ప్రత్యేక సందర్భాల్లో మినహాయింపు
ఉత్తర్వులు విడుదల
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలపై ప్రభుత్వం నిషేధం విధించింది. ఈ మేరకు ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా సోమవారం ఉత్తర్వులు (జీఓ నెంబర్ 57ను) విడుదల చేశారు. గతంలో మే 1 నుంచి మే 31 వరకు బదిలీలపై ఉన్న నిషేధాన్ని ప్రభుత్వం సడలించిన విషయం తెలిసిందే. ఆ గడువు ముగియడంతో ఈనెల ఒకటి నుంచి మళ్లీ పూర్తి స్థాయిలో బదిలీలపై నిషేధం విధిస్తున్నట్లు స్పష్టం చేసింది. అయితే ప్రత్యేక సందర్భాల్లో మినహాయ ింపులుంటాయని తెలిపింది. పదోన్నతుల కారణంగా ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాల్సి వచ్చినప్పుడు మాత్రమే పోస్టింగ్‌లు ఇవ్వొచ్చని సూచించింది. అయితే ఇతర ఉద్యోగులకు స్థానచల నం కలిగించకుండా ఉన్న ఖాళీల్లోనే నియామకాలు చేపట్టాలని ప్రభుత్వం ఆదేశించింది. పోస్టుల రద్దు, రివర్షన్‌లు, రిపాట్రియేషన్‌లు, విదేశీ సేవల నుంచి తిరిగి రావడం, క్రమశిక్షణా చర్యల నేపథ్యంలో ఉద్యోగుల పోస్టింగ్‌లు అవసరమైతే వాటిని కూడా ఖాళీ పోస్టుల్లోనే చేపట్టాలని పేర్కొం ది. ఆరు నెలలకు మించి దీర్ఘకాలిక సెలవుల నుంచి తిరిగి విధుల్లో చేరే ఉద్యోగులకు కూడా ఖాళీగా ఉన్న పోస్టుల్లోనే నియామకాలు ఇవ్వాలని ఉత్తర్వు ల్లో స్పష్టం చేసింది. సెలవు కారణంగా ఏర్పడిన ఖాళీ లను బదిలీల ద్వారా భర్తీ చేయరాదని పేర్కొంది.
ఆరు నెలల పాటు సడలింపులకు అవకాశం లేదు
ఈనెల ఒకటి నుంచి ప్రారంభమయ్యే ఆరు నెలల కాలానికి బదిలీల నిషేధంపై ఎలాంటి సడలింపు ప్రతిపాదనలను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోబోదని ఉత్తర్వుల్లో తెలిపింది. ఆ తర్వాత ఏవైనా మినహాయింపులు ఇవ్వాల్సి వస్తే సంబంధిత పరిపాలనా శాఖలు ముఖ్యమంత్రి, ఆర్థిక మంత్రి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనుమతులతో మాత్రమే ప్రతిపాదనలు పంపాల్సి ఉంటుందని పేర్కొంది.
ఖాళీల భర్తీకి ఆర్థిక శాఖ అనుమతి తప్పనిసరి పరిపాలనా అవసరాల దృష్ట్యా ఖాళీలను భర్తీ చేయాల్సి వచ్చినప్పుడు, ప్రస్తుత కార్యాలయంలో కనీసం ఒక ఏడాది సేవ పూర్తి చేసిన ఉద్యోగులను మాత్రమే పరిగణనలోకి తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది. ఇందుకోసం ఆర్థిక శాఖ అనుమతి తప్పనిసరిగా పొందాలని స్పష్టం చేసింది.
నిబంధనలు ఉల్లంఘిస్తే జీతాల బిల్లులు నిలిపివేత
ఉత్తర్వులకు విరుద్ధంగా చేపట్టిన బదిలీలకు సంబంధించిన ఉద్యోగుల జీతాల బిల్లులను ట్రెజరీలు, పే అండ్ అకౌంట్స్ కార్యాలయాలు ఆమోదించవద్దని ప్రభుత్వం ఆదేశించింది. రాష్ట్రంలోని అన్ని శాఖలు, శాఖాధిపతులు ఈ ఉత్తర్వులను కచ్చితంగా అమలు చేయాలని కోరింది. ఈ నిర్ణయంతో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సాధారణ బదిలీల ప్రక్రియ చేపట్టేందుకు అవకాశం లేదు.



