Saturday, June 6, 2026
E-PAPER
Homeకరీంనగర్ప్లాస్టిక్ రహిత గ్రామాలుగా తీర్చిదిద్దాలి: కలెక్టర్

ప్లాస్టిక్ రహిత గ్రామాలుగా తీర్చిదిద్దాలి: కలెక్టర్

- Advertisement -

నవతెలంగాణ – తంగళ్ళపల్లి 
రాజన్న సిరిసిల్ల జిల్లాలోని అన్ని గ్రామాలను ప్లాస్టిక్ రహిత గ్రామాలుగా తీర్చిదిద్దాలని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ అన్నారు. ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా తంగళ్లపల్లి మండలం రామన్నపల్లి గ్రామంలోని ప్రగతి ప్రాంగణంలో శనివారం నిర్వహించిన ప్రత్యేక గ్రామసభకు జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా వర్షాకాల సన్నద్ధత, పంటల మార్పిడి, వ్యవసాయ, బడి బాట, ఘన వ్యర్థాల నిర్వహణ, ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ, పారిశుద్ధ్యం, వన మహోత్సవం, జల సంరక్షణ, మహిళల రక్షణ, షి టీమ్, భరోసా కేంద్రం తదితర అంశాలపై గ్రామ ప్రజలతో సుదీర్ఘంగా చర్చించి అవగాహన కల్పించారు.

గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో ప్రతి ఇంటికి నాలుగు చెత్త బుట్టలు పంపిణీ చేయాలని, బట్ట సంచులు ఇవ్వాలని, గ్రామంలో స్టీల్ బ్యాంక్ ఏర్పాటు చేసి.. స్టీల్ ప్లేట్స్, గ్లాసులు, జగ్గులు ఇవ్వాలని ప్రతి వేడుకలకు వాటిని ఉపయోగించాలని ప్రతిపాదనలు చేశారు.వర్షాకాలానికి ముందే గ్రామాల్లోని డ్రైనేజీలు శుభ్రం చేయించాలని తెలిపారు. డ్రైనేజీల్లో ప్లాస్టిక్, బహిరంగ ప్రదేశాల్లో చెత్తను వేయవద్దని కోరారు. ఘన వ్యర్థాల నిర్వహణ -2026 పై ప్రజలు కచ్చితంగా అవగాహన కలిగి ఉండాలని, చెత్తను నాలుగు రకాలుగా వేరు చేయాలని సూచించారు. తడి, పొడి, సానిటరీ, ప్రత్యేక చెత్త గా వేరు చేసి గ్రామ పంచాయతీ వాహనానికి అందించాలని సూచించారు.

సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిర్వహణపై అవగాహన పొందాలని, నిబంధనలు ఉల్లంఘించే వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ప్రతి గ్రామంలో గ్రామస్థులను సెగ్రీగేషన్ షెడ్లకు తీసుకు వెళ్లాలని సూచించారు. నీటి ట్యాంకులను నెలకు మూడు సార్లు బ్లీచింగ్ తో సిబ్బంది శుభ్రం చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో డీఆర్డీఓ లక్ష్మీనారాయణ, జిల్లా విద్యాధికారి జగన్ మోహన్ రెడ్డి, జిల్లా పంచాయతీ అధికారి షరీఫ్ఫుద్దిన్, జిల్లా రవాణా శాఖ అధికారి శ్రీనివాస్, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి అఫ్జల్ బేగం, ఉద్యానవన శాఖ అధికారి శరత్, డిప్యూటీ తహసీల్దార్ మురళీకృష్ణ, సర్పంచ్ జ్యోతి, మిషన్ భగీరథ, పోలీస్ అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -