Tuesday, June 2, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంవర్షాభావ పరిస్థితులకు సిద్ధంగా ఉండండి

వర్షాభావ పరిస్థితులకు సిద్ధంగా ఉండండి

- Advertisement -

న‌దీ జ‌లాల విడుద‌ల‌పై ఎగువ రాష్ట్రాల‌తో స‌మ‌న్వ‌యం చేసుకోవాలి
ప్రొరేటా ప్ర‌కారం డ్యామ్‌ల‌ వారీగా విడుద‌ల‌పై చ‌ర్చించాలి
డ్యామ్‌ల గేట్ల మ‌ర‌మ్మ‌తులు ఇప్పుడే పూర్తి చేయండి : సీఎం రేవంత్ రెడ్డి

నవతెలంగాణ-హైదరాబాద్‌‌బ్యూరో
ఎల్‌నినో ప్ర‌భావంతో వచ్చే వర్షాకాలంలో వర్షాభావ ప‌రిస్థితులు నెల‌కొంటాయ‌ని వాతావార‌ణ శాఖ నివేదిస్తున్నందున కృష్ణా, గోదావ‌రి జ‌లాల్లో రాష్ర్టానికి రావల్సిన నీటి వాటాలు సకాలంలో దక్కేలా చూడాలని ముఖ్య‌మంత్రి ఏ రేవంత్ రెడ్డి అధికారుల్ని ఆదేశించారు. ఎగువ రాష్ట్రాలైన మహారాష్ర్ట, కర్నాటక రాష్ర్టాలు డ్యామ్‌లు నిండిన త‌ర్వాతే నీళ్లు వ‌దిలే విధానాన్ని పాటిస్తే, తెలంగాణకు ఇబ్బందులు ఎదుర‌వుతాయ‌నీ, అందువల్ల అంత‌రాష్ట్ర జ‌లాల్లో ప్రొరేటా ప్ర‌కారం రాష్ర్టానికి రావాల్సిన వాటా జ‌లాలు వ‌చ్చేలా ఆయా రాష్ట్రాల ఉన్నతాధికారుల‌తో ముందుగానే చ‌ర్చించి, దానికి అవసరమైన కార్యాచ‌ర‌ణ రూపొందించాల‌ని నీటిపారుద‌ల శాఖ అధికారుల‌ను ఆదేశించారు. సోమవారంనాడిక్కడి డాక్టర్‌ ‌బీఆర్‌ అంబేద్కర్‌ ‌రాష్ర్ట సచివాలయంలో వివిధ శాఖ‌ల వ‌ర్షాకాల స‌న్న‌ద్ధ‌త‌పై ఆయన ఉన్నతస్థాయి సమీక్ష‍ా సమావేశం నిర్వ‌హించారు. మ‌హారాష్ట్రలోని కోయ‌నా డ్యామ్ నీటిని వంద శాతం జ‌ల విద్యుదుత్ప‌త్తికే ఆ రాష్ట్రం వినియోగిస్తోంద‌నీ, ఆ మొత్తం నీటిని తెలంగాణ తీసుకొని వారికి అవ‌స‌ర‌మైన విద్యుత్ మ‌నం స‌ర‌ఫ‌రా చేసే దానిపై ఆ రాష్ట్ర అధికారుల‌తో చ‌ర్చించాల‌ని సీఎస్ రామ‌కృష్ణారావును సీఎం ఆదేశించారు. గోదావ‌రి న‌ది నుంచి ఏటా స్వల్ప వ్యవధిలో వేల టీఎంసీల జ‌లాలు స‌ముద్రం పాల‌వుతు న్నాయ‌న్నారు. గోదావ‌రి, ప్రాణ‌హిత‌ల వైపు నుంచి వచ్చే వ‌ర‌ద‌ను ఎలా మ‌ళ్లించాల‌నే దానిపై స్ప‌ష్ట‌మైన విధానం రూపొందించాల‌ని సూచించారు. ఉమ్మ‌డి రాష్ట్రంగా ఉన్న‌ప్పుడు నిర్మించిన సీలేరు, తుంగ‌భ‌ద్ర డ్యామ్‌ల నుంచి ఉత్ప‌త్తి అవుతున్న విద్యుత్‌లో తెలంగాణ‌కు రావాల్సిన వాటాపై నివేదిక ఇవ్వాలని విద్యుత్ శాఖ అధికారుల‌ను ఆదేశించారు.

