Magazines

​స్వానుభవంలోంచి వచ్చిన కథలు

55 నిమిషాల క్రితం

శుభవేళ
avatar
Rajabapu Odela

ప్రచురించబడింది సెప్టెం 27, 2026 | 2 నిమిషాల చదవడం

ప్రేమ చిగురించిన శుభవేళ ఏమవుతుంది? చిగురించిన ప్రేమ మొగ్గ తొడుగుతుంది, పూవై వికసిస్తుంది. కాయై ఫలించుతుంది. సంధ్యా, రవీంద్రనాథ్‌‌ల మధ్య ప్రేమ, సంధ్య పెడసరం రవీంద్రని తీవ్ర మనస్తాపానికి గురిచేసింది. మనసు నిరాశతో నిండిపోయింది. అలా అని ఇద్దరూ పరాయివారు కాదు. ఆమె రవీంద్ర మేనమామ కూతురు. తల్లి రాజ్యలక్ష్మి స్వయానా కోరుకున్న సంబంధం. రవీంద్రకూ ఇష్టమే! కాని రవీంద్ర చేస్తోన్న పోలీసు ఉద్యోగం సంధ్యకు చులకన. వేళాపాళా లేని ఆ ఉద్యోగం సంధ్యకు నచ్చదు. అసాంఘిక శక్తుల్ని అరికట్టి, లా అండ్ ఆర్డర్‌‌ను పరిరక్షించే పోలీసు అంటే రవీంద్రకు ఎనలేని ప్రేమ. ఈ ఇరువురి ప్రేమోదంతం మోడువారి పోవాల్సిందేనా? ప్రాణంగా ప్రేమించే రవీంద్రనాథ్ జీవితం ఎడారి కావల్సిందేనా? కాదు అంటారు రచయిత పెద్దూరి వెంకటదాసు. దాసు మంచికవి, కధారచయిత. సభానిర్వహణలో వీరికి మించిన వారెవ్వరూ లేరు. వేదికపైన ఉన్న పెద్దలను, సభకు వచ్చిన రసహృదయ పాఠకులను సమంగా అలరిస్తూ, ఆహ్లాదకరమైన వాతావరణంలో సభను నడిపించే దిట్ట. పోలీసు ఉద్యోగ నిర్వహణలో అవార్డులు, రివార్డులు అందుకున్న పౌరసంబంధాల పరిరక్షణ ప్రతిభామూర్తి. వీరి చేతిలో ఈ కథ రత్నమై భాసిల్లింది. ‘వేయి కిరణములు సోకిన గాని భానుని చూడదు కలువ చెలి’ అన్న చందాన రవీంద్ర తన పట్ల చూపే అనురాగానికి, ప్రజా ప్రశంసలకు ముగ్దురాలై, తన తప్పు తెలుసుకుని భర్త గుండెలపై వాలి భోరున విలపించింది. చిగురించిన వారి ప్రేమ ఫలప్రదమై భాసిల్లింది. కథ చదువుతున్నంతసేపూ, ఉద్విగ్నతకు లోనైన పాఠకులు సైతం తేలికపడిన మనసులతో మరో కథకు పేజీలు తిప్పుతారు. 15 కథలున్న ఈ కథా సంపుటిలో అన్ని కథలూ ఆణిముత్యాలే!
‘కడుపుతీపి’ కథలో ఇందుమతి, రాఘవరావుల పెంపుడు కుమారుడు రాజేష్‌‌కు అమెరికా వెళ్లే అవకాశం వస్తుంది. పెంచిన ప్రేమతో ఇందుమతి తల్లడిల్లుతుంది. ప్రేమను రాజేష్ అర్థం చేసుకుంటాడు. కడుపుతీపి చంపుకుని విదేశాలకు పంపుతున్న తల్లికి పైసా ఖర్చు లేకుండా, ఆమెకు దూరం కాకుండా కంపెనీవారే అప్పుడప్పుడు రాజేష్‌‌ను అమెరికా పంపే ఏర్పాటు చేసారని తెలిపి తల్లికి ఆనందం కలిగిస్తాడు. స్వానుభవంలోంచి వచ్చిన కథలు చాలా బాగా ‘పండు’తాయి అని నిరూపించుతున్నారు వెంకటదాసు. వీరి మరోకథ ‘పోలీసు బందోబస్తు’లో వేణు మాధవ్‌‌ది పోలీసు ఉద్యోగం. విధినిర్వహణ ఆయన ప్రథమ కర్తవ్యం. భార్యాపిల్లలు, వారితో సమయం గడపటం ఆ తర్వాతే! భార్య కళావతికి ఇది నచ్చదు. కారణం సెలవు రోజుల్లో కూడా ఆయన డ్యూటీకే ప్రాముఖ్యత ఇస్తాడు. ప్రధానమంత్రి రాక, దసరా, రంజాన్ పండుగలు ఒకేసారి రావటం వల్ల వేణు మాధవ్‌ సెలవు కాన్సిల్‌ అవుతుంది. పండగ వేళ కూతురు, అల్లుడిని విడిచి వెళ్ళటం కళావతికి నచ్చదు. ఇంట్లో మనతో మనం గడపటం కంటే దేవుడిని, ఆయన్ను చూడడానికి వచ్చే జనాన్ని కాపాడటం గొప్ప అన్న సత్యం తెలుసుకున్న కళావతి మనసు తేట పడుతుంది. పోలీసు ఉద్యోగంలోని ఔన్నత్యం గొప్పతనం కళావతికి అర్థమై ఆమె కళ్ళు చెమర్చుతాయి. చాలా సహజంగా, నిజాయితీగా చెప్పారు రచయిత ‘పోలీసు బందోబస్త్‌’ కథలో. వెంకట దాసు మాత్రమే రాయగలిగిన కథ ఇది. మానవ సంబంధాల చిత్రీకరణ చిన్నకథే అయినా ‘యూ ఆర్‌‌ గ్రేట్‌ ‌తాతయ్యా!’ లో చెప్పబడింది. అలాంటిదే మరో కథ ‘పిల్లలు - పిల్’. సీనియర్లు వాళ్ళు వయసులో ఉన్నపుడు చేసిన సంఘసేవ ‘సీ’నియర్ కథ తెలుపుతుంది. అంతర్లీనంగా ప్రతి కథలో ఇచ్చిన సందేశాలు ఉదాత్తంగా ఉన్నాయి. మంచి అభివ్యక్తితో పఠనీయత పెంచారు వెంకటదాసు, రచయితకు అభినందనలు. మరిన్ని మంచి కథలు మనతో పంచుకోవాలని ఆశిద్దాలి.

కూర చిదంబరం, 8639338675

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్