Magazines

ఈసీ సంక్షోభం!

1 గంట క్రితం

EC Crisis!
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 25, 2026 | 3 నిమిషాల చదవడం

దేశంలో పాలకులను ఎన్నుకునేది పౌరులు. ఆ ఓటు హక్కును, ఎన్నికల ప్రక్రియను కాపాడాల్సిన రాజ్యాంగ సంస్థ ఎన్నికల సంఘం. అలాంటి సంస్థపైనే ప్రజల్లో నమ్మకం సడలే పరిస్థితి ఏర్పడటం అత్యంత ఆందోళనకరం. ప్రధాన ఎన్నికల కమిషనర్‌ జ్ఞానేశ్‌కుమార్‌ నేతృత్వంలోని ఎన్నికల సంఘంలోనే ఇద్దరు కమిషనర్లు సుఖ్‌బీర్‌సింగ్‌ సంధూ, వివేక్‌జోషి పలు కీలకాంశాలపై లిఖితపూర్వకంగా అభ్యంతరాలు నమోదు చేసిన విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. గత పది నెలల్లో కనీసం పద్నాలుగుసార్లు వారు అభ్యంతరాలు వ్యక్తం చేసినట్టు ‘ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌’ పరిశోధనాత్మక కథనం వెల్లడించింది. ఈ నేపథ్యంలో జ్ఞానేశ్‌కుమార్‌ను తొలగించేందుకు ప్రతిపక్షాలు పార్లమెంటులో మరో అభిశంసన నోటీసు తీసుకురావడానికి సిద్ధమవడం ఎన్నికల వ్యవస్థ ఎదుర్కొంటున్న సంక్షోభ తీవ్రతను తెలియజేస్తోంది. వివాదం కేవలం ఇద్దరు కమిషనర్ల మధ్య అభిప్రాయభేదంగా కొట్టిపారేయ లేనిది. ఓటర్ల జాబితాలో పేర్ల చేర్పు, తొలగింపు, ఫారం-6లో మార్పులు, ఓటర్ల డేటాబేస్‌ను ఢిల్లీలో కేంద్రీకరించే ప్రయ త్నాలు, పశ్చిమబెంగాల్‌లో అప్పీళ్ల వ్యవహారం, గోవాలో అర్హులైన 97 మంది ఓటర్ల పేర్లు సాఫ్ట్‌వేర్‌ సమస్యతో తుది జాబితాలో లేకపోవడం వంటి అంశాలపై అభ్యంతరాలు నమోదయ్యాయి. ముఖ్యంగా ‘సర్‌’ కింద 30 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ముసాయిదా జాబితాల నుంచి 13 కోట్లకు పైగా పేర్లు తొలగించబడిన నేపథ్యంలో ఈ పరిణా మాలకు మరింత ప్రాధాన్యత ఏర్పడింది. ఇద్దరు కమిషనర్లు రికార్డుల్లోనే అభ్యంతరాలు నమోదు చేయడం ఎన్నికల సంఘం అంతర్గత వ్యవహారాలపై తీవ్ర ప్రశ్నలు లేవనెత్తుతోంది. 2023 ఎన్నికల కమిషనర్ల చట్టంలోని సెక్షన్‌ 18 ప్రకారం సాధ్యమైనంత వరకు కమిషన్‌ నిర్ణయాలు ఏకగ్రీవంగా ఉండాలి. అభిప్రాయభేదం ఉంటే మెజారిటీ నిర్ణయమే అమలవుతుంది. అయితే అదే చట్టం ఎన్నికల సంఘం విధానాలు, పని విభజనను ఏకగ్రీవ నిర్ణయంతోనే నియంత్రించుకోవాలని చెబుతోంది. అందువల్ల ఇద్దరు కమిషనర్లు అభ్యంతరాలు వ్యక్తం చేసిన అంశాలు ఎలా పరిష్కరించబడ్డాయో ప్రజలకు సమాధానం చెపాల్సిన అవసరం ఉంది.

