నీళ్లున్నా రైతులకు సాగునీరు ఇవ్వని ప్రభుత్వం..
ఉమ్మడి పాలమూరులో 40 శాతానికి పైగా పంట నష్టం
దేశిఇటిక్యాలలో రైతులను కలసి పంటలను పరిశీలించిన కేటీఆర్
తక్షణమే పంట నష్టం సర్వే చేసి పరిహారం ఇవ్వాలని డిమాండ్
నవతెలంగాణ - తిమ్మాజిపేట
కొల్లాపూర్‌లో మాజీ ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డి తండ్రి దశదినకర్మ కార్యక్రమానికి బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు ఆదివారం హాజరయ్యారు. తిరిగి హైదరాబాద్‌కు వెళ్తున్న సమయంలో దేశిఇటిక్యాల వద్ద రైతులు తనను రోడ్డుపై ఆపి తమ పంటలు ఎండిపోతున్న విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని కోరారని కేటీఆర్ తెలిపారు. వారి విజ్ఞప్తి మేరకు గ్రామానికి వచ్చి పంటలను పరిశీలించానని చెప్పారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. ఇక్కడి పరిస్థితి చూస్తే పత్తి పంటలు భారీగా దెబ్బతిన్న విషయం స్పష్టంగా కనిపిస్తున్నదన్నారు. పత్తితోపాటు మొక్కజొన్న రైతులు కూడా తీవ్రంగా నష్టపోయారని తెలిపారు. రెండు ఎకరాల్లో మొక్కజొన్న సాగు చేసేందుకు రూ.2 లక్షలు అప్పు చేసి పెట్టుబడి పెట్టానని శేఖర్‌రెడ్డి అనే రైతు తనకు చెప్పారని కేటీఆర్ వివరించారు. ఇటీవల వర్షం పడటంతో పొలాలు పచ్చగా కనిపిస్తున్నప్పటికీ పంట మొత్తం దెబ్బతిన్నదని రైతులు చెబుతున్నారని అన్నారు.
ఉమ్మడి పాలమూరు జిల్లాలో పంటలు ఎండిపోతున్నా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నాగర్‌కర్నూల్ మండలం దేశిఇటిక్యాల గ్రామంలో రైతులను కలసిన ఆయన పత్తి, మొక్కజొన్న పంటలను పరిశీలించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
పంటలు పండితే రైతుల నుంచి పంటలు కొనాల్సి వస్తుందని, మద్దతు ధర, బోనస్, యూరియా, విద్యుత్ తదితర అంశాలపై ప్రభుత్వం బాధ్యత తీసుకోవాల్సి వస్తుందనే ఉద్దేశంతోనే సాగునీరు ఇవ్వడం లేదని కేటీఆర్ ఆరోపించారు. సాయంత్రం 7 గంటలు దాటితే సింగిల్‌ఫేజ్ కరెంట్ మాత్రమే వస్తోందని, మోటార్లు నడిచే పరిస్థితి ఉండటం లేదని బాలపీర్ అనే రైతు చెప్పారని వివరించారు. త్రీఫేజ్ విద్యుత్ వచ్చినా తరచూ నిలిచిపోతున్నదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని చెప్పారు. ఒకవైపు రైతుబంధు ఇవ్వడం లేదని, మరోవైపు కరెంట్, నీళ్లు కూడా ఇవ్వడం లేదని ప్రభుత్వ తీరుపై ప్రశ్నించారు.
కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు జూరాల, కల్వకుర్తి, నెట్టెంపాడు, కోయిల్‌సాగర్, పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుల ద్వారా ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో సుమారు 8 నుంచి 8.5 లక్షల ఎకరాలకు సాగునీరు అందించామని కేటీఆర్ గుర్తుచేశారు. చెక్‌డ్యామ్‌లు నిర్మించి, చెరువులు నింపడంతో భూగర్భ జలాలు కూడా పెరిగాయని తెలిపారు. ప్రస్తుతం కృష్ణా పక్కనే ఉన్న పాలమూరు ప్రాంతం ఎండిపోతుంటే, కృష్ణా నీటిని ఆంధ్రప్రదేశ్‌కు తరలిస్తున్నారని ఆరోపించారు. పాలమూరు రైతుల దుస్థితిపై ప్రభుత్వం వెంటనే స్పందించాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.
రైతులు అప్పులు చేసి, కొందరు బంగారం కుదువపెట్టి పెట్టుబడులు పెట్టారని తెలిపారు. రైతాంగానికి జరిగిన నష్టాన్ని దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాలని డిమాండ్ చేశారు. వ్యవసాయ అధికారులతోపాటు వ్యవసాయ మంత్రిని కలిసి రైతుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని కేటీఆర్ చెప్పారు. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలతో కలిసి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తామని తెలిపారు. పంట నష్టం జరిగిన ప్రతి ఎకరానికీ తగిన పరిహారం అందించే వరకు రైతుల తరఫున పోరాడుతామని స్పష్టం చేశారు. రైతులు అధైర్యపడవద్దని, ధైర్యంగా ఉండాలని కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. ఆయన వెంట మాజీ మంత్రులు లక్ష్మారెడ్డి, శ్రీనివాస్ గౌడ్, జగదీశ్వర్ రెడ్డి మాజీ ఎమ్మెల్యేలు మర్రి జనార్దన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు బైకానీ శ్రీనివాస్ యాదవ్, కొడుగల్ యాదయ్య తదితరులు పాల్గొన్నారు.






కామెంట్‌లు (0)