Magazines

చింతతో తిన్నంత...

54 నిమిషాల క్రితం

As much as I eat with worry...
avatar
Rajabapu Odela

ప్రచురించబడింది సెప్టెం 29, 2026 | 3 నిమిషాల చదవడం

చింతకాయ చూస్తే.. నోటి నుండి నీళ్లు ఊరిపోతాయి. తింటే పళ్లు పులిసిపోతాయి. నాలుక జివ్వుమంటుంది. కానీ వీటితో వంటలు మాత్రం కమ్మగా ఉంటాయి. వేడివేడి అన్నంలో చెంచాడు చింతకాయ పచ్చడి కలిపి తిన్నామంటే.. నాలుక్కి పండగే.. నాలుగు ముద్దలు ఎక్కువ లాగించేస్తాం. మీ కోసం కొన్ని చింతకాయ స్పెషల్స్‌..

నిల్వ పచ్చడి
కావల్సిన పదార్థాలు: చింతకాయలు - పావు కిలో, పసుపు - నాలుగు చెంచాలు, మెంతులు - చెంచా.
తయారు చేసే విధానం: చింతకాయలను కడిగి తడి లేకుండా తుడవాలి. వచ్చినంత వరకూ ఈనెలు తీసేసి.. కచ్చాపచ్చా దంచాలి. ఈ తొక్కును తడి లేని జాడీలో లేదా అనువైన పాత్రలోకి తీసి మూత బిగించాలి. మూడు రోజుల తర్వాత చేత్తో మెదుపుతూ గింజలు తీసేసి.. మరోసారి నూరాలి. మెంతులను వేయించి, చల్లారాక గ్రైండ్‌ చేసి తొక్కులో కలపాలి. దీన్ని సీసాలో అదిమినట్టు ఉంచితే ఏడాదికి పైగా నిలవుంటుంది. తినాలనుకున్నప్పుడు చింతతొక్కు నూరుకోవాలి.
కప్పు చింతకాయతొక్కుకు: ఎండుమిర్చి - 25, వెల్లుల్లి - ఒక పాయ, నూనె - పావు కప్పు, ఆవాలు, శనగపప్పు, మినప్పప్పు - చెంచా చొప్పున, ఎండుమిర్చి - రెండు, వెల్లుల్లి - ఐదారు రెబ్బలు, కరివేపాకు - నాలుగు రెబ్బలు, ఇంగువ - చెంచా
తయారీ: చెంచా నూనెలో మిరప కాయలను వేయించాలి. చల్లారాక వెల్లుల్లి జోడించి గ్రైండ్‌ చేసి కప్పు చింతకాయతొక్కులో కలపాలి. కడాయిలో నూనె వేడిచేసి ఆవాలు, శనగపప్పు, మినప్పప్పులను వేయించాలి. అవి కాస్త వేగాక వెల్లుల్లి, ఎండుమిర్చి, కరివేపాకు, ఇంగువలను ఒకదాని తర్వాత ఒకటిగా జోడించి.. మంచి వాసన వస్తుండగా సెగ తీసేయాలి. పూర్తిగా చల్లారనిచ్చి.. పచ్చడిలో కలపాలి. అంతే చింతతొక్కు రెడీ.

రోటి పచ్చడి

కావల్సిన పదార్ధాలు: చింతకాయలు - 200 గ్రాములు, ఉప్పు - రుచికి తగినంత, పసుపు - ముప్పావు చెంచా, వెల్లుల్లి - ఒక పాయ, పచ్చిమిర్చి - ఇరవై, వేయించిన మెంతుల పొడి - అర చెంచా
తాలింపు కోసం: నూనె - రెండు టేబుల్‌ స్పూన్లు, ఆవాలు, శనగపప్పు, మినప్పప్పు, మెంతులు, జీలకర్ర - అర చెంచా చొప్పున, వెల్లుల్లి రెబ్బలు - ఆరు, ఎండుమిర్చి - నాలుగు, కరివేపాకు - మూడు రెబ్బలు, ఇంగువ - అర చెంచా
తయారు చేసే విధానం: వెల్లుల్లి రెబ్బలకు పొట్టు తీసేయాలి. చింతకాయలను కడిగి తడి లేకుండా తుడిచి.. బరకగా గ్రైండ్‌ చేయాలి. అందులో పసుపు, ఉప్పు, మెంతుల పొడి, వెల్లుల్లి జతచేసి ఇంకోసారి గ్రైండ్‌ చేయాలి. కడాయిలో నూనె కాగనిచ్చి.. ఆవాలు, శనగపప్పు, మినప్పప్పు, మెంతులు, జీలకర్ర, వెల్లుల్లి, ఎండుమిర్చి, కరివేపాకు, ఇంగువలను ఒకదాని తర్వాత ఒకటిగా వేయాలి. అన్నీ చక్కగా వేగిన తర్వాత.. పచ్చడి జోడించి కాస్త వేయించి సెగ తీసేయాలి. అంతే.. ఘుమఘుమలాడే చింతకాయ పచ్చడి సిద్ధమైపోతుంది.

