఆసియా, ఆఫ్రికా, లాటిన్ అమెరికా వనరులను ప్రపంచ పెట్టుబడి విస్తరణకు ఉపయోగించింది. స్వాతంత్య్రం వచ్చిన తరువాత కూడా అసమాన వాణిజ్య సంబంధాలు, అప్పులు, సాంకేతికంగా ఆధారపడటం, మూలధన ప్రవాహాల అసమానతలు అనేక దేశాల అభివృద్ధిని పరిమితం చేశాయి. అందుకే ఒక దేశం పేదగా ఉండటానికి ఆ దేశ ప్రజలే కారణమని చెప్పే సిద్ధాంతం చరిత్రకు చేసే అన్యాయం. పేదరికం కూడా ఉత్పత్తి చేయబడుతుంది. అసమానత కూడా నిర్మించబడుతుంది. అధీనత కూడా ఒక వ్యవస్థలోనే పుడుతుంది.

వాతావరణ సంక్షోభం కూడా ఇదే కథను మరో రూపంలో చెబుతోంది. భూమి వేడెక్కుతోంది. సముద్ర మట్టాలు పెరుగుతున్నాయి. తుపాన్లు, వరదలు, కరువులు, పంట నష్టాలు తీవ్రతరం అవుతున్నాయి. కానీ ఈ సంక్షోభానికి కారణమైన ఉత్పత్తి విధానాల చరిత్ర సమానంగా లేదు. పారిశ్రామిక విప్లవం నుంచి అపారమైన సంపదను కూడబెట్టుకున్న దేశాల అంతులేని ఉద్గారాలు ఒక వైపు ఉంటే, వాతావరణ మార్పుల దెబ్బను అధికంగా భరిస్తున్న పేద సమాజాలు మరో వైపు ఉన్నాయి. అందుకే వాతావరణ న్యాయం అంటే చెట్లు నాటడం మాత్రమే కాదు. కాలుష్యానికి కారకులెవరు? లాభపడింది ఎవరు? నష్టపోతున్నది ఎవరు? పరిష్కారానికి మూల్యం చెల్లించాల్సింది ఎవరు? ఈ నాలుగు ప్రశ్నలు లేకుండా వాతావరణ చర్చ అసంపూర్ణం.
అలాగే కొత్త సాంకేతిక విప్లవం కూడా మానవ విముక్తికి స్వయంగా హామీ ఇవ్వదు. కృత్రిమ మేధస్సు ఉత్పాదకతను పెంచవచ్చు. వైద్యం, విద్య, పరిశోధనకు కొత్త మార్గాలు తెరవవచ్చు. కానీ ఆ సాంకేతికతపై యాజమాన్యం కొద్దిమంది చేతుల్లోనే కేంద్రీకృతమైతే, అది కొత్త ఉత్పత్తి శక్తి మాత్రమే కాదు… కొత్త అధికార శక్తి కూడా అవుతుంది. ఇప్పుడు ప్రశ్న “సాంకేతికత ఎవరి వద్ద ఉంది?” అనేది కాదు. సాంకేతికతను ఎవరు నియంత్రిస్తు న్నారు? డేటా ఎవరిది? జ్ఞానం ఎవరిది? యంత్రాల వల్ల పెరిగిన ఉత్పాదకత ఫలితం ఎవరిది? అనేవి అసలు ప్రశ్నలు. కానీ అంతటితో ఆగిపోతే ప్రయోజనం లేదు. అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థలోని అసమానతలను కూడా ప్రశ్నించాలి. పేద దేశాల అభివృద్ధి హక్కును గుర్తించాలి. యుద్ధాన్ని ఆపే దౌత్యానికి ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలి. వాతావరణ న్యాయాన్ని నిధులూ, సాంకేతికతతో అనుసంధానించాలి. సాంకేతిక పరిజ్ఞానం మానవాళి ఉమ్మడి సంపదగా మారే మార్గాలను అన్వేషించాలి. ఈ దిశగా ఐరాస శక్తివంతం కావాలి.
అందుకే ఐరాస సంస్కరణను కేవలం పరిపాలనా వ్యవహారంగా చూడటం సరిపోదు. ఐరాసను ప్రజాస్వామ్యీ కరించాలంటే భద్రతామండలి సంస్కరణ అవసరం. ఐరాస చార్టర్ “We The People” అనే పదాలతో మొదలవుతుంది. ఆ “ప్రజలు” ఎవరు? ఉత్పత్తికి చెమటను ధారపోసే కోట్లాది మంది మనుషులు. తమ శ్రమతో ప్రపంచాన్ని నిర్మించే కార్మికులు. భూమిని పండించే రైతులు. సరిహద్దులు దాటి జీవనోపాధి కోసం వెళ్లే వలస కార్మికులు. యుద్ధాల మధ్య బతికే కుటుంబాలు. వాతావరణ మార్పుతో తమ నేలను కోల్పోతున్న సమాజాలు. వారి జీవితం అంతర్జాతీయ రాజకీయాల అంచున ఉండకూడదు. అదే కేంద్రంగా ఉండాలి.
విచిత్రమేమిటంటే… ఇప్పుడు న్యూయార్క్ నుంచి వినిపించే ప్రసంగాలు కూడా ఇదే చెబుతాయి. శాంతి పిలుపులు వస్తాయి. అభివృద్ధి లక్ష్యాలు ప్రకటించబడతాయి. మానవ హక్కుల ప్రతిజ్ఞలు పునరావృతమవుతాయి. కానీ ఇవేవీ ఆచరణలోకి రావు. అందుకే ఇక్కడ ఒక ప్రశ్న మన ముందు నిలబడాలి. ఇవన్నీ మాట్లాడిస్తున్నది ఎవరు? సమాధానం కొద్ది దేశాల రాజధానుల్లోనే ఉంటే, ఐరాస ప్రజాస్వామ్యం ఇంకా అసంపూర్ణమే. సమాధానం ప్రపంచ ఆర్థిక శక్తి కేంద్రాల్లోనే ఉంటే, వ్యవస్థ ఇంకా అసమానమే. సమాధానం యుద్ధాన్ని ఆపలేని దౌత్యంలోనే ఉంటే, శాంతి ఇంకా బలహీనమే. సమాధానం ప్రజల జీవితాల్లో కనిపించినప్పుడు మాత్రమే ఆ వ్యవస్థకు అర్థం వస్తుంది. ఐరాసకు నిజమైన పునరుజ్జీవనం కొత్త భవనం కట్టడంలో లేదు. కొత్త పదజాలం సృష్టించడంలోనూ లేదు. ప్రపంచాన్ని నడిపిస్తున్న శక్తి సంబంధాలను ప్రజాస్వామ్య నియంత్రణలోకి తీసుకురావడంలో ఉంది.

