నవతెలంగాణ-మిడ్జిల్
మాదకద్రవ్యాలకు విద్యార్థులు దూరంగా ఉండాలని, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్ మీర్జా అన్నారు. సోమవారం మండల కేంద్రంలో కళాశాల విద్యార్థులు, వైద్య సిబ్బంది కలిసి మాదకద్రవ్యాలకు (డ్రగ్స్) వ్యతిరేకంగా భారీ అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మీర్జా మాట్లాడుతూ.. నేటి యువత, ముఖ్యంగా విద్యార్థులు తమ బంగారు భవిష్యత్తును పాడుచేసే మాదకద్రవ్యాల వ్యసనానికి పూర్తిగా దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు.
చదువుకునే వయసులో అలవాటయ్యే చెడు వ్యసనాలు జీవితాలను రోడ్డున పడేస్తాయని, శారీరక, మానసిక ఆరోగ్యాన్ని పూర్తిగా క్షీణింపజేస్తాయని హెచ్చరించారు. డ్రగ్స్ వల్ల కలిగే అనర్థాలపై సమాజంలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా అవగాహన పెంచాలని వైద్య సిబ్బంది కోరారు. అనంతరం విద్యార్థులతో మత్తు పదార్థాలకు దూరంగా ఉంటామని, స్నేహితులను కూడా వీటికి దూరంగా ఉంచుతామని ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ తిరుపతయ్య, హెల్త్ అసిస్టెంట్ దేవయ్య, జంగయ్య, కళాశాల అధ్యాపకులు చరణ్, సుగ్నేష్, విద్యార్థిని, విద్యార్థులు వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.





కామెంట్‌లు (0)