Magazines

సాయానికి ఫలితం

1 గంట క్రితం

The Result of the Help
avatar
Rajabapu Odela

ప్రచురించబడింది సెప్టెం 27, 2026 | 2 నిమిషాల చదవడం

నరసింహపురంలో శరభయ్య అనే దయాశాలి ఉండేవాడు. అతనికి పశుపక్ష్యాదులన్నా, జంతువులన్నా చాలా ఇష్టం. అతనికి ప్రతిరోజు వాటికి ఆహారాన్ని అందజేయనిదే నిద్ర పట్టదు. అంతేకాకుండా అవి ఆపదలో ఉంటే కూడా అతడు సాయపడి కాపాడేవాడు. ఇలా ఉండగా ఒక రోజు అతడు అడవికి దగ్గరగా ఉన్న తన పొలం నుండి తిరిగి వస్తుండగా అతనికి తన వెనకాల ఏదో పరిగెత్తి వస్తున్నట్లు అనిపించింది. తీరా అతడు వెనుకకు తిరిగి చూస్తే అది ఒక పెద్ద ఎలుగుబంటి. అది చాలా కోపంతో తనపై దాడి చేయడానికి వస్తున్నదని గ్రహించిన శరభయ్య ఒకే పరుగులంకించుకున్నాడు. కానీ ఆ ఎలుగుబంటి అతనిని వదలకుండా వెంబడించింది. "అయ్యో! ఇదేమిటి? నేను దీనికి ఎన్నడూ అపకారం తలపెట్టనే లేదు. ఇది నా వెంబడి పడుతున్నది ఏమిటి?" అని అనుకున్న శరభయ్య ఆ ఎలుగుబంటి నుండి తనను తాను కాపాడుకొనుటకు వేగంగా పరిగెత్తాడు. ఇంతలో అతనికి ఎదురుగా మరో ఎలుగుబంటి వస్తూ కనిపించింది. "అయ్యో! నా పరిస్థితి ముందునుయ్యి, వెనుక గొయ్యిలా ఉంది. నేను ముందుకు వెళ్ళితే ఈ ఎలుగుబంటి దాడి చేస్తుంది. వెనుకకు వెళ్ళితే ఆ ఎలుగుబంటి చంపుతుంది. ఇప్పుడెలా? నేను వాటికి ఏమి అపకారం చేశాను? ఇక వీటి దాడి నుండి తప్పించుకోవడం నా తరం కాదు" అని కళ్ళు మూసుకున్నాడు. ఎదురుగా వస్తున్న ఆ ఎలుగుబంటి అతనిని వదిలిపెట్టి ముందుకు పరిగెత్తి ఆ వెనుక నుండి శరభయ్యపై దాడికి వస్తున్న ఆ మరో ఎలుగుబంటిని ఢీకొని దానితో పోట్లాడసాగింది. దాని దాడికి తట్టుకోలేక ఆ వెనుక నుండి శరభయ్యపై దాడికి వస్తున్న ఆ ఎలుగుబంటి పారిపోయింది. ఆ తర్వాత ఆ ఎలుగుబంటి వెనుకకు తిరిగి శరభయ్య వద్దకు వచ్చి ఆగింది. తర్వాత అది అడవిలోకి వెళ్లి పోయింది. అప్పుడు శరభయ్యకు అసలు విషయం అర్థమైంది. గతంలో ఈ ఎలుగుబంటి నా చేత ఏదో సాయం పొంది ఉంటుంది. అందుకే ఇది నన్ను కాపాడడానికి ఆ ఎలుగుబంటితో తలపడింది. అదే నేను దీనికి సాయం చేయకుంటే ఈ ఎలుగుబంటి కూడా నాపై దాడి చేసేది. ఆహా! నోరులేని ఈ ప్రాణులకు ఎంత తెలివి ఉంది. తనకు చేసిన సాయాన్ని మరవకుండా ఇది నాకు సాయం చేసింది. నేనే దీన్ని పొరపాటుగా అర్థం చేసుకున్నాను. నాకు ఇక భయం లేదు "అని అనుకొన్నాడు. ఆ తర్వాత అతడు తన గ్రామానికి చేరుకొని జరిగిన సంగతిని తన మిత్రులకు, బంధువులకు చెప్పాడు. వారు "ఒరేయ్ శరభయ్యా! ఒక ఎలుగుబంటి నీ పెద్ద మోటబావిలో పడితే మనమందరం కలిసి దానిని ఒకరోజు పైకి తీసాము. అది గుర్తుందా! ఇది ఆ ఎలుగుబంటే కావొచ్చు. బహుశా అదే నిన్ను కాపాడింది. ఏది ఏమైనా నీవు వాటికి చేసిన సాయం వల్లనే నీవు వాటి దాడి నుండి తప్పించుకున్నావు. నీవు చాలా అదృష్టవంతునివి. ఇక మీదట ఒంటరిగా నీ పొలానికి వెళ్ళకు" అని అన్నారు. వారి మాటలకు శరభయ్య సరేనని అన్నాడు.

సంగనభట్ల చిన్న రామకిష్టయ్య, 9908554535

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్