Magazines

200 జూనియర్ సివిల్ 
కోర్టుల మంజూరు

50 నిమిషాల క్రితం

Civil Courts
avatar
balaji

ప్రచురించబడింది సెప్టెం 26, 2026 | 2 నిమిషాల చదవడం

హైకోర్టు అభ్యర్థన మేరకు
 రాష్ట్ర సర్కార్‌ గ్రీన్‌సిగ్నల్‌

పెండింగ్‌ కేసుల పరిష్కారానికి 
కీలక నిర్ణయం


నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్‌
రాష్ట్రవ్యాప్తంగా 200 కొత్త జూనియర్ సివిల్ కోర్టుల‌ను మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పెండింగ్‌ ‌కేసుల త్వరితగతిన పరిష్కారానికి నూతన న్యాయస్థానాలు అవసరమని హైకోర్టు చేసిన అభ్యర్థన మేరకు తెలంగాణ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. సాధారణ ప్రజలకు సహాయపడటానికి, పెండింగ్‌లో ఉన్న కేసుల భారాన్ని తగ్గించడానికి ఈ కోర్టులు ఉపయోగపడనున్నాయి. ఈ కోర్టులను జూనియర్ సివిల్ జడ్జి కమ్ అదనపు జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ ఆఫ్ ఫస్ట్ క్లాస్ కోర్టులుగా పిలుస్తారు. ఈ మేరకు జీవో ఎంఎస్‌ ‌నెంబర్‌ 59‌ను ప్రభుత్వం విడుదల చేసింది. దీని ప్రకారం అవసరమైన సిబ్బంది, మౌలిక సదుపాయాలతో సహా 594 కొత్త జూనియర్ సివిల్ జడ్జి కోర్టులను ఏర్పాటు చేయాలని హైకోర్టు రిజిస్ట్రార్ (విజిలెన్స్) చేసిన అభ్యర్థన మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆర్థిక శాఖ పరిశీలించి ఆమోదించిన తర్వాత రాష్ట్ర న్యాయ వ్యవహారాల శాఖ కార్యదర్శి బి. పాపిరెడ్డి మొదటి దశలో 200 కోర్టులను మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అధిక సంఖ్యలో కేసులు నమోదవుతున్న , వేగంగా అభివృద్ధి చెందుతున్న పట్టణ ప్రాంతాలకు ఈ కోర్టులను సర్కార్‌ మంజూరు చేసింది. రాజేంద్రనగర్, ఎల్‌‌బీ నగర్, కూకట్‌పల్లి, హయత్ నగర్, చేవెళ్ల, షాద్‌నగర్, అమనగల్, ఇబ్ర హీంపట్నం వంటి ప్రాంతాలలో మొత్తం 30 కొత్త కోర్టులను కేటాయిం చడంతో రంగారెడ్డి జిల్లా జాబితాలో అగ్రస్థానంలో నిలిచింది.

మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాకు మల్కాజిగిరి, ఉప్పల్, మేడ్చల్, కూకట్‌పల్లి ప్రాంతాలలో 25 కోర్టులు కేటాయించగా, రాజధాని నగరం హైదరాబాద్‌కు సిటీ సివిల్ కోర్ట్, సెషన్స్ కోర్ట్ పరిధిలో 16 కోర్టులను ప్రభుత్వం మంజూరు చేసింది. కోర్టు విచారణల కోసం స్థానిక ప్రజలు సుదూర ప్రాంతాలకు ప్రయాణించాల్సిన అవసరం లేకుండా ఉండేలా, రాష్ట్రంలోని ఇతర కీలక జిల్లాల్లోని సబ్-డివిజనల్ స్థాయిలలో కూడా కొత్త న్యాయమూర్తులను నియ మిస్తున్నారు. నల్లగొండ జిల్లాకు మిర్యాలగూడ, దేవరకొండ, నకిరేకల్, నిడమనూరు వంటి ప్రాంతాలను కవర్ చేస్తూ 10 కోర్టులను కేటాయించారు. ఖమ్మం జిల్లాకు ఎనిమిది కోర్టులు, కరీంనగర్ జిల్లాకు ఏడు, వరంగల్‌-హనుమకొండ జిల్లాలకు 12 , జగిత్యాలకు ఆరు, సిద్దిపేటకు ఐదు, మంచిర్యాలకు ఐదు కోర్టులు కొత్తగా రానున్నాయి. ఇవేకాకుండా ఇతర జిల్లాల్లో కూడా స్థానిక న్యాయ విభాగాలు ఏర్పాటు కానున్నాయి. న్యాయాధికారులు, సిబ్బంది నియామకాలు, భవన నిర్మాణానికి బడ్జెట్ కేటాయింపులకు సంబంధించిన ప్రత్యేక ఉత్తర్వులను త్వరలోనే జారీ చేయనున్నట్టు తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేసింది. అలాగే పరిపాలనాపరమైన పనులను పూర్తి చేసి, ఈ 200 కోర్టులను వీలైనంత త్వరగా అందుబాటులోకి తీసుకురావడానికి అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని తెలంగాణ హైకోర్టు రిజిస్ట్రార్ (విజిలెన్స్)ను ఆదేశించారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్