Magazines

నొప్పించక...తానొవ్వక !

1 గంట క్రితం

causing pain
avatar
balaji

ప్రచురించబడింది సెప్టెం 27, 2026 | 2 నిమిషాల చదవడం

వాషింగ్టన్ పర్యటనలో హుందాగా వ్యవహరించిన జిన్‌పింగ్

వాషింగ్టన్ : అమెరికా, చైనా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్, జిన్‌పింగ్ మధ్య జరిగిన చారిత్రక శిఖరాగ్ర సమావేశం ప్రపంచంలోని రెండు అతి పెద్ద ఆర్థిక, భౌగోళిక రాజకీయ శక్తుల మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలను పరిష్కరించడానికే ఉద్దేశించి నప్పటికీ చివరికి ఎలాంటి ఫలితాన్ని ఇవ్వలేక పోయింది. అయితే వాషింగ్టన్ పర్యటన సందర్భంగా జిన్‌పింగ్ నొప్పించక.. తానొవ్వక అనే రీతిలో హుందాగా వ్యవహరించారు. ఎలాంటి వివాదాలకు ఆస్కారం ఇవ్వలేదు. ఆయన తన పర్యటనలో పరస్పర సహకార ప్రాముఖ్యతను నొక్కి చెప్పారు. చైనా ఎదుగుదలను అమెరికాకు ఓ ముప్పుగా కాకుండా వరంగా అభివర్ణించారు. ప్రపంచ స్థాయి సైనిక, పారిశ్రామిక, సాంకేతిక సామర్ధ్యాలతో చైనాను ఓ ప్రపంచ శక్తిగా మార్చాలన్న తన ప్రణాళికను ట్రంప్ నినాదమైన ‘మేక్ అమెరికా గ్రేట్ అగైన్‌’తో పోల్చారు. చైనా పురోగతిని అడ్డుకునేందుకు దాని దిగుమతులు, పెట్టుబడులు, అమెరికా సాంకేతికత వినియోగంపై ట్రంప్ ప్రభుత్వం ఎన్ని ఆంక్షలు విధించినా, రక్షణాత్మక చర్యలు తీసుకున్నా బీజింగ్ రికార్డు స్థాయిలో ఎగుమతులు జరిపింది. ఏఐ, రోబోటిక్స్ రంగాల్లో దూసుకుపోయింది. అమెరికాకు అవసరమైన రేర్ ఎర్త్ లోహాల వంటి వస్తువులు, ముడిపదార్థాల తయారీపై గట్టి పట్టు సాధించింది.

ఈ పరిణామాలన్నీ అమెరికాలో జిన్‌పింగ్ పలుకుబడిని పెంచాయి. జిన్‌పింగ్ పర్యటనలో కీలక సమస్యలకు పరిష్కారమేదీ లభించలేదు. అయినప్పటికీ ఈ ఏడాది ప్రారంభంలో రెండు దేశాల మధ్య సంబంధాలు స్థిరపడ్డాయి. తైవాన్‌కు అమెరికా ఇస్తున్న ప్రాధాన్యతను క్రమంగా తగ్గించడం జిన్‌పింగ్ ప్రాధాన్యతలలో ఒకటి. తైవాన్ స్వాతంత్య్రాన్ని వ్యతిరేకించాల్సిందిగా చర్చల సందర్భంగా ఆయన ట్రంప్‌పై ఒత్తిడి తెచ్చారని చైనా అధికార వార్తా సంస్థ సిన్హువా తెలిపింది. తైవాన్ స్వాతంత్య్రానికి మద్దతు ఇవ్వడం సైనిక ఘర్షణకు దారితీయవచ్చునని చైనా గతంలోనే హెచ్చరించింది. తమతో కలిసి ఏఐని బాధ్యతాయుతంగా అభివృద్ధి చేయాలని అమెరికాకు జిన్‌పింగ్ పిలుపునిచ్చారు. అమెరికా సాంకేతిక పరిజ్ఞానం ఎగుమతులపై ఆంక్షలు ఉన్నప్పటికీ చైనా ఏఐ వేగవంతంగా అభివృద్ధి చెందడం వాషింగ్టన్‌లో అధికారులను ఆందోళనకు గురిచేస్తోంది. ఒకవేళ తమ ఏఐకి ఆటంకాలు కలిగించేందుకు అమెరికా ప్రయత్నిస్తే ప్రతీకార చర్యలు తప్పవని చైనా ఇప్పటికే హెచ్చరించింది. అయితే ఆ పరిస్థితి రావాల్సిన అవసరం లేదని ట్రంప్‌తో జరిపిన సమావేశంలో జిన్‌పింగ్ అన్నారు. ‘మనం శాంతియుతంగా సహజీవనం సాగించాలి’ అని ఆకాంక్షించారు. మనం శత్రువులం కాదని, భాగస్వాములమని చెప్పారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్