డ్యామ్‌‌గేట్లు మరమ్మతులు పూర్తిచేయండి
రాష్ట్రంలోని అన్ని డ్యామ్‌ల గేట్ల మ‌ర‌మ్మ‌తులు యుద్ధ‌ప్రాతిప‌దిక‌న చేప‌ట్టాల‌ని సీఎం ఆదేశించారు. డ్యామ్‌‌ల నిర్వహణ గురించి అధికారుల‌ను అడిగి తెలుసుకున్నారు. గ‌తంలో క‌డెం ప్రాజెక్టులో త‌లెత్తిన ఇబ్బం దుల‌ను ఈ సందర్భంగా సీఎం గుర్తు చేశారు. గేట్ల మ‌ర‌మ్మ‌తులు, మెయింటెనెన్స్‌కు సంబం ధించి ఇప్ప‌టికే రూ.300 కోట్లు విడుద‌ల చేశామ‌ని ఆర్థిక శాఖ అధికారులు ముఖ్య‌ మంత్రికి తెలిపారు. వచ్చే వ‌ర్షాకాలం లో ఎక్క‌డైనా డ్యామ్‌ల విష‌యంలో ఇబ్బం దులు తలెత్తితే అధికారుల‌పై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుం టామ‌ని ఈ సందర్భంగా హెచ్చ‌రించారు.

పంటమార్పిడిపై రైతులకు అవగాహన కల్పించండి
వాతావ‌ర‌ణ శాఖ అంచ‌నాలు, నివేదిక‌ల ఆధారంగా పంట‌ల సాగుపై నిర్ణ‌యాలు తీసుకోవాల‌ని వ్య‌వ‌సాయ శాఖ అధికారుల‌ను ముఖ్య‌మంత్రి ఎ.రేవంత్ రెడ్డి ఆదేశించారు. పంట‌ల మార్పిడి, పంట‌ల వైవిధ్య‌త‌, త‌క్కువ నీరు వినియోగించుకునే పంట‌లు, వివిధ ర‌కాల సాగుపై రైతుల‌కు రైతు వేదిక‌ల ద్వారా అవ‌గాహ‌న క‌ల్పించాల‌ని సూచించారు. దీనికి అవసరమైతే ఏఐ టెక్నాల‌జీతో రూపొందించిన వీడియోల‌ను ప్ర‌ద‌ర్శిస్తూ, విస్తృత ప్రచారం కల్పించాలని చెప్పారు. రైతులకు అవ‌స‌ర‌మైన విత్త‌నాలు, ఎరువుల స‌ర‌ఫ‌రాలో జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌నీ, రామగుండం ఫ్యాక్ట‌రీ నుంచి ఉత్ప‌త్తి అయ్యే యూరియా మొత్తం తెలంగాణ‌కే కేటాయించేలా కేంద్ర ప్ర‌భుత్వానికి లేఖ రాస్తామ‌ని తెలిపారు.

గతేడాది వరద హామీలు ఏమయ్యాయి
గ‌తేడాది వ‌ర‌ద‌ల స‌మ‌యంలో కామారెడ్డి, ఖ‌మ్మం, వ‌రంగ‌ల్ జిల్లాల్లో తాను క్షేత్ర స్థాయిలో ప‌ర్య‌టించిన స‌మ‌యంలో ఇచ్చిన హామీల అమ‌లుపై అధికారుల‌ను ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి ప్ర‌శ్నించారు. ఆనాటి హామీలు.. వాటి ప్ర‌స్తుత ప‌రిస్థితి.. ఏవైనా నెర‌వేర‌కుంటే అందుకుగల కార‌ణాల‌తో సంపూర్ణ నివేదిక ఇవ్వాలని అధికారుల్ని ఆదేశించారు. హామీల అమ‌లులో నిర్ల‌క్ష్యంగా వ్య‌వ‌హ‌రించిన అధికా రుల‌పై క్ర‌మ‌శిక్ష‌ణా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని చెప్పారు. విపత్తుల సమయంలో ప్రాణ, ఆస్తి, పశు నష్టం వాటిల్లినప్పుడు అధికారులు తక్షణం స్పందించి, ఎఫ్ఐఆర్‌లు న‌మోదు చేసి బాధిత కుటుంబాల‌కు ప‌రిహారం అందేలా చూడాల‌న్నారు. వ‌ర‌ద‌ల స‌మ‌యంలో దెబ్బ‌ తిన్న రోడ్లకు మ‌ర‌మ్మ‌తులు, కూలిన వంతెన‌ల స్థానంలో నూత‌న వంతెన‌ల నిర్మాణం, ఇత‌ర ప‌నుల‌కు విప‌త్తు నిర్వ‌హ‌ణ శాఖ వ‌ద్ద ఉన్న రూ.వెయ్యి కోట్ల‌ నిధులను నిబంధ‌న‌ల ప్ర‌కారం ఖర్చు చేయాల‌ని చెప్పారు.

