దశాబ్ద కాలం తర్వాత తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీజీఎస్‌ఆర్టీసీ)లో గుర్తింపు సంఘం ఎన్నికలకు సర్కారు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. సుమారు 36 వేల మంది కార్మికులు, ఉద్యోగులు ఓటు వేసేందుకు సిద్ధమవుతున్నారు. కార్మిక శాఖ విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం అక్టోబర్ తొమ్మిదిన జరిగే ఎన్నికల ద్వారా ప్రజాస్వామ్య పునరుద్దరణ జరగనుంది. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో చివరగా 2016 జూలై 19న ఎన్నికలు జరిగాయి. 2019లో 55 రోజుల సమ్మె అనంతరం 2019 డిసెంబర్ 1 నుండి ఆర్టీసీ కార్మికొద్యమం పై ఆంక్షలు విధించారు. దాని తర్వాత ఆ ఊసే లేదు. ఆ సర్కారు చట్టాన్ని ఉల్లంఘించింది. ఆర్టీసీని కాపాడతామని వాగ్దానం చేసి అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ ప్రభు త్వం, వాస్తవానికి యూనియన్లతో పాటు కార్మికుల హక్కులనూ కాలరాసింది.
2019 ఆర్టీసీ సమ్మెలో 34 మంది ఉద్యోగులు మరణించిన తర్వాత, కేసీఆర్ ప్రభుత్వం 48 వేల మంది కార్మికులను సర్వీస్ నుంచి తొలగించినట్టేనని బెదిరిం చింది. ఎన్నికలకు మాత్రం ససేమిరా అంది. పదే పదే కార్మికులు, కార్మిక సంఘాలు ఎన్నికలు నిర్వహిం చాలని కోరుతున్నా నిర్లక్ష్యం చేసింది. కావా లనే పెడచెవిన పెట్టింది. ఫలితంగా పదేండ్ల పాటు కార్మికుల పక్షాన ప్రాతినిధ్యానికి వేదిక కరువైంది. 2017 నుంచి వేతన సవరణ పెండింగ్‌లోనే ఉంది. 17 వేల మంది పదవీ విరమణ చేసినా, వారికి రూ. 843 కోట్ల ఉద్యోగ విరమణ బకాయిలు చెల్లించనేలేదు. దీర్ఘకాలికంగా నియామకాలు నిలిచిపో యాయి. అడ్డగోలు పనిగంటలు నడిచాయి. ప్రభుత్వంలో టీజీఎస్ఆర్టీసీ విలీనం కేవలం కాగితాలకే పరిమితమైంది.
2026 ఏప్రిల్‌లో కార్మికులు మళ్లీ మూడు రోజుల నిరవధిక సమ్మె చేశారు. నరసంపేట డిపో డ్రైవర్ కె. శంకర్ గౌడ్ ఆత్మాహుతికి పాల్పడి మరణించాడు. ఆ విషాదం జరిగిన తర్వాత ఉప ముఖ్యమంత్రి , రవాణా శాఖ మంత్రి అన్ని యూని యన్ల నేతలతో జరిపిన సుదీర్ఘ చర్చల అనంతరం 11శాతం పీఆర్‌సీ, యూనియన్ ఎన్నికలతోపాటు విలీనానికి కమిటీ అనే మూడు డిమాండ్లకు అంగీకరించారు. 2023 ఎన్నికలలో కాంగ్రెస్ ఇచ్చిన హామీ మేరకు, ప్రభు త్వంతో టీజీఎస్ఆర్టీసీ విలీనంపై ఎవరు చర్చలు జరపాలనే విషయాన్ని ఈ ఎన్నికలు నిర్ణస్తాయి. ఎన్నికల్లో గెలిచిన సంఘాలను విలీనకమిటీలో నియమి స్తామని ప్రభుత్వం అంటున్నది. విలీనం అనేది సంక్లిష్టమైనది. 2019లో ఆంధ్ర ప్రదేశ్‌లో అనేక సమస్యలు ఎదురయ్యాయి. ఆర్టీసీ రక్షణ ప్రమాదంలో పడింది. సర్వీస్ నిబంధనలు గందరగోళంగా మారాయి. నష్టాలూ పెరిగాయి. తెలంగాణలో ఆ పరిస్థితులు ఉత్పన్నం కాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటామనీ, ఉద్యోగుల ప్రయోజనాలను కాపాడతామని సర్కారు చెబుతూ వస్తున్నది. కానీ ఈ జాగ్రత్త నిరవధిక జాప్యంగా మారకూడదనేది సంఘాల కోరిక.
విలీన కమిటీలో ఎన్నికైన గుర్తింపు సంఘానికి స్థానం ఉంటుంది.
అది రాజీపడకుండా మూడు డిమాండ్లను ప్రభుత్వం ముందు పెట్టాలి. మొదటిది ఉద్యోగ భద్రత - ఏపీ నమూనాలో ఉన్నట్టే, విలీనం తర్వాత ఎటువంటి తొల గింపులు లేకుండా చూసుకోవాలి. రెండవది ఆర్థిక భద్రత - విలీనానికి ముందే ఉద్యోగ విరమణ బకాయిలు, పీఎఫ్, సీసీఎస్‌లను చెల్లించాలి. మూదోది ఆస్తుల పరిరక్షణ.
ఆర్టీసీకి 97 డిపోలు, 3,200 బస్సులు, హైదరాబాద్, వరంగల్, ఖమ్మంలో విలువైన భూములు ఉన్నాయి. ఆర్టీసీ ఎక్స్ రోడ్స్ వద్ద ఇందిరమ్మ ఇండ్ల కోసం కేటాయించిన ఆరు ఎకరాల భూమి విషయంలో జరిగినట్టుగా ఇతర ఆర్టీసీ భూములను అమ్ముకోవడానికి విలీనం ఒక మార్గంగా మారకూడదు.
కార్మికులు ఆయా పార్టీల జెండాను చూసి కాకుండా, ఏండ్ల తరబడి తమ కోసం ఎవరు పోరాడారో చూసి ఎన్నుకోవాలి. ప్రభుత్వం స్వేచ్ఛాయుత, నిష్పక్షపాత ఎన్ని కలను నిర్వహించాలి. రహస్య బ్యాలెట్ నిజంగా రహ స్యంగానే ఉండాలి. డిపో మేనేజర్ల ప్రభావానికి లోనుకాకూడదు. ఎన్నికైన యూనియన్ ఆర్టీసీ అంటే కేవలం ఉద్యోగులు మాత్రమే కాదు, అది ఒక ప్రజాసేవగా గుర్తించాలి. హక్కులను డిమాండ్ చేయడంతో పాటు ప్రతిరోజూ 65 లక్షల మంది ప్రయాణికులకు సమయ పాలన, భద్రత, పరిశుభ్రతను అందించాలి. పదేండ్ల నిశ్శబ్దం తాజా ఎన్నికలతో బద్దలవనుంది. కార్మికులు స్వేచ్ఛగా ఓటేసి తమ హక్కులను సాధించిపెట్టే కార్మిక సంఘానికి జెండా కర్ర అందిస్తేనే వారి ఎజెండా అమలు సాధ్యం.
ఆర్టీసీ ఎన్నికలు!
1 గంట క్రితం

balaji
ప్రచురించబడింది సెప్టెం 30, 2026 | 3 నిమిషాల చదవడం





కామెంట్‌లు (0)