వేడెక్కిస్తున్న పార్టీల వ్యూహాలు.. త్రిముఖ ప్రచార హోరు
కాంగ్రెస్ అభ్యర్థి ఖరారుతో
తొలగిన ఉత్కంఠ
ఊపందుకున్న ఓటర్ల నమోదు
ఇప్పటికే 75 వేల దరఖాస్తులు
నవతెలంగాణ-ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
వరంగల్-ఖమ్మం-నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి రాజకీయం రోజురోజుకూ తీవ్రరూపం దాల్చుతోంది. ప్రస్తుత ఎమ్మెల్సీ పదవీ కాలం ముగుస్తుండటంతో రాష్ట్ర ఎన్నికల సంఘం ఓటర్ల నమోదు ప్రక్రియకు నోటిఫికేషన్ విడుదల చేసింది. అధికార కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్, జనసేన తదితర పార్టీలు తమ అభ్యర్థులను ఖరారు చేస్తూ ప్రచారంలో వేగం పెంచాయి. విద్యాధికులు, నిరుద్యోగులు, ఉద్యోగుల ఓట్లను ఆకట్టుకునేందుకు అభ్యర్థులు క్షేత్రస్థాయిలో విస్తృత పర్యటనలు చేస్తున్నారు. ఓటర్ల నమోదు వేగవంతమవుతున్న కొద్దీ ఈ ఎన్నికల సమరం ప్రధానంగా కాంగ్రెస్, బీఆర్ఎస్‌ల మధ్య తీవ్రమైన పోటీకి వేదికవుతోంది.
ఓటర్ల నమోదు హోరు
వరంగల్-ఖమ్మం-నల్లగొండ పట్టభద్రుల స్థానంలో ప్రస్తుత ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న పదవీ కాలం ముగియనుండటంతో రాష్ట్ర ఎన్నికల సంఘం తుది డ్రాఫ్ట్ నోటిఫికేషన్ జారీ చేసి ఓటర్ల నమోదు ప్రక్రియను వేగవంతం చేసింది. గ్రాడ్యుయేట్ ఓటర్ల నమోదు ప్రక్రియ క్షేత్రస్థాయిలో వేగవంతం కావడంతో ప్రతి ప్రధాన రాజకీయ పక్షం తమ శ్రేణులను సిద్ధం చేసుకుని ఓటర్లను నమోదు చేయించడంలో నిమగ్న మైంది. విద్యాధికులు, యువత, ప్రభుత్వ ఉద్యోగులు, నిరుద్యోగులు పెద్ద సంఖ్యలో ఉన్న ఈ విస్తృత నియోజకవర్గంలో ప్రతి ఓటు చాలా కీలకమైనది. అందువల్ల పార్టీలన్నీ గ్రాడ్యుయేట్లతో ప్రత్యేక ఆత్మీయ సమ్మేళనాలు, సమావేశాలు నిర్వహిస్తూ తమ ప్రాబల్యాన్ని పెంచుకునేందుకు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నాయి. ఓటర్ల నమోదు సంఖ్య పెరిగే కొద్దీ ఈ ఎన్నికల పోరు మరింత ఉత్కంఠభరితంగా మారే అవకాశం ఉందనేది స్పష్టమవుతోంది.