వాటర్‌ ‌హార్వెస్టింగ్స్‌ ఏమయ్యాయి…
వ‌ర్షాకాలంలో క్యూర్ ప‌రిధిలోని మూడు మున్సిప‌ల్ కార్పొరేష‌న్ల ప‌రిధిలో రోడ్ల‌పై వ‌ర‌ద నీరు నిల‌వ‌కుండా జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌ని సీఎం అధికారులకు సూచించారు. నీరు నిలిచే 141 ప్ర‌దేశాల‌ను గుర్తించి వాట‌ర్ హార్వెస్టింగ్ వెల్స్ నిర్మించాల‌ని గ‌తంలో నిర్ణ‌యించామ‌ని, వాటి పురోగ‌తి ఏమైందని ప్రశ్నించారు. ఇప్ప‌టికే 11 వాట‌ర్ హార్వెస్టింగ్ వెల్స్ పూర్తి చేశామ‌నీ, మిగ‌తా వాటి ప‌నులు కొన‌సా గుతున్నాయ‌ని అధికారులు తెలిపారు. వాటిని యుద్ధ‌ప్రాతిపదిక‌న చేప‌ట్టాల‌నీ, పనుల పురో గ‌తిని పైస్థాయిలో ఎప్ప‌టిక‌ప్పుడు స‌మీక్షిం చాల‌ని ఆదేశించారు. వ‌ర్షాకాలంలో న‌గ‌రంలో స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి ముగ్గురు మున్సిపల్‌ క‌మిష‌న‌ర్లు, మూడు న‌గ‌రాల పోలీస్ క‌మిష‌ న‌ర్లు స‌మ‌న్వ‌యంతో ‌పనిచేయాలని చెప్పారు.

తాగునీటి ఇబ్బందులు రావద్దు
వ‌ర్షాభావ ప‌రిస్థితులు నెల‌కొన్నా, హైద‌రాబాద్ న‌గ‌రంతో పాటు రాష్ట్రంలోని ఏ ప్రాంతాలోనూ తాగు నీటి ఇబ్బందులు త‌లెత్త‌కుండా ఇప్ప‌టి నుంచే కార్యాచ‌ర‌ణ ప్ర‌ణాళికలు రూపొందించుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారుల‌ను ఆదేశించారు. తాగు నీరు, విద్యుదుత్ప‌త్తి, పారిశ్రామిక అవ‌స‌రాల‌కు నీటి కేటాయింపులను ఎప్పటికప్పుడు సమీక్ష‍ించాలని చెప్పారు. విద్యుత్ శాఖ వ‌ర్షాకాలానికి అవ‌స‌ర‌మైన సామ‌గ్రిని ముందుగానే స‌మీక‌రించుకోవాల‌నీ, గాలిదు మారాలు, భారీ వ‌ర్షాల‌తో ట్రాన్స్‌ఫార్మ‌ర్లు దెబ్బ‌తిన్న్ప‌పుడు, లైన్లు తెగిపోయి స‌ర‌ఫ‌రా నిలిచినప్పుడు త‌క్ష‌ణ‌మే స్పందించి మ‌ర‌మ్మ‌తులు పూర్తి చేసి స‌ర‌ఫ‌రాను పున‌రుద్ధ‌రించాల‌ని ఆదేశించారు. జిల్లాల స్థాయిలో క‌లెక్ట‌ర్లు, ఎస్పీలు నిర్ణీత స‌మ‌యంలో భేటీ అవుతూ, పరిస్థితులను సమన్వయం చేసుకుంటూ ఉండాల‌ని సీఎం ఆదేశించారు. స‌మీక్ష‌లో ఎంపీ వేం న‌రేంద‌ర్ రెడ్డి, డీజీపీ సి.వి.ఆనంద్‌, వివిధ శాఖ‌ల ఉన్న‌తాధికారులు సందీప్ కుమార్ సుల్తానియా, వికాస్ రాజ్‌, దాన కిశోర్‌, టి.కె.శ్రీ‌దేవి, ఏ.వి.రంగ‌నాధ్‌, న‌వీన్ మిట్ట‌ల్‌, సురేంద్ర మోహ‌న్‌, క్రిస్టినా జోంగ్తూ, హైద‌రాబాద్‌, సైబ‌రాబాద్‌, మ‌ల్కాజిగిరి క‌మిష‌న‌ర్లు ఆర్‌.వి.క‌ర్ణ‌న్‌, సృజ‌న‌, విన‌య్ కృష్ణారెడ్డి త‌దిత‌రులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -