Friday, September 11, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఎస్‌ఐఆర్‌ ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలి

ఎస్‌ఐఆర్‌ ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలి

- Advertisement -

–  అర్హులైన ప్రతి ఒక్కరి పేరు ఓటరు జాబితాలో ఉండేలా చర్యలు
నవతెలంగాణ – కామారెడ్డి : కామారెడ్డి జిల్లాలో కొనసాగుతున్న ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ (ఎస్‌ఐఆర్‌)-2026 ప్రక్రియను నిబంధనల ప్రకారం సమర్థవంతంగా నిర్వహిస్తున్నామని అదనపు కలెక్టర్‌ (రెవెన్యూ) విక్టర్‌ తెలిపారు. బుధవారం జిల్లా సమీకృత కలెక్టరేట్‌లో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఎస్‌ఐఆర్‌-2026 పురోగతిపై సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా జిల్లాలో ఓటర్లకు నోటీసుల జనరేషన్‌, నోటీసుల జారీ, విచారణల పురోగతిని రాజకీయ పార్టీల ప్రతినిధులకు వివరించారు. అర్హత కలిగిన ప్రతి ఓటరు పేరు తుది ఓటర్ల జాబితాలో ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. అదే సమయంలో అర్హత లేని, మరణించిన లేదా ఇతర కారణాలతో తొలగించాల్సిన పేర్లను నిబంధనల ప్రకారం పరిశీలిస్తున్నామని పేర్కొన్నారు. ఓటర్ల నుంచి వచ్చే క్లెయిమ్‌లు, అభ్యంతరాలను పారదర్శకంగా పరిశీలించి, ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు నిర్ణయాలు తీసుకుంటామని అదనపు కలెక్టర్‌ స్పష్టం చేశారు.

ఓటర్ల నమోదు, తొలగింపు, వివరాల సవరణకు సంబంధించి ఫారం-6, ఫారం-7, ఫారం-8 దరఖాస్తులపై ప్రత్యేక ప్రచార కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. సెప్టెంబర్‌ 5, 6, 12, 13 తేదీల్లో జిల్లాలోని అన్ని పోలింగ్‌ కేంద్రాల్లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. కొత్తగా అర్హత పొందిన వారు ఫారం-6 ద్వారా ఓటరుగా నమోదు చేసుకోవాలని, అర్హత లేని లేదా మరణించిన ఓటర్ల పేర్ల తొలగింపునకు ఫారం – 7 ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఓటరు పేరు, చిరునామా తదితర వివరాల్లో మార్పులు, సవరణలకు ఫారం-8 ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. ప్రత్యేక ప్రచార కార్యక్రమాలను సద్వినియోగం చేసుకొని అర్హత కలిగిన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకోవడంతో పాటు ఓటరు జాబితాలో తమ వివరాలను పరిశీలించుకోవాలని అదనపు కలెక్టర్‌ విక్టర్‌ కోరారు.ఈ సమావేశంలో అదనపు కలెక్టర్‌ (స్థానిక సంస్థలు) ఎన్‌.వై. గిరి, ప్రొ. డిప్యూటీ కలెక్టర్‌ రవితేజ, ఎన్నికల సూపరింటెండెంట్‌ రాజేశ్వర్‌, గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -