Tuesday, June 2, 2026
E-PAPER
Homeజాతీయంవిజయాల ప్రచారం.. గణాంకాల గోప్యత

విజయాల ప్రచారం.. గణాంకాల గోప్యత

- Advertisement -

ఎన్‌ఎఫ్‌‌హెచ్‌ఎస్‌-6‌లో కీలక వివరాలు మిస్సింగ్‌
మోడీ సర్కారు ప్రతిష్టాత్మక పథకాల పనితీరును
అంచనా వేసే సూచికలు గల్లంతు

ఉజ్వల యోజన, స్వచ్ఛ భారత్‌ ‌సక్సెస్‌పై స్పష్టత కరువు
కేంద్రం వైఫల్యాలను కప్పిపుచ్చేందుకేనంటూ సర్వత్రా విమర్శలు
ఆరోగ్య రంగంలో కొత్త సవాళ్లను బయటపెట్టిన సర్వే

న్యూఢిల్లీ : దేశంలో ఆరోగ్యం, పోషణ, కుటుంబ సంక్ష‍ేమ పరిస్థితులను అంచనా వేయడానికి అత్యంత విశ్వసనీయంగా భావించే జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే (ఎన్‌ఎఫ్‌‌హెచ్‌ఎస్‌) ఆరో విడత నివేదిక (ఎన్‌ఎఫ్‌‌హెచ్‌ఎస్‌-6)‌లో కొన్ని కీలక సూచికలు కనిపించకపోవడం చర్చనీయాంశంగా మారింది. ఇందులో ముఖ్యంగా ప్రధాని మోడీ ప్రభుత్వం అత్యంత ప్రచారం కల్పించిన ఉజ్వల యోజన, స్వచ్ఛ భారత్‌ ‌మిషన్‌‌ల పనితీరును అంచనా వేయగల ఇండికేటర్లు ఈ సారి విడుదల చేసిన నివేదికలో లేకపోవడం గమనార్హం. గతంలో ఎన్‌ఎఫ్‌‌హెచ్‌ఎస్‌ ‌ప్రతీ నివేదికలో ఈ సూచికలు ఉండేవి. దాంతో పథకాల పనితీరుపై అందరికీ ఒక అంచనా ఉండేది. అయితే కేంద్ర ప్రభుత్వం పథకాల అమలులో తన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడం కోసమే.. కీలక వివరాలు ప్రజలకు అందకుండా దాచిపెడుతోందని సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి.

​ఎన్ఎఫ్‌హెచ్‌ఎస్‌-5 (2019-21) నివేదిక ప్రకారం… దేశంలోని 40 శాతానికి పైగా కుటుంబాలకు శుభ్రమైన వంట ఇంధనం అందుబాటులో లేదు. దీంతో ఈ గణాంకాలు దేశంలోని పేద మహిళలకు ఎల్పీజీ కనెక్ష‍న్లు అందించడం కోసం ఉద్దేశించిన ప్రధానమంత్రి ఉజ్వల యోజన పనితీరుపై అనుమానాలను రేకెత్తించింది. అంతేకాదు.. దేశం పూర్తిగా బహిరంగ మలవిసర్జన రహితంగా మారలేదని కూడా ఆ నివేదిక వెల్లడించింది. వాస్తవానికి కేంద్రంలోని మోడీ సర్కారు ఈ రెండు పథకాల విషయంలో తీవ్ర ప్రచారం కల్పించుకున్నది. ప్రజాధనాన్ని వెచ్చించి మరీ ప్రకటనల, ప్రసారాలతో ఊదరగొట్టింది. పేద మహిళలకు వంట కష్టాలు దూరం చేశామనీ, మహిళల ఆత్మగౌరవాన్ని కాపాడామని ఉజ్వల్‌ ‌యోజన, స్వచ్ఛ భారత్‌ ‌మిషన్‌‌ల గురించి మోడీ సర్కారు తరచూ వినిపించే మాట. అయితే ఈసారి విడుదలైన ఎన్ఎఫ్‌‌హెచ్‌ఎస్‌-6‌లో ఈ రెండు సూచికలు లేకపోవడం అనేక విమర్శలకు తావిస్తోంది.

​ఎన్‌ఎఫ్‌హెచ్‌ఎస్‌-5లో బయటపడిన
వాస్తవాలు.. ఐఐపీఎస్‌ ‌డైరెక్టర్‌ పదవికి ఎసరు ప్రజా ధనం ఖర్చు చేసి అమలు చేస్తున్న పథకాల ఫలితాలను ప్రజలకు తెలియజేయడం ప్రభుత్వ బాధ్యత. కానీ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే కఠిన, వాస్తవ గణాంకాలు బయటకు వస్తాయనే భయంతో మోడీ సర్కారు వాటిని తొక్కిపెడుతున్నదనే అనుమానాలను విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఎన్‌ఎఫ్‌హెచ్‌ఎస్ -5 నివేదిక వెలువడిన తర్వాత కేంద్రాన్ని ఇరుకున పెట్టే ఉజ్వల్‌ ‌యోజన, స్వచ్ఛ భారత్‌‌ మిషన్‌‌కు సంబంధించిన వాస్తవ గణాంకాలు బటయకు రావడం, అనంతరం భారతీయ జనాభా శాస్త్ర సంస్థ (ఐఐపీఎస్) డైరెక్టర్ కె.ఎస్. జేమ్స్ పదవి కోల్పోవడం ఇప్పుడు చర్చనీయాంశమైంది.

​ఆరోగ్య రంగంలో కొత్త సవాళ్లు
ఇక ఈ నివేదికలో బయటపడిన ఆరోగ్య పరిస్థితులు మరింత ఆందోళన కలిగిస్తున్నాయి. 15 ఏండ్లు పైబడిన మహిళల్లో 30.7 శాతం మంది, పురుషుల్లో 27.3 శాతం మంది ఊబకాయంతో బాధపడుతున్నారు. గత సర్వేతో పోలిస్తే ఇది గణనీయమైన పెరుగుదల కావడం గమనార్హం. ఇక ఊబకాయంతో పాటు మధుమేహం, అధిక రక్తపోటు కేసులు కూడా భారీగా పెరిగాయి. గతంలో భారత్‌లో ప్రధాన ఆరోగ్య సమస్యలు క్షయ, మలేరియా వంటి అంటురోగాలు కాగా, ఇప్పుడు మధుమేహం, రక్తపోటు, ఊబకాయం, గుండె జబ్బులు వంటి వ్యాధులే ఎక్కువ మంది ప్రజల ఆరోగ్యానికి ముప్పుగా మారుతున్నాయి. అయినప్పటికీ ప్రభుత్వ కార్యక్రమాలు ప్రధానంగా పరీక్షలు, గుర్తింపుకే పరిమితమవుతున్నాయని, నివారణ చర్యలు బలహీనంగా ఉన్నాయని ఆరోగ్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

​20 శాతం మంది ఇంకా తక్కువ బరువుతోనే..​మరోవైపు దేశంలో పోషకాహార పరిస్థితి కూడా విరుద్ధ చిత్రాన్ని చూపిస్తోంది. ఒకవైపు ఊబకాయం పెరుగుతుండగా, మరోవైపు మహిళలు, పురుషుల్లో సుమారు 20 శాతం మంది ఇంకా తక్కువ బరువుతోనే ఉన్నారు. దీనిని నిపుణులు ‘ఎపిడెమియాలజికల్ పోలరైజేషన్‌‌’గా అభివర్ణిస్తున్నారు. అంటే ఒకవైపు ఆకలి, పోషకాహార లోపం కొనసాగుతుండగా, మరోవైపు నాసిరకం ఆహారం కారణంగా ఊబకాయం పెరుగుతోందని నిపుణులు చెప్తున్నారు. శిశు పోషణ పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారింది. ఆరు నుంచి 23 నెలల మధ్య వయసున్న పిల్లల్లో కేవలం 15.3 శాతం మందికే సరిపడా ఆహారం అందుతోంది. ఇది భవిష్యత్తులో పోషకాహార లోపం, బలహీన రోగనిరోధక శక్తి, దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలకు దారితీయవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఆరోగ్యం కోసం ప్రజలపై ఆర్థిక భారం
దేశంలో ఆరోగ్య బీమా కవరేజీ పెరిగినప్పటికీ ప్రజల జేబు ఖర్చు మాత్రం తగ్గలేదు. ఆస్పత్రి చేరికల ఖర్చులు కొన్ని బీమా పథకాల కింద కవర్‌ అవుతున్నా.. రోజువారీ వైద్య సేవలు, ఔట్‌పేషెంట్ చికిత్సలకు ప్రజలే ఖర్చు చేయాల్సి వస్తోంది. దీంతో ఆరోగ్య సేవలపై ఆర్థిక భారం కొనసాగుతోంది. ఇక సిజేరియన్ ప్రసవాల సంఖ్య కూడా ఆందోళనకర స్థాయిలో ఉంది. ప్రయివేటు ఆస్పత్రుల్లో 54 శాతానికి పైగా ప్రసవాలు సిజేరియన్ ద్వారా జరుగుతున్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) సూచించిన 10-15 శాతం పరిమితిని మించి ఇది చాలా దూరం వెళ్లిపోయిందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. వైద్య అవసరం లేకున్నా సిజేరియన్‌లు అధికంగా జరుగుతున్నాయన్న ఆందోళనలూ వ్యక్తమవుతున్నాయి.

​లింగ నిష్పత్తి, రక్తహీనత వంటి సూచికలూ లేవు
ఇక ఇదే కాకుండా జనన సమయంలో లింగ నిష్పత్తి, శిశు మరణాలు, రక్తహీనత వంటి కీలక సూచికలు కూడా ఈసారి నివేదికలో లేవు. ప్రభుత్వ ఇతర సర్వేలు ఈ సమాచారం సేకరిస్తున్నప్పటికీ… ఎన్‌ఎఫ్‌హెచ్‌ఎస్ ప్రత్యేకత జిల్లా స్థాయి వివరాలను అందించడం. స్థానిక పరిస్థితులకు అనుగుణంగా విధానాలను రూపొందించడానికి ఈ సమాచారం అత్యంత కీలకం. కానీ వాటికి సంబంధించిన వివరాలు నివేదికలో లేకపోవడంతో వాస్తవ పరిస్థితులు తెలుసుకోవడం క్లిష్టంగా మారిందని నిపుణులు, విశ్లేషకులు అంటున్నారు. గత సర్వేల్లో కీలక సూచికల సంఖ్య దాదాపు 130 వరకు ఉంటే అవి ఇప్పుడు 101కు తగ్గిన విషయాన్ని వారు గుర్తు చేస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -