- కట్ట మైసమ్మ హుండీలో నోట్లకు చెదలు
నవతెలంగాణ - ఉప్పునుంతల
అమ్మవారికి భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో మొక్కులు చెల్లించుకుని, హుండీలో వేసిన కానుకలు ఆలయ నిర్వాహకుల నిర్లక్ష‍్యం కారణంగా చెదలు పట్టి పాడైపోయిన ఘటన స్థానికంగా చర్చనీయాంశమైంది. వివరాల్లోకి వెళితే.. ఉప్పునుంతల మండలం లతీపూర్ గ్రామ పరిధిలో శ్రీశైలం–హైదరాబాద్ ప్రధాన రహదారి పక్కన ఉన్న శ్రీ కట్ట మైసమ్మ ఆలయ హుండీ లెక్కింపు మంగళవారం ప్రారంభమైంది. ఈ మేరకు భాగంగా ఆలయ చైర్మన్ ఎడ్ల నరేష్, కమిటీ సభ్యులు, జిల్లా ఇన్‌స్పెక్టర్ మదన్, ఆలయ ఇన్‌చార్జ్ అధికారి ఈవో శ్రీనివాసరావు, తహసీల్దార్ అద్దంకి సునీత, పోలీసులు, సిబ్బంది ఇందులో పాల్గొన్నారు.
హుండీ లెక్కింపు సందర్భంగా అడుగుభాగంలో ఉన్న రూ.10, రూ.20, రూ.50, రూ.100 నోట్లకు చెదలు పట్టి పాడైపోయాయి. దీంతో ఆ నోట్లు లెక్కింపునకు నోచుకోలేదు. దీనివల్ల కొంత మేరకు ఆర్థిక నష్టం జరిగే అవకాశం ఉందని భక్తులు పేర్కొంటున్నారు. ఇప్పటికైనా ఆలయాధికారులు నిర్లక్ష‍్యం వీడి హుండీలోని కానుకలు భద్రంగా ఉండేలా అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, కానుకలు పూర్తిగా ఆలయ అభివృద్ధి, నిర్వహణకు ఉపయోగపడేలా చర్యలు చేపట్టాలని భక్తులు కోరుతున్నారు.





కామెంట్‌లు (0)