నవతెలంగాణ - హైదరాబాద్: ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన ఓ యువకుడితో స్నేహం.. చివరకు యువ వైద్యురాలి హత్యకు దారితీసింది. ఈ ఘటన హైదరాబాద్‌లోని మియాపూర్‌లో శుక్రవారం వెలుగుచూసింది. సంగారెడ్డి పట్టణం శాంతినగర్‌కు చెందిన భూమయ్యకు ముగ్గురు కుమార్తెలు. రెండో కుమార్తె డాక్టర్ కె. సృజన (27) మహబూబ్‌నగర్‌లో ఎంబీబీఎస్ పూర్తి చేశారు.
ప్రస్తుతం హనుమకొండలో పీడియాట్రిషన్ పీజీ మొదటి సంవత్సరం చదువుతూ, ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో వైద్యురాలిగా పనిచేస్తున్నారు. ఏడేళ్ల క్రితం ఇన్‌స్టాగ్రామ్ ద్వారా రవికుమార్ అనే యువకుడు ఆమెకు పరిచయమయ్యాడు. కొంతకాలానికి వీరిద్దరి మధ్య స్నేహం ఏర్పడింది. కొద్దిరోజుల క్రితం సృజన వద్ద రవికుమార్ బంగారు గొలుసు తీసుకున్నాడు. దానిని తిరిగి ఇస్తానని చెప్పి ఆమెను హైదరాబాద్‌కు రమ్మన్నాడు. దీంతో గత నెల 30న సృజన హైదరాబాద్‌కు వచ్చింది. ఆ తర్వాత హనుమకొండకు తిరిగి రాకపోవడంతో స్నేహితురాళ్లు పలుమార్లు ఫోన్ చేసినా స్పందించలేదు.
దీంతో వారు ఆమె తండ్రికి సమాచారం ఇవ్వగా.. హనుమకొండ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సెల్‌ఫోన్ సిగ్నల్ ఆధారంగా సృజన మియాపూర్‌లోని హఫీజ్‌పేటలో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. అక్కడికి వెళ్లి ఆరా తీయగా.. గత నెల 29న రవికుమార్ ఓ వసతిగృహంలో గది అద్దెకు తీసుకున్నట్లు నిర్వాహకులు తెలిపారు. పోలీసులు గది తాళాలు తీసి చూడగా సృజన మృతదేహం కనిపించింది.
దిండుతో ఊపిరాడకుండా చేసి ఆమెను హత్య చేసి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఘటన అనంతరం రవికుమార్ ఫోన్ స్విచ్ఛాఫ్ కావడంతో.. పథకం ప్రకారమే ఆమెను గదికి రప్పించి హత్య చేసి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. తండ్రి ఫిర్యాదుతో మియాపూర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితుడి ఆచూకీ కోసం గాలిస్తున్నారు.






కామెంట్‌లు (0)