కూతురు మృతి.. తల్లికి తీవ్ర గాయాలు
నవతెలంగాణ–పరకాల
పరకాల పట్టణంలోని 11వ వార్డు ఆకులవాడలో తల్లి, కూతురిపై గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేసిన ఘటన తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనలో కూతురు కోడెల సుగుణమ్మ (60) మృతిచెందగా, తల్లి కోడెల లక్ష్మక్క (86) తీవ్ర గాయాలతో చికిత్స పొందుతోంది. తల్లీకూతుళ్లపై దాడి వెనుక కారణాలు, నిందితులు ఎవరనేది ప్రస్తుతం మిస్టరీగా మారింది.
స్థానికుల సమాచారం మేరకు.. గురువారం సాయంత్రం సుమారు 4 గంటల సమయంలో కోడెల లక్ష్మక్క కుమారుడు కోడెల వీరాస్వామికి కొందరు ఫోన్ చేసి, మీ తల్లి, అక్క ఇంటి బయట కనిపించడం లేదని సమాచారం అందించారు. దీంతో వీరాస్వామి హుటాహుటిన ఇంటికి చేరుకుని చూడగా, తన అక్క సుగుణమ్మ రక్తపు మడుగులో పడి కనిపించినట్లు తెలిపారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించినట్లు చెప్పారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు.
పరకాల ఏసీపీ సతీష్‌బాబు, సీఐ ప్రవీణ్‌కుమార్ ఘటనాస్థలాన్ని సందర్శించి వివరాలు సేకరించారు. మృతురాలు సుగుణమ్మకు తలకు బలమైన గాయాలు ఉన్నట్లు ఏసీపీ తెలిపారు. గాయపడిన లక్ష్మక్కను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఘటనాస్థలంలో ఆధారాలను సేకరించేందుకు క్లూస్ టీం రాక కోసం పోలీసులు ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతున్నందున ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడించలేమని ఏసీపీ సతీష్‌బాబు తెలిపారు. దర్యాప్తు అనంతరం పూర్తి వివరాలను వెల్లడిస్తామని చెప్పారు. తల్లీకూతుళ్లపై దాడి ఘటనతో ఆకులవాడలో తీవ్ర ఆందోళన నెలకొంది. అసలు దాడి ఎలా జరిగింది? దాడికి గల కారణాలేంటి? నిందితులు ఎవరు? అనే ప్రశ్నలకు పోలీసుల దర్యాప్తులో సమాధానం లభించాల్సి ఉంది.







కామెంట్‌లు (0)