ప్రపంచానికి శాంతి కావాలి
శాంతి అంటే యుద్ధం లేకపోవడం మాత్రమే కాదు. ఆకలి, దోపిడీ, ఆధిపత్యం, అసమానతల మధ్య ఉన్న నిశ్శబ్దాన్ని కూడా శాంతి అనలేం. ప్రపంచానికి అభివృద్ధి కావాలి. కానీ కొద్దిమంది సంపద పెరగడాన్ని మాత్రమే అభివృద్ధి అని పిలవలేం. ప్రపంచానికి ప్రజాస్వామ్యం కావాలి. కానీ ప్రజల జీవితాలను నిర్ణయించే శక్తి ప్రజల చేతుల్లో లేకపోతే అది కూడా అసంపూర్ణమే. అందుకే న్యూయార్క్ నుంచి వినిపించే మాటలను వినడమే కాదు… వాటి వెనుక నిలిచిన శక్తులను చదవాలి. ఎందుకంటే ప్రపంచ చరిత్రలో గొంతు ఎప్పుడూ శక్తి ఉన్నవారిదే బలంగా వినిపిస్తుంది. ఆ గొంతు మారాలంటే వ్యవస్థ మారాలి. వ్యవస్థ మారాలంటే ఉత్పత్తిపై, సంపదపై, వనరులపై, జ్ఞానంపై, నిర్ణయాధికారంపై ప్రజల హక్కు పెరగాలి. అక్కడి నుంచే ఐరాసకు కొత్త అర్థం మొదలవుతుంది. ప్రపంచం మాట్లాడటం అంటే… ప్రపంచ ప్రజలు తమ భవిష్యత్తు గురించి తామే మాట్లాడే స్థితి రావడం.
అదే నిజమైన బహుళపక్ష ప్రపంచం.
అదే శాంతికి పునాది.
అదే అంతర్జాతీయ న్యాయానికి అర్థం.
అదే ఐక్యరాజ్య సమితి భవిష్యత్తుకు అసలు పరీక్ష.

రమేష్‌ రాంపల్లి

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -