పట్నం గుండెల మీద గూడు లేని పక్షివై ఆ పూటకు ఏ చెట్టు మీదో సేద తీరుతుంటావు! ఇండ్లకే కాదు ఈ భూమికి కూడా నువ్వు కిరాయిదారునివే! ఏడిండ్ల పిల్లికూనవై ఈ పట్నంలో తలదాచుకోవడానికి తండ్లాడుతుంటావు జ్ఞాపకాలన్నీ చెరిపేసుకుంటూ ముందుకు సాగుతుంటావు నిన్ను నువ్వే మోసుకు తిరుగుతుంటావు స్టోరేజ్ ఫుల్... డిలిట్ ది మెమొరీ! మేతకోసం పక్షులు పరుగులు పెట్టినట్టు నువ్వు పొట్టగూటి కోసం రాత్రీ పగలు తేడాలేని యుద్ధం చేస్తుంటావు బతకడం కోసం నమ్ముకున్నవాళ్లను బతికించడం కోసం నిరంతర సైనికుడివై జీవితానికి పహారా కాస్తుంటావు! దాచుకోవడానికి ఏమీ లేనితనమే విషాదం చెప్పుకోవడానికి నీకొక మనిషి లేకపోవడమే ఓటమి తలెత్తి బతకాలనే నీ కలను తలా ఒక చెయ్యేసి ఛిద్రం చేస్తుంటారు పదిమందిలో నిన్ను నువ్వు ఒక మహావృక్షంలా నిలబెట్టుకోవాలనుకుంటావు కాలం నీ మూలాల వేర్లను పీకి గ్రీష్మాన్ని బహుమానంగా ఇస్తుంది! ఎవరికెవరూ కాని నగరంలో ఎలా సంపాదించుకున్నావ్ ఇందరిని? సద్ది తిన్న తావు మీద అందుకేనా ఇంతటి మమకారం! ఇప్పుడు బొడ్డు పేగు తెగుతున్న చప్పుడు నీకు తప్ప మరెవరికీ వినిపించదు మౌనంగా రోదిస్తున్న నీ లోలోపలి దు:ఖం నీకు తప్ప ఎవరికీ తెలియదు! అపరిచయాల నుండి ఆత్మీయతల దాకా ఒంటరితనాల నుండి సమూహాల దాకా ఎందరిని గెలుచుకున్నావో కదా! ఎవరూ లేనట్టు ఎవరూ తెలియనట్టు ఎవరితో పని లేనట్టు ఎవరికి ఎవరూ పట్టని ఏకాంతాలు ఎదురుపడినోళ్లు నీకేమీ కానట్టు దాటివేతలు తలతిప్పుకోవడాలు, తప్పుకోవడాలు ఈ కాంక్రీట్జనారణ్యంలో ఇప్పుడు నీకు నిత్యకృత్యాలు! బతుకు కైలాసం ఆటలో నువ్వు పాము మింగిన పాత్రవై మొదలైన చోటుకే వచ్చి పడుతుంటావు ఇప్పుడు మళ్లీ జీరో నుండి మొదలుపెట్టాలి నీకు ఏది కొత్త పాఠం కాదు ప్రతీ అనుభవమూ మునుపటిదే Restart the Device! డా.పసునూరి రవీందర్, 77026 48825





కామెంట్‌లు (0)