చారు

కావల్సిన పదార్థాలు: కందిపప్పు - పావు కప్పు, చింతకాయలు - ఆరేడు, ఎండుమిర్చి - మూడు, వెల్లుల్లి - మూడు రెబ్బలు, రసంపొడి - ముప్పావు చెంచా, జీలకర్ర - చెంచా, బెల్లంపొడి - రెండు చెంచాలు, ఉప్పు - రుచికి తగినంత, నూనె - ఒకటిన్నర చెంచా, ఆవాలు, మిరియాలపొడి - అర చెంచా చొప్పున, ఎండుమిర్చి - ఒకటి, కరివేపాకు - రెండు రెబ్బలు, ఇంగువ - పావు చెంచా
తయారు చేసే విధానం: కందిపప్పు ఉడికించి, మెత్తగా మెదపాలి. కడిగిన చింతకాయలకు వెల్లుల్లి, ఎండుమిర్చి, సగం జీలకర్ర జతచేసి బరకగా దంచాలి. ముప్పావు లీటరు నీళ్లలో పప్పు, చింతకాయల మిశ్రమం, పసుపు, ఉప్పు, రసంపొడి, బెల్లం వేసి మరిగించాలి. సన్నసెగ మీద ఏడెనిమిది నిమిషాలు ఉడికించి దించేయాలి. కడాయిలో నూనె వేడిచేసి.. ఆవాలు, మిగిలిన జీలకర్ర, ఎండుమిర్చి, మిరియాలపొడి, కరివేపాకు, ఇంగువలతో తాలింపు వేస్తే నోరూరించే రసం తయారైపోతుంది.

పులిహోర

కావల్సిన పదార్థాలు: బియ్యం - అర కిలో, చింతకాయలు - వంద గ్రాములు, ఎండుమిర్చి - ఆరేడు, పచ్చిమిర్చి - ఎనిమిది, కరివేపాకు - మూడు రెబ్బలు, పల్లీలు - గుప్పెడు, ఉప్పు - రుచికి సరిపడా, నూనె - నాలుగు చెంచాలు, అల్లం - అంగుళం ముక్క, ఆవాలు, శనగపప్పు, మినప్పప్పు, పసుపు - చెంచా చొప్పున, ఇంగువ - అర చెంచా
తయారు చేసే విధానం: అల్లం పొట్టు తీసి సన్నగా తరగాలి. కడిగి, తుడిచిన చింతకాయలను గ్రైండ్‌ చేయాలి. అన్నం కొంచెం పొడిపొడిలాడేలా వండి ఉంచాలి. కడాయిలో నూనె వేడయ్యాక.. ఆవాలు, శనగపప్పు, మినప్పప్పు, పల్లీలను వేయించాలి. ఆవాలు చిటపటలాడుతున్నప్పుడు.. ఎండుమిర్చి, అల్లం ముక్కలు, కరివేపాకు, ఇంగువ, సగానికి చీల్చిన పచ్చిమిర్చి, పసుపు జోడించాలి. అవి వేగాక.. చింతకాయల పేస్టు, ఉప్పు జతచేయాలి. పచ్చివాసన పోయే వరకూ వేయించి దించేయాలి. ఈ మిశ్రమాన్ని అన్నంలో కలిపితే.. వారెవా అనిపించే పులిహోర సిద్ధం.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్