ప్రధాని పదవికి వన్నెతెచ్చిన మహానీయుడు
విద్యా హక్కు చట్టం, జాతీయ ఉపాధి హామీ చట్టం తీసుకొచ్చిన ఘనత : ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి
విప్రో సర్కిల్‌లో మాజీ ప్రధాని విగ్రహం ఆవిష్కరణ
నవతెలంగాణ-రంగారెడ్డి ప్రాంతీయ ప్రతినిధి
మౌనమునిలా దేశ ఆర్థిక వ్యవస్థను ముందుకు తీసుకెళ్లిన గొప్ప వ్యక్తి మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ అని, ఆయనకు భారత రత్న ఇవ్వాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. శనివారం రంగారెడ్డి జిల్లా ఫైనాన్షియల్ డిస్ర్టిక్ట్ విప్రో సర్కిల్‌లో మన్మోహన్ సింగ్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ మన్మోహన్ సింగ్ స్ఫూర్తిని భావితరాలకు అందించాలన్న సంకల్పంతో ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించినట్టు తెలిపారు. రిజర్వు బ్యాంకు గవర్నర్, ఆర్ధిక మంత్రి, ప్రధానమంత్రి పదవికి వన్నె తెచ్చిన ఘనత మన్మోహన్ సింగ్‌దని కొనియాడారు. 1991లో పీవీ హయాంలో ఆయన ఆర్థిక మంత్రిగా దేశాన్ని సంక్షోభం నుంచి కోలుకునేలా చేశారన్నారు. లిబరలైజేషన్, ప్రయివేటైజేషన్, గ్లోబలైజేషన్ విధానాలు తీసుకొచ్చిన గొప్ప వ్యక్తి అని తెలిపారు. దేశ ఆర్థిక వ్యవస్థలో కీలకమైన సంస్థలు హైదరాబాద్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ నుంచి సేవలు అందిస్తున్నాయని గుర్తు చేశారు. అలాంటి ఈ ప్రాంతంలో మన్మోహన్ సింగ్ విగ్రహాన్ని ఆవిష్కరించుకోవడం సంతోషకరమైన విషయమన్నారు.
అయితే ‘‘ఆయన జ్ఞాపకం ఢిల్లీలో ఉండేలా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవడం దురదృష్టం. కొన్ని సమయాల్లో రాజకీయాలకతీతంగా నిర్ణయం తీసుకోవాలి. తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసి ఆత్మగౌరవాన్ని నిలబెట్టిన మన్మోహన్ సింగ్ కు భారత రత్న ఇవ్వాలని ప్రధాని మోడీని డిమాండ్ చేస్తున్న. ఆయన పేరుతో ఢిల్లీలో ఒక విజ్ఞాన కేంద్రాన్ని ఏర్పాటు చేయాలి’’ అని సీఎం కోరారు.
హైదరాబాద్ సంస్థానాన్ని భారత్ లో కలిపి స్వాతంత్య్రం అందించిన ఘనత తొలి ప్రధాని నెహ్రూ, వల్లభాయ్ పటేల్ ది అని ముఖ్యమంత్రి గుర్తు చేశారు. దశాబ్దాల తెలంగాణ కలను సాకారం చేసిన ఘనత సోనియా గాంధీ, ఆనాటి ప్రధాని మన్మోహన్ సింగ్ ది అని తెలిపారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తూ ఆయన చేసిన సంతకాన్ని ఇక్కడ పొందుపరిచామన్నారు. వారు ఎన్నో సరళీకృత విధానాలు తీసుకొచ్చారని వెల్లడించారు. విద్యా హక్కు చట్టం, జాతీయ ఉపాధి హామీ చట్టం, భూసేకరణ, పునరావాస చట్టం 2013 తీసుకొచ్చిన ఘనత సోనియా, మన్మోహన్ సింగ్‌లకే దక్కుతుందన్నారు. భూమిలేని పేదలకు కూడా నష్టపరిహారం ఇవ్వాలని పునరావాస చట్టం ద్వారా హక్కు కల్పించారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్, మాజీ సీజేఐ జస్టీస్ ఎన్వీ రమణ , జస్టీస్ సుదర్శన్ రెడ్డి , హెచ్‌ఎమ్‌డీఏ కమిషనర్ సర్ఫరాజ్ తదితరులు పాల్గొన్నారు.






కామెంట్‌లు (0)