ప్రతికూల శక్తుల నుంచి
రాష్ట్రాన్ని కాపాడుకోవాలి :
బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్
ప్రజలకు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్ర ప్రజలకు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలంగాణ బిడ్డలకు బీఆర్‌ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు (కేసీఆర్) తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
రాష్ట్ర సాధన పోరాటంలో అసువులు బాసిన అమరవీరుల త్యాగాలను ఆయన స్మరించుకుని నివాళులు అర్పించారు. ఈ మేరకు కేసీఆర్ సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. తెలంగాణ ప్రజల మీద దశాబ్దాల పాటు సాగిన అణచివేతపై పోరాడి, అనేక ఆవాంతరాలను అధిగమించి, శాంతియుతమైన పార్లమెంటరీ పంథాలో, ప్రజాస్వామ్య యుతంగా కొట్లాడి స్వరాష్ట్రాన్ని సాధించుకున్నామని పేర్కొన్నారు. పదేండ్ల అనతికాలంలోనే సకల జనుల సంక్షేమం, సమస్త రంగాల సమగ్ర ప్రగతిని సాధించి, తెలంగాణను దేశంలోనే నెంబర్‌వన్ రాష్ట్రంగా తీర్చిదిద్దామని తెలిపారు. ప్రగతికి చిరునామాగా మారిన తెలంగాణ అస్తిత్వం తిరిగి మరోసారి ప్రమాదంలో పడకుండా అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ సమాజాన్ని హెచ్చరించారు. ప్రతీప శక్తులనుంచి తెలంగాణను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిదని పేర్కొన్నారు. తెలంగాణకు బీఆర్ఎస్ ఎల్లప్పుడూ రక్షణ కవచంగా నిలుస్తుందని కేసీఆర్ పునరుద్ఘాటించారు. స్వరాష్ట్ర సాధనలోనూ, ఆ తర్వాతి పదేండ్ల పునర్నిర్మాణంలోనూ చూపిన స్పూర్థిని నిరంతరం కొనసాగించాలని తెలిపారు. అన్ని వర్గాల ప్రజల జీవన ప్రమాణాలు మరింత గుణాత్మకంగా పెరిగే దిశగా పాలనా ప్రాధాన్యతలను ఎంచుకోవాలని సూచించారు. ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని ప్రభుత్వం చిత్తశుద్ధితో అమలు చేస్తూ, వారిలో విశ్వాసం నింపాల్సిన బాధ్యత ప్రస్తుత పాలకులపై ఉందని స్పష్టం చేశారు.తెలంగాణ రైతన్న సంక్షేమం వ్యవసాయాభివృద్ధి నిరంతరం కొనసాగించాల్సిన బాధ్యతను పాలకులు విస్మరించకూడదని తెలిపారు. తెలంగాణ ప్రగతి పథంలో దూసుకుపోవాలనీ, పచ్చని పాడి పంటలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. రైతాంగం, శ్రమజీవులు, సబ్బండ వర్గాలు,సకల జనుల జీవితాలు సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో నిండాలని కోరారు.


