ఎగురుతున్న కల్లు పెట్టెలు పగులుతున్న కల్లు సీసాలు
నవతెలంగాణ -శివ్వంపేట: మెదక్ జిల్లా శివ్వంపేట మండల పరిధిలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన సికింద్లాపూర్ లక్ష్మీనరసింహస్వామి దేవాలయ ప్రాంతంలో అనుమతులు లేకుండా విచ్చలవిడిగా సాగుతున్న కల్లు,మద్యం విక్రయాలపై గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గ్రామంలో ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా మద్యం,కల్లు దుకాణాలు ఏర్పాటు చేయడంతో నిత్యం ఘర్షణలు జరుగుతూ శాంతిభద్రతలకు విఘాతం కలుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.ఈ మేరకు గురువారం నర్సాపూర్‌లోని ఎక్సైజ్ సీఐని,అలాగే సంగారెడ్డిలోని ఎక్సైజ్ కమిషనర్‌ను కలిసి రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు.
దుకాణాల నడుమ వర్గపోరు – సీసాలు పగలగొడుతూ రాద్ధాంతం:
గ్రామంలో ఒక కల్లు దుకాణం ఉండగా,మరో దుకాణం ఎందుకు ఏర్పాటు చేస్తున్నారనే విషయమై ఇరువర్గాల మధ్య గత కొన్ని రోజులుగా తీవ్రస్థాయిలో ఘర్షణలు జరుగుతున్నాయి.గురువారం ఒక వర్గానికి చెందిన వ్యక్తులు మరొక దుకాణంలోకి చొరబడి కల్లు పెట్టెలు ఎగరవేస్తూ,సీసాలు పగలగొట్టి తీవ్రంగా అల్లరి సృష్టించారని స్థానికులు తెలిపారు.
ఆలయ ప్రాంగణంలో అసాంఘిక కార్యకలాపాలు – ఆభరణాల చోరీ:
దేవాలయ ఆవరణలో కొందరు వ్యక్తులు కిరాణా షాపుల పేరిట డబ్బాలు ఏర్పాటు చేసి,అందులో మద్యం నిల్వలు(డంప్‌లు)ఉంచి భక్తులకు అక్రమంగా విక్రయిస్తున్నారు.తాగిన మైకంలో పలువురు గొడవలకు దిగడమే కాకుండా చోరీలకు పాల్పడుతున్నారని గ్రామస్తులు ఆరోపించారు.ఇటీవల స్వామివారి అభరణాలు పెద్ద ఎత్తున చోరీకి గురవ్వడానికి ఈ అక్రమ మద్యపాన కేంద్రాలే కారణమని మండిపడ్డారు.కేవలం రెండు మూడు డబ్బాలకు మాత్రమే అనుమతులు ఉండగా,వందలాది గజాల స్థలాన్ని ఆక్రమించి షట్టర్లు వేసి మద్యం,కల్లు విక్రయిస్తున్నారని తెలిపారు.
అధికారులు స్పందించకపోతే ముట్టడి తప్పదు – యువత హెచ్చరిక:
ఈ అక్రమ దుకాణాలపై దేవాదాయ ధర్మాదాయ శాఖ,ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి విచారణ జరిపాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు.అలయ ఆవరణలోని అక్రమ డబ్బాలను వెంటనే తొలగించకపోతే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపట్టి,ప్రభుత్వ కార్యాలయాలను ముట్టడిస్తామని గ్రామస్తులు,స్థానిక యువకులు స్పష్టం చేశారు.






కామెంట్‌లు (0)