జమ్ముకాశ్మీర్ అసెంబ్లీలో కుల్గాం సీపీఐ(ఎం) ఎమ్మెల్యే యూసుఫ్ తరిగామి
శ్రీనగర్ : శ్రమజీవుల పక్షాన వారి హక్కుల గురించి గళమెత్తేది కమ్యూనిస్టులు మాత్రమేనని, ప్రజల గొంతుకను వినిపించకుండా ఏ శక్తీ కమ్యూనిస్టులను ఆపలేదని జమ్ముకాశ్మీర్‌లోని కుల్గాం నియోజకవర్గం సీపీఐ(ఎం) ఎమ్మెల్యే మహ్మద్ యూసుఫ్ తరిగామి ఉద్ఘాటించారు. బుధ వారం ముగిసిన జమ్ముకాశ్మీర్ అసెంబ్లీ సమావేశాల్లో ఆయన మాట్లాడుతున్న సమయంలో నిర్ధిష్ట వ్యవధి కంటే ముందుగానే ముగించాలని స్పీకర్ కోరగా..ఇచ్చిన సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం తమ హక్కు అని, కమ్యూనిస్టుగా ప్రజల హక్కులపై గళమెత్తడాన్ని ఎవ్వరూ ఆపజాలరని నొక్కి చెప్పారు. దీంతో ఆయన ప్రసంగాన్ని కొనసాగించేందుకు స్పీకర్ అనుమతించారు. అయితే అతి తక్కువ రోజులే సమావేశాలు ముగించడం పట్ల తరిగామి తీవ్ర అసంతృప్తిని, ఆందోళనను వ్యక్తం చేశారు. సభాకాలాన్ని కుదించడం వల్ల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ఎత్తి చూపేందుకు వీలులేకుండా పోయిందన్నారు. ‘ఇది చాలా చిన్నపాటి సమావేశం. ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. ప్రధానంగా నిరుద్యోగం జమ్ముకాశ్మీర్‌లో కోరలు చాచింది. విద్యావంతులైన నిరుద్యోగాలు పెరుగుతున్నారు.
ఒక్కటంటే ఒక్క పరిశ్రమా ఇక్కడకు రాలేదు. ఇతర పెద్ద వాణిజ్య కార్యాకలాపాలు ఏవీ సాగడం లేదు. పేదల పిల్లలు కూడా కష్టపడి ఉన్నత చదువులు చదువుకోగలుగుతున్నారే కానీ వారికి ఉపాధి అవకాశాలే లేవు’ అని ఆయన అన్నారు. అలాగే క్యాజువల్ కార్మికులు, రోజువారీ వేతన వర్కర్లు, వివిధ ప్రభుత్వ పథకాల్లో పనిచేస్తున్న కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యల పట్ల తరిగామి ఆందోళన వ్యక్తం చేశారు. ఉద్యమించిన ప్రతిసందర్భంలోనూ హామీలు ఇస్తూ వచ్చిన ప్రభుత్వ పెద్దలు వాటిని పరిష్కరించడంలో మీనమేషాలు లెక్కిస్తున్నారని విమర్శించారు. ఆశా వర్కర్లు, అంగన్‌వాడీ కార్మికులు, మధ్యాహ్న భోజన పథకం వర్కర్లు తీవ్ర స్థాయిలో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, కనీస వేతనాలు కూడా ఇవ్వకపోవడం దుర్మార్గమని ఆయన తెలిపారు. ఈ సమస్యలన్నీ తీర్చడానికి ప్రభుత్వం వద్ద నిధులు లేవని కొందరంటున్నారని, వాస్తవానికి వేతనాలు పెంచి ఇవ్వగలిగే స్థాయిలో నిధులున్నాయని, ఈ విషయాన్ని మళ్లీ మళ్లీ చెబుతున్నానని తరిగామి చెప్పారు. ఎన్నికైన ప్రజా ప్రతినిధులు ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను అర్థం చేసుకొని, వారికి ఉపశమనం కల్పించేందుకు కృషి చేయాలని, ఇది ప్రజా ప్రతినిధులు ప్రాథమిక బాధ్యత అని ఆయన హితవు పలికారు.






కామెంట్‌లు (0)