సెప్టెంబర్‌లో టన్నుకు రూ.23,641
ఆగస్టుతో పోలిస్తే రూ.384 తగ్గుదల
నవతెలంగాణ - అశ్వారావుపేట
పామాయిల్ గెలల ధర సెప్టెంబర్ నెలలో స్వల్పంగా తగ్గింది. సెప్టెంబర్ నెలకు సంబంధించి పామాయిల్ గెలల ధరను టన్నుకు రూ.23,641గా నిర్ణయించినట్లు సంబంధిత ధరల పట్టికలో పేర్కొన్నారు. ఆగస్టు నెలలో టన్నుకు రూ.24,025గా ఉన్న ధరతో పోలిస్తే సెప్టెంబర్‌లో రూ.384 తగ్గింది.
అయితే గతేడాది సెప్టెంబర్ నెలతో పోలిస్తే ఈ ఏడాది పామాయిల్ గెలలకు మెరుగైన ధర లభిస్తోంది. 2025 సెప్టెంబర్‌లో టన్నుకు రూ.19,400గా ఉండగా, ఈ ఏడాది సెప్టెంబర్‌లో రూ.23,641కు చేరింది. దీంతో గతేడాదితో పోలిస్తే టన్నుకు రూ.4,241 అధికంగా ధర నమోదైంది.
పామాయిల్ సాగు విస్తరించిన అశ్వారావుపేట ప్రాంతంలో గెలల ధరల హెచ్చుతగ్గులు రైతుల ఆదాయంపై ప్రభావం చూపుతున్న నేపథ్యంలో, ప్రస్తుత ధరలు గతేడాది కంటే మెరుగ్గా ఉండటంతో రైతుల్లో కొంత ఆశాభావం వ్యక్తమవుతోంది.
2010 - 2026 సంవత్సరాల నెలవారీ ఎఫ్.ఎఫ్.బీ (పామాయిల్ గెలలు) ధరలను పరిశీలిస్తే ధరల్లో దీర్ఘకాలికంగా గణనీయమైన మార్పు కనిపిస్తోంది. ముఖ్యంగా 2021 తర్వాత ధరలు ఒక అధిక స్థాయికి చేరాయి.
దీర్ఘకాలంలో భారీ పెరుగుదల:
2010లో వార్షిక సగటు ధర టన్నుకు రూ.4,969 మాత్రమే ఉండగా, 2025లో రూ.19,513కు చేరింది. అంటే 15 ఏళ్లలో సగటు ధర దాదాపు 3.9 రెట్లు పెరిగింది.
2021లో ధరల్లో కీలక మలుపు:
2020లో సగటు ధర రూ.10,918 ఉండగా, 2021లో అది ఒక్కసారిగా రూ.16,996కు పెరిగింది. 2022లో మరింత పెరిగి రూ.18,130కు చేరింది. పట్టికలోని గణాంకాల ప్రకారం 2022 అత్యధిక వార్షిక సగటు ధరగా కనిపిస్తోంది.
2023లో గణనీయమైన తగ్గుదల:
2022లో రూ.18,130గా ఉన్న సగటు ధర 2023 లో రూ.13,122కు పడిపోయింది. అంటే ఒక్క ఏడాదిలో సుమారు రూ.5,008 తగ్గింది. అనంతరం 2024లో రూ.15,557కు, 2025లో రూ.19,513కు తిరిగి పెరిగింది.
2025 తో పోలిస్తే 2026 లో ధరలు మెరుగు గా ఉన్నాయి:
నెల గెలలు ధర
జనవరి 20,456
ఫిబ్రవరి 21,546
మార్చి 23,005
ఏప్రిల్ 23,501
మే 23,852
జూన్ 23,783
జూలై 23,488
ఆగస్టు 24,025
సెప్టెంబర్ 23,641
ఈ ఎనిమిది నెలల సగటు సుమారు రూ.22,957 టన్ను. ఇది 2025 వార్షిక సగటు రూ.19,513 కంటే సుమారు రూ.3,444 అధికం.
గతేడాది తో పోలిస్తే...
ఆగస్టు 2026: రూ.24,025
సెప్టెంబర్ 2026: రూ.23,641
తగ్గుదల: రూ.384/టన్ను
తగ్గుదల శాతం: సుమారు 1.6%
సెప్టెంబర్ 2025: రూ.19,400
ఏడాది వ్యవధిలో పెరుగుదల: రూ.4,241/టన్ను
పెరుగుదల శాతం: సుమారు 21.9%
చివరిగా....
2026లో పామాయిల్ గెలల ధరలు 2025 కంటే స్పష్టంగా అధిక స్థాయిలో కొనసాగుతున్నాయి. ఆగస్టుతో పోలిస్తే సెప్టెంబర్‌లో స్వల్పంగా తగ్గినా, గతేడాది సెప్టెంబర్‌తో పోలిస్తే ధరలో గణనీయమైన పెరుగుదల ఉంది.







కామెంట్‌లు (0)