గోవా వ్యవహారం ఈ అనుమానాలను మరింత తీవ్రం చేస్తోంది. క్షేత్రస్థాయి అధికారులు పరిశీలించి అర్హులుగా గుర్తించిన 97 మంది ఓటర్ల పేర్లను సాఫ్ట్‌ వేర్‌లో తిరిగిచేర్చే అవకాశం లేకపోవడంతో వారు తుది జాబితాలో చోటు కోల్పోయారు. సాంకేతిక సమస్యగా ఎన్నికల సంఘం దీన్ని వివరించినా, ఓటర్ల జాబితాలో ఒక్క అర్హుడి పేరు లేకపోవడం సాధారణ సాంకేతిక లోపంగా చూడలేం. ఎస్‌ఐఆర్‌పై కూడా ఇదే ఆందోళన కొనసాగుతోంది. దేశంలో కోట్ల సంఖ్యలో పేర్లు తొలగుతున్న సమయంలో పునఃపరిశీలనకు సమర్థమైన అవకాశం, స్థానిక స్థాయిలో అధికారుల పాత్ర, ఓటర్ల డేటాబేస్‌ భద్రత వంటి అంశాలపై స్పష్టత అవసరం. ఇప్పటికే ఢిల్లీ ఎస్‌ఐఆర్‌లో ‘లాజికల్‌ డిస్‌క్రెపెన్సీ’ పేరుతో జారీ చేసిన నోటీసులపై సుప్రీంకోర్టు ప్రశ్నలు లేవనెత్తిన విషయం కూడా ఈ ప్రక్రియపై న్యాయపరమైన పరిశీలన కొనసాగుతు న్నదనే విషయాన్ని చూపుతోంది. ఇక ఎన్నికల కమిషనర్ల నియామకానికి సంబంధించిన 2023 చట్టంపై కూడా రాజ్యాంగపరమైన ప్రశ్నలు ఉన్నాయి. ఈ చట్టం కింద నియామక కమిటీలో ప్రధాన న్యాయమూర్తి స్థానంలో ప్రధానమంత్రి నియమించే కేంద్ర మంత్రిని చేర్చడంతో ప్రభుత్వ ప్రతినిధిత్వంపై ప్రతిపక్షాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. ఇదే చట్టం కింద నియమితులైన కమిషనర్లలోనే ఇప్పుడు అంతర్గత విభేదాలు బహిర్గతం కావడం యాదృచ్ఛిక పరిణామంగా మాత్రమే చూడలేం. ఇదంతా చూసినప్పుడు ఎన్నికల సంఘం కేంద్రానికి అనుకూలంగా వ్యవహరిస్తోందన్న ప్రతిపక్షాల విమర్శలు సహేతుకమనిపిస్తోంది.

ఈ నేపథ్యంలోనే జ్ఞానేశ్‌కుమార్‌పై ప్రతిపక్షాలు అభిశంసనకు సిద్ధమవడం అత్యంత కీలకమైన రాజకీయ-రాజ్యాంగ పరిణామం. ఇది ముందుకు సాగితే, విమర్శలు, ఆధారాలు, ఎన్నికల సంఘం అంతర్గత అభ్యంతరాలు, సర్‌ వ్యవహారం అన్నీ పార్లమెంటరీ పరిశీలనకు వచ్చే అవకాశం ఉంటుంది. ఎన్నికల సంఘానికి రాజ్యాంగం స్వతంత్రతను కల్పించింది. కానీ, సీఈసీ కేంద్రం కనుసన్నల్లోనే పనిచేస్తున్నట్టు ‘సర్‌’ ప్రక్రియను చూస్తే అర్థమవుతోంది. ముగ్గురు సభ్యులున్న ఎన్నికల సంఘంలో సీఈసీకి ప్రత్యేక అధికారాలేమి ఉండవు. మిగతా ఇద్దరికి ఏ హక్కులు ఉంటాయో ఆయనకూ అవే వర్తిస్తాయి. అలాంటప్పుడు ఏకపక్షంగా నిర్ణయాలను ఎలా అమలు చేశారన్నది తెలియాలి. అలాగే అభ్యంతరాలు వ్యక్తమైనప్పుడు వాటిపై ఎలా ఏకాభిప్రాయం కుదిరిందన్నదానిపై కూడా వివరణివ్వాలి. ఇప్పుడు చెప్పుకున్న అంశాలు, గతంలో వచ్చిన విమర్శలకు ఇప్పటివరకు ఏ ఒక్క సమాధానం ఈసీ నుంచి సరిగా రాలేదు. అందుకే సీఈసీని తొలగించాలని ప్రతిపక్షాలు చేస్తున్న డిమాండ్‌‌కు సర్వత్రా మద్దతు లభిస్తోంది. ఇప్పటికైనా ఎన్నికల సంఘం పారదర్శకంగా వ్యవహరించి ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టాలి. లేదంటే ‘సర్‌’ ప్రక్రియ అప్రజాస్వామికమే అవుతుంది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్