నవతెలంగాణ - హైదరాబాద్ : తమిళనాడులో ముఖ్యమంత్రి విజయ్ నేతృత్వంలోని టీవీకే ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని పబ్లిక్ విభాగాన్ని సమాచార హక్కు చట్టం-2005 పరిధి నుంచి మినహాయిస్తూ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసినట్లు సమాచారం. ఈ విభాగాన్ని ‘ఇంటెలిజెన్స్ అండ్ సెక్యూరిటీ ఆర్గనైజేషన్’గా వర్గీకరిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది.
వివరాల ప్రకారం.. తమిళనాడు ప్రభుత్వం సెప్టెంబర్ 21న మానవ వనరుల నిర్వహణ శాఖ ద్వారా G.O. Ms.No.57 జారీ చేసినట్లు పేర్కొంది. ఆర్టీఐ చట్టంలోని సెక్షన్ 24(4) కింద రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న అధికారాలను వినియోగించి ఈ మినహాయింపు ఇచ్చినట్లు నోటిఫికేషన్‌లో పేర్కొన్నట్లు సమాచారం. ఈ నిబంధన ప్రకారం రాష్ట్రాలు తమ పరిధిలోని కొన్ని గూఢచార, భద్రతా సంస్థలను ఆర్టీఐ చట్టం నుంచి మినహాయించవచ్చు.
తాజా నిర్ణయం అమల్లోకి వస్తే.. శాంతిభద్రతలకు సంబంధించిన కొన్ని సమాచారాన్ని ఆర్టీఐ ద్వారా కోరడంపై పరిమితులు ఏర్పడే అవకాశం ఉంది. మత ఘర్షణలు, రాజకీ య ఆందోళనలు, పోలీసు చర్యలు, నిరసనలు వంటి అంశాలకు సంబంధించిన అధికారిక సమాచారాన్ని పొందడంలో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని చర్చ జరుగుతోంది.
సాధారణంగా శాంతిభద్రతల విభాగం ప్రభుత్వ పరిపాలనలో కీలక భాగంగా ఉంటుంది. దానిని భద్రతా సంస్థగా వర్గీకరించి ఆర్టీఐ పరిధి నుంచి మినహాయించే నిర్ణయం పారదర్శకత, జవాబుదారీతనంపై చర్చకు దారితీసింది. పౌరులు, సామాజిక కార్యకర్తలు, జర్నలిస్టులకు సమాచార హక్కుపై దీని ప్రభావం ఎలా ఉంటుందన్న అంశంపై కూడా చర్చ కొనసాగుతోంది.






కామెంట్‌లు (0)