బేసిక్ వేతనంపై 1.5 శాతం ప్రతిపాదనను పునఃపరిశీలించాలి
ఉద్యోగి వాటాను కుటుంబ సభ్యుల ఆధారంగా నిర్ణయించాలి
జాయింట్ స్టాప్ కౌన్సిల్ సమావేశంలో డిప్యూటీ కలెక్టర్ల సంఘం అధ్యక్షులు వి లచ్చిరెడ్డి ప్రతిపాదనలు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
ప్రభుత్వం ఉద్యోగుల ఆరోగ్య సంరక్షణ ట్రస్ట్‌ను ఏర్పాటు చేయాలనే నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని తెలంగాణ ఉద్యోగుల జేఏసీ చైర్మెన్, డిప్యూటీ కలెక్టర్ల సంఘం అధ్యక్షులు వి లచ్చిరెడ్డి, సెక్రెటరీ జనరల్ వొడ్నాల రాజశేఖర్ తెలిపారు. ఈ పథకం పారదర్శకంగా, సమానంగా, ఆర్థికంగా నిలకడగా, ఉద్యోగి-స్నేహ పూర్వకంగా ఉండేందుకు తోడ్పడుతుందని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య పథకం (సీజీహెచ్ఎస్) తరహాలో ఈహెచ్ఎస్‌ను సైతం పునర్య్వస్థీకరించాలని సూచించారు. ఈ పథకానికి సంబంధించిన వివరాలపై పూర్తి అవగాహన కల్పించిన తర్వాతే ఉద్యోగుల సమ్మతి తీసుకుని హెల్త్ కార్డులు జారీ చేయాలని కోరారు. బేసిక్ వేతనంపై 1.5 శాతం కోత విధించే ప్రతిపాదనను పునఃపరిశీలించాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం సోమవారం డాక్టర్ బీ..ఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె రామకృష్ణారావు అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశంలో గుర్తింపు పొందిన 15 ఉద్యోగ సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ ఉద్యోగుల జేఏసీ అధ్యక్షులు వి లచ్చిరెడ్డి, సెక్రెటరీ జనరల్ వొడ్నాల రాజశేఖర్ మాట్లాడుతూ ఉద్యోగుల ఆరోగ్య పథకం ఎలా ఉంటే ఉద్యోగులకు, వారి కుటుంబ సభ్యులకు సౌకర్యంగా, అందుబాటులో ఉంటుందో పలు ప్రతిపాదనలను అధికారుల దృష్టికి తెచ్చారు. పారదర్శకత – ఉద్యోగుల సమ్మతి అవసరమని సూచించారు. ఉద్యోగులను ఈహెచ్ఎస్‌లో చేర్చే ముందు ప్రభుత్వం పూర్తి మార్గదర్శకాలు, అమలు విధానాలను అందుబాటులో ఉంచాలని కోరారు. ఎంపానెల్ చేసిన ఆస్పత్రుల జాబితా, అందుబాటులో ఉన్న ప్రత్యేక వైద్య సేవల వివరాలను ప్రకటించాలని తెలిపారు.
ఈహెచ్ఎస్ కింద ఆమోదిం చబడిన చికిత్సల ప్యాకేజీల వివరాలను వెల్లడించాలని పేర్కొన్నారు. ఇన్‌పేషెంట్, ఔట్‌పేషెంట్ సేవల పరిధి గురించి సంపూర్ణ వివరాలుండాలని తెలిపారు. లబ