Magazines

వీబీ-జీ రామ్ జీ చట్టాన్ని రద్దు చేయాలి

1 గంట క్రితం

VBG RAMJI
avatar
Shiva Kumar

ప్రచురించబడింది అక్టో 02, 2026 | 2 నిమిషాల చదవడం

- ఇంతకు ముందు ఉన్న పాత చట్టాన్ని పునరుద్ధరించాలి 

- వ్యకాస సత్తుపల్లి డివిజన్ కార్యదర్శి జాజిరి శ్రీనివాస్ 

- గాంధీ విగ్రహం ముందు నిరసన 

నవతెలంగాణ-సత్తుపల్లి

కేంద్రంలోని బీజేపీ  ప్రభుత్వం పేరు మార్చి కొత్తగా తీసుకొచ్చిన వీబీ-జీ రామ్ జీ చట్టాన్ని రద్దుచేసి ఇంతకుముందు ఉన్న మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని (ఎంజీఎన్ఆర్ఈజీఏ) పునరుద్ధరించాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం (వ్యకాస) సత్తుపల్లి డివిజన్ కార్యదర్శి జాజిరి శ్రీనివాస్ డిమాండ్ చేశారు. దేశవ్యాప్త నిరసన కార్యక్రమంలో భాగంగా శుక్రవారం స్థానిక మున్సిపాలిటీ కార్యాలయం ఎదురుగా ఉన్న గాంధీ విగ్రహం ముందు వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన నిరసన కార్యక్రమంలో జాజిరి శ్రీనివాస్ మాట్లాడారు. గతంలో వామపక్షాల పోరాటాల ఫలితంగా యూపీఏ ప్రభుత్వం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని ఉపాధి హామీ చట్టాన్ని తీసుకొచ్చిందన్నారు.


ప్రతి గ్రామీణ కుటుంబానికి ఏడాదికి 100 రోజుల పని దినాలు కల్పిస్తూ చట్టాన్ని అమలు చేశారన్నారు. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం కుట్రపూరితంగా ఆ చట్టాన్ని రద్దు చేసి, దాని స్థానంలో పేరు మార్చి వీబీ-జీ రామ్ జీ చట్టాన్ని తీసుకొచ్చిందని శ్రీనివాస్  మండిపడ్డారు. ​కొత్తగా తెచ్చిన చట్టంలో పనిదినాలను 125 రోజులకు పెంచామని చెబుతున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం నిధుల కేటాయింపులో మాత్రం భారీగా కోత విధించిందని విమర్శించారు. గతంలో కేంద్రం అందించే 90 శాతం నిధుల వాటాను 60 శాతానికి కుదించి, మిగిలిన 40 శాతం ఆర్థిక భారాన్ని రాష్ట్ర ప్రభుత్వాలపై మోపడం దారుణమన్నారు. పేదలకు పని కల్పించే బాధ్యత నుంచి కేంద్ర ప్రభుత్వం తప్పుకోవడానికే ఈ రకమైన నిర్ణయాలు తీసుకుంటోందని ఆరోపించారు.


పారదర్శకత పేరుతో రోజుకు రెండుసార్లు ఫోటోలు తీసి ఆన్ లైన్ లో అప్‌లోడ్ చేస్తేనే వేతనాలు చెల్లిస్తామనడం ఉపాధి హామీ కూలీలను ఆందోళనకు గురిచేస్తోందన్నారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించి గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని పాత పద్ధతిలోనే ఎంజీఎన్ఆర్ఈజీఏ చట్టాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. పనిదినాలను 200 రోజులకు పెంచి రోజువారీ కూలి రూ.800 చెల్లించాలని కోరారు. పట్టణ ప్రాంత పేదలకు కూడా ఉపాధి హామీ పథకాన్ని విస్తరింపజేయాలని, దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న వేతనాలను వెంటనే విడుదల చేయాలని కోరారు. ​ఈ నిరసన కార్యక్రమంలో వ్యకాస మండల అధ్యక్ష, కార్యదర్శులు పిల్లి నాగమణి, కువ్వారపు లక్ష్మణరావు, నాయకులు బండి వేలాద్రి, ప్రజా నాట్యమండలి డివిజన్ కార్యదర్శి అయినంపూడి సనందనరావు, కేవీపీఎస్ మండల కార్యదర్శి దాట్ల రాంబాబు, సీఐటీయూ మండల నాయకులు తడికమళ్ల రామకృష్ణ, సప్పిడి భాస్కర్, తోటకూర వెంకట్రావు, బెజవాడ లక్ష్మీనారాయణ, మల్లాది వెంకట్, పరమేష్, ఐద్వా మండల కమిటీ సభ్యులు సరోజిని, ఆమని పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్