త్రిముఖ సమరం
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానంలో ముమ్మరమవుతున్న ప్రచార పర్వం ప్రధాన రాజకీయ పార్టీలకు ఒక సవాలుగా మారింది. మరొకవైపు జనసేన పార్టీ సైతం పూర్వ పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ డాక్టర్ గడల శ్రీనివాసరావును తమ అభ్యర్థిగా ఖరారు చేసి రంగంలోకి దించింది. తన మిత్రపక్షాల కూటమి మద్దతుతో ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ప్రతిపక్షం బీఆర్ఎస్ అభ్యర్థి ఎనుగుల రాకేష్ రెడ్డి, అధికార కాంగ్రెస్ అభ్యర్థి సర్వోత్తం రెడ్డిల మధ్యనే ప్రధాన పోటీ నెలకొనే సూచనలు కనిపిస్తున్నప్పటికీ, కూటమి మద్దతుతో డాక్టర్ గడల శ్రీనివాసరావు కూడా విద్యాధికుల ఓట్లను ఆకట్టుకునేందుకు శ్రమిస్తున్నారు. గత ఎన్నికల ఫలితాలు, ఓటింగ్ సరళిని విశ్లేషిస్తే పట్టభద్రుల తీర్పు ఎల్లప్పుడూ ఊహించని మలుపులు తిరుగుతుంది. ప్రతి అభ్యర్థి తమదే విజయం అని ధీమా వ్యక్తం చేస్తున్నప్పటికీ, విద్యాధికులు, ఉద్యోగార్థులు ఎవరి పక్షాన నిలుస్తారో అనే అంశంపైనే ఈ ఎమ్మెల్సీ సమర విజేత ఆధారపడి ఉంటారు. మూడు జిల్లాల పరిధిలో దాదాపు 7లక్షల ఓట్లు ఉన్నాయి. ఒక్క ఉమ్మడి ఖమ్మం జిల్లాలోనే 3లక్షల దాక ఓట్లు ఉన్నాయి. ఇప్పటికే 75వేల మందికి పైగానే ఓటు కోసం దరఖాస్తు చేశారు. దీనిని రెట్టింపు చేసేందుకు పార్టీలు కసరత్తు చేస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ కూడా అభ్యర్థిని ఖరారు చేయడంతో రానున్న రోజుల్లో ప్రచారం మరింత ఊపందుకోనున్నది. ఓటర్ల నమోదు నుండి పోలింగ్ రోజు వరకు పార్టీలు అమలు చేసే వ్యూహాలు, ప్రజా సమస్యలపై వారి వైఖరి, అభ్యర్థుల వ్యక్తిగత ప్రతిష్ట ఈ ఎన్నికల ఫలితాన్ని నిర్దేశించనున్నాయి. కాంగ్రెస్ పార్టీ తమ అధికార బలంపై, బీఆర్ఎస్ తమ ఆందోళనల ద్వారా సంపాదించిన ప్రజాదరణపై, జనసేన తన సిద్ధాంత బలంపై ఆధారపడి ప్రచారం సాగిస్తున్నాయి. ఎన్నికల నోటిఫికేషన్ సమయం దగ్గర పడుతున్న కొద్దీ ప్రచారం మరింత వేడెక్కి రాజకీయం కొత్త మలుపులు తిరగడం ఖాయంగా కనిపిస్తోంది.
ప్రచారాలతో
హోరెత్తిస్తున్న పార్టీలు
ఈ ఎన్నికల బరిలో ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ తరపున ఏనుగుల రాకేష్ రెడ్డి తన ప్రచారంలో ముందంజలో ఉన్నారు . కొన్ని నెలలుగా గ్రాడ్యుయేట్లు, నిరుద్యోగుల సమస్యలపై ధర్నాలు, ఆందోళనలు చేపడుతూ క్షేత్రస్థాయిలో నిరంతరం పాల్గొంటున్నారు. దీనికి పోటీగా అధికార కాంగ్రెస్ పార్టీ కూడా తమ అభ్యర్థి ఎంపికలో ఆలస్యం చేయకుండా మాజీ మంత్రి దామోదర్ రెడ్డి కుమారుడైన రామరెడ్డి సర్వోత్తం రెడ్డిని అభ్యర్థిగా ఎంపిక చేసింది. 2012 నుండి కాంగ్రెస్ పార్టీలో నమ్మకమైన నాయకునిగా పనిచేస్తున్న సర్వోత్తం రెడ్డిని బరిలోకి దింపడం ద్వారా బీఆర్ఎస్ అభ్యర్థికి గట్టి పోటీ ఇవ్వొచ్చని కాంగ్రెస్ అధిష్టానం భావించింది. ఈ నిర్ణయం కాంగ్రెస్ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపగా, అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లే దిశగా సర్వోత్తం రెడ్డి ప్రచారం సాగుతోంది.






కామెంట్‌లు (0)