పాశ్చాత్య ప్రశంసల కోసం‘విశ్వగురు’వెంపర్లాట
ఆ దేశాల పొగడ్తలకు మోడీ సర్కారు అత్యంత ప్రాధాన్యం
విమర్శలను సహించలేని పరిస్థితి
కేంద్రం తీరుపై ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్న విశ్లేషకులు
న్యూఢిల్లీ : ప్రధాని మోడీ తీరు చర్చనీయాంశంగా మారుతోంది. దేశంలో కీలక సమస్యలు వెంటాడుతుంటే..ఫారిన్ టూర్లకు వెళ్లిపోతారు. అక్కడ ప్రధాని సర్వోన్నత పురస్కారాలతో సత్కరిస్తారు. గతంలో ఉన్న ఏ ప్రధాని వెళ్లని విదేశాలకు వెళ్లామని ప్రకటిస్తున్నా..దీని వెనుక గుజరాత్ సంపన్నుల సంపద పెరిగేలా డీల్ ఉంటోందన్న విమర్శలు వెల్లువెత్తున్నాయి. పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకుంటే..ఇరాన్ వైపు నిలవకుండా..ఇజ్రాయిల్ ప్రధానికి వంతపాడటం కూడా వివాదస్పదమైంది. దేశ ప్రధాని మీడియా ముందుకు రారు. విదేశాల్లో మీడియా ప్రతినిధులు ప్రశ్నిస్తే..సహించని పరిస్థితులు కనిపిస్తున్నాయి.
ప్రధాని నార్వే పర్యటనతో బహిర్గతం
ఇటీవల నార్వే రాజు భారత ప్రధానికి అత్యున్నత పౌర పురస్కారాన్ని ప్రదానం చేశారు. దీంతో కేంద్రం, బీజేపీ, దాని అనుకూల మీడియా, సోషల్ మీడియాలో విపరీత ప్రచారాన్ని కల్పించాయి. దీనిని భారత్‌కు ప్రపంచ గుర్తింపుగా ప్రచారం చేసుకున్నాయి. అయితే అదే సమయంలో నార్వేకు చెందిన ఒక మీడియా సంస్థలో ప్రచురితమైన కార్టూన్, అలాగే పత్రికా స్వేచ్ఛపై వచ్చిన ప్రశ్నలు పెద్ద వివాదానికి దారి తీశాయి. అధికార బీజేపీ అనుకూల మీడియా, సోషల్ మీడియా ఖాతాలలో.. నార్వేలో ప్రధాని మోడీని ప్రశ్నించిన ఒక విదేశీ మహిళా జర్నలిస్టు తీరును నిందిస్తూ కథనాలు, రాతలు వచ్చాయి. అయితే ప్రశంసలను గర్వంగా స్వీకరించే ప్రభుత్వం.. విమర్శలను మాత్రం సహించలేకపోవడం దేనికి నిదర్శనమని విశ్లేషకులు అంటున్నారు.
‘భారత్ స్థానం బలపడితే..
‘పాశ్చాత్యం’కు ఎందుకు అధిక ప్రాధాన్యం’
ప్రపంచ వేదికపై భారత్ స్థానం బలపడిందని కేంద్ర ప్రభుత్వం చెప్తున్నప్పటికీ.. పాశ్చాత్య దేశాల అభిప్రాయాలకు ఇంత ప్రాధాన్యం ఎందుకు ఇస్తుందన్న ప్రశ్న తలెత్తుతోంది. నిజంగా మోడీ సర్కారు ఒక ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతున్నట్టయితే విదేశీ ప్రశంసలకు అంతటి ఉత్సాహం, విదేశీ విమర్శలకు అంతటి అసహనం ఉండేది కాదని విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. భారత్‌పై పాశ్చాత్య మీడియా గతంలోనూ పలు సందర్భాల్లో వ్యంగ్యంగా, విమర్శనాత్మకంగా కథనాలు చూపించేది. అంతరిక్ష రంగంలో భారత ప్రయోగాలు, మోడీ సర్కారు పాలనకు సంబంధించి ఇలాంటి కథనాలు వెలువడ్డాయి. దేశ సార్వభౌమత్వాన్ని, విశ్వాసాన్ని తక్కువ చేసి చూపించే కథనాలను ఖండించాల్సిందే. అయితే విమర్శల సారాంశాన్ని పరిశీలించకుండా వాటిని దేశద్రోహంగా చిత్రీకరించడం ప్రజాస్వామ్యానికి మేలు చేయదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ విషయంలో మోడీ సర్కారు ప్రవర్తిస్తున్న ధోరణి మారాలని సూచిస్తున్నారు.
ప్రపంచ నాయకత్వానికి కొలమానం ఇదే
మోడీ ప్రభుత్వం తరచూ ‘విశ్వగురు భారత్’ అనే నినాదాన్ని ముందుకు తెస్తోంది. కానీ నిజమైన ప్రపంచ నాయకత్వం అనేది విదేశీ అవార్డులు, ప్రశంసలతో కాకుండా బలమైన ప్రజాస్వామ్య సంస్థలు, పత్రికా స్వేచ్ఛ, పారదర్శక పాలన, సామాజిక న్యాయం ద్వారా కొలవబడుతుందని మేధావులు, నిపుణులు చెప్తున్నారు. ఈ అంశాలపై అంతర్జాతీయ సంస్థలు, మానవ హక్కుల వేదికలు, నివేదికలు లేవనెత్తుతున్న ప్రశ్నలకు సమాధానాలు చెప్పడంలో మాత్రం ప్రభుత్వం విఫలమైందనే విమర్శలూ ఉన్నాయని విశ్లేషకులు గుర్తు చేస్తున్నారు.
మోడీ
ద్వంద్వ
విధానం
‘పాశ్చాత్య ధ్రువీకరణ’ మనస్తత్వం నుంచి మోడీ సర్కారు పూర్తిగా బయటపడలేదని ఈ పరిణామాలు సూచిస్తున్నాయని వారు అంటున్నారు. ఒకవైపు పాశ్చాత్య దేశాలను విమర్శిస్తూ జాతీయవాదాన్ని రెచ్చగొట్టడం, మరోవైపు అదే దేశాల గుర్తింపును ప్రతిష్ఠగా చూపించడం రాజకీయంగా మోడీ అనుసరిస్తున్న ద్వంద్వ వైఖరికి నిదర్శనమని మేధావులు చెప్తున్నారు. ఒక దేశ బలం విదేశీ ప్రశంసలతో పెరగదనీ, అలాగే విదేశీ విమర్శలతో తగ్గిపోదని హితవు పలుకుతున్నారు. ప్రజాస్వామ్య విలువలను బలోపేతం చేయడం, సంస్థల స్వతంత్రతను కాపాడడం, ప్రజల సమస్యలను పరిష్కరించడమే ‘విశ్వగురు’కు సరైన నిర్వచనమని అంటున్నారు. ప్రపంచం భారత్‌ను ఎలా చూస్తుందన్నదానికంటే, భారత్ తనను తాను ఎలా నిర్మించుకుంటుందన్నదే కీలకమని వారు సూచిస్తున్నారు. విదేశీ అభినందనల కోసం ఆత్రుత, విమర్శలపై ఆగ్రహం… ఈ రెండింటినీ అధిగమించినప్పుడే నిజమైన ఆత్మవిశ్వాసంతో కూడిన దేశంగా భారత్ ఎదగగలదన్న విషయాన్ని మోడీ సర్కారు గుర్తుంచుకోవాలని అంటున్నారు.



