Magazines

విప్లవ అగ్నికణం.. భగత్ సింగ్

52 నిమిషాల క్రితం

భగత్ సింగ్.
avatar
Rajabapu Odela

ప్రచురించబడింది సెప్టెం 27, 2026 | 3 నిమిషాల చదవడం

ఆయన పేరు పలికితే రోమాలు నిక్కబొడుస్తాయి. ఆ త్యాగగాథను తలచుకుంటేనే రక్తం రగిలిపోతుంది. తెల్లదొరల నిరంకుశ పాలనను అంతం చేయడానికి అగ్నిజ్వాలలా మారిన యోధుడు అతడు. బ్రిటిష్ సామ్రాజ్యవాదాన్ని ఎదిరించి, భవిష్యత్‌కు బలమైన బీజం వేయాలనే తపనతో పార్లమెంటుపై బాంబు విసిరిన విప్లవ వీరుడు. విప్లవం ద్వారానే విజయం సాధ్యమని నమ్మిన మహోన్నత ఘనుడు. ఆయనే భగత్ సింగ్. ఇది కేవలం ఓ వ్యక్తి పేరు కాదు. దేశ చైతన్యాన్ని మేల్కొలిపే మహత్తర శక్తి. తరతరాలకు చెరగని శాశ్వత స్ఫూర్తి. ‘నేను ప్రేమించినా.. పెళ్లాడినా అది నా మాతృభూమినే! నా ధ్యాస, నా శ్వాస, నా సర్వస్వం నా దేశం. ఈ గడ్డపై పుట్టినా, ఈ మట్టిలో కలిసిపోయినా అది నా దేశ విముక్తి కోసమే కావాలి’ అని నినదించిన మహోన్నత త్యాగమూర్తి ఆయన.

1907 సెప్టెంబర్ 27న నేటి పాకిస్తాన్‌లోని లాయల్పూర్ జిల్లా బంగా గ్రామంలో కిషన్ సింగ్, విద్యావతి దంపతులకు భగత్ సింగ్ జన్మించాడు. చిన్ననాటి నుంచే దేశభక్తి అతని నరనరాల్లో నింపుకుంది. పసితనంలోనే ‘నేను తుపాకి మొక్కలు నాటుతున్నాను నాన్నా! ఇవి పెరిగి పెద్దవై వేల తుపాకులుగా వికసించాలి. ఆ ఆయుధాలను నా దేశ ప్రజలకు పంచి, ఈ తెల్లదొరల గుండెల్లో నిద్రపోతా’ అని నినదించిన ఆ విప్లవ అగ్నిరవ్వ, 12 ఏళ్ల వయసులోనే జలియన్‌వాలాబాగ్ దారుణాలను చూసి రగిలిపోయాడు. 14 ఏళ్లకే స్వాతంత్ర్యోద్యమంలో అడుగుపెట్టాడు. మహాత్మా గాంధీ పిలుపుతో సహాయ నిరాకరణ ఉద్యమంలో పాల్గొన్నప్పటికీ, ఆ ఉద్యమాన్ని నిలిపివేయడాన్ని సమర్థించలేదు. స్వాతంత్ర్యం యాచిస్తే రాదని, పోరాడితేనే సాధ్యమని గ్రహించాడు. అనంతరం నవజవాన్ భారత్ సభలో చేరి యువతను చైతన్యపరిచాడు. తర్వాత హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లికన్ అసోసియేషన్‌లో చేరి సుఖ్‌దేవ్, రాజ్‌గురులతో కలిసి విప్లవ కార్యకలాపాలను కొనసాగించాడు. 1927లో సైమన్ కమిషన్ వ్యతిరేక ఉద్యమం సందర్భంగా లాలా లజపతిరాయ్‌పై జరిగిన లాఠీచార్జ్ ఆయన మరణానికి దారితీసింది. దీనికి ప్రతీకారంగా బ్రిటిష్ అధికారి సాండర్స్‌ను భగత్ సింగ్, రాజ్‌గురు హత్య చేశారు. 1929లో పార్లమెంట్‌లో బటుకేశ్వర్ దత్‌తో కలిసి బాంబులు విసిరి “ఇంక్విలాబ్ జిందాబాద్” నినాదాలతో దేశాన్ని కుదిపేశారు. తప్పించుకునే అవకాశం ఉన్నా, ప్రజల్లో చైతన్యం కలిగించాలనే ఉద్దేశంతో పోలీసులకు లొంగిపోయాడు.

1931 మార్చి 23న లాహోర్ జైలులో భగత్ సింగ్, సుఖ్‌దేవ్, రాజ్‌గురులను బ్రిటిష్ పాలకులు ఉరిశిక్ష వేశారు. ఉరికంబం ముందున్నా వారు భయపడలేదు. చిరునవ్వుతోనే మృత్యువును కౌగిలించుకున్నారు. “దేవుడిని స్మరించు” అన్నపుడు, “ప్రజలకు కష్టాలు ఇస్తున్నందుకు దేవుడిని ఎన్నోసార్లు ప్రశ్నించాను” అన్న ఆయన సమాధానం అతని ఆలోచనా స్వేచ్ఛకు నిదర్శనం. అందుకే ఆయనను కేవలం విప్లవకారుడిగానే కాక, భావజాల యోధుడిగా కూడా గుర్తిస్తారు. మార్చి 23ను ‘షహీద్ దివస్’గా దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్నారు. ఆయన పుట్టి 119 ఏండ్లు అవుతున్నా నిత్యం ప్రజలలో, యువతలో ఆయన స్ఫూర్తి ప్రవేశిస్తూనే ఉంది. భగత్ సింగ్ కలలుగన్నది కేవలం రాజకీయ స్వాతంత్ర్యం కాదు. సమసమాజ నిర్మాణం. సామ్రాజ్యవాదం, పెట్టుబడిదారీ వ్యవస్థ, భూస్వామ్య కట్టుబాట్లు, కుల-మత వివక్షలపై ఆయన పోరాటం నేటికీ స్ఫూర్తిదాయకం. నేటి పరిస్థితుల్లో సమాజం కొత్త సవాళ్లను ఎదుర్కొంటోంది. మతం, కులం పేరుతో విభజనలు పెరుగుతున్నాయి. మతోన్మాదాన్ని రెచ్చగొట్టే శక్తులు బలపడుతున్నాయి. విద్య, వైద్య రంగాలు పేదలకు అందని ద్రాక్షగా మారుతున్నాయి. నిరుద్యోగం పెరుగుతోంది. ఉద్యోగ అవకాశాలు కరువవుతున్నాయి. ప్రపంచ రాజకీయ పరిణామాలు, యుద్ధాలు సాధారణ ప్రజల జీవితాలను ప్రభావితం చేస్తున్నాయి. ఇక యువతలో వ్యసనాల పెరుగుదల ఆందోళనకరం. గంజాయి, డ్రగ్స్ వంటి దురలవాట్లకు బానిసలవుతున్న యువశక్తి భష్యత్తును కోల్పోతోంది. ఆన్‌లైన్ బెట్టింగ్ వంటి ప్రమాదకర ధోరణులు జీవితాలను నాశనం చేస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో వ్యసనాలను అరికట్టడం, యువతను సరైన దిశలో నడిపించడం అత్యవసరం. భగత్ సింగ్ స్ఫూర్తితో నేటి యువత మేల్కొనాలి. మతోన్మాదానికి వ్యతిరేకంగా, కుల-మత అడ్డుగోడలను కూల్చేందుకు, మహిళలపై జరుగుతున్న దాడులను అరికట్టేందుకు ముందుకు రావాలి. ఉపాధి అవకాశాల కోసం, సమానత్వ సమాజ నిర్మాణం కోసం పోరాడాలి. ప్రజా సమస్యలపై చైతన్యంతో నిలబడి ఉద్యమాలను బలోపేతం చేయాలి. భగత్ సింగ్ కలలు కన్న సమాజం కోసం పోరాడినప్పుడే వారికి నిజమైన నివాళి అర్పించినవారమవుతాం. వారి త్యాగం చరిత్రలో మాత్రమే కాకుండా, మన ఆచరణలోనూ ప్రతిఫలించాలి. అదే భగత్ సింగ్‌కు మనం అర్పించే నిజమైన అక్షర నీరాజనం! దేశం కోసం చనిపోయేవారు.. ఎల్లకాలం బతికే ఉంటారు. ఇంక్విలాబ్ జిందాబాద్!
(సెప్టెంబర్ 27, భగత్ సింగ్ 119వ జయంతి సందర్భంగా)

గడగోజు రవీంద్రాచారి, 9848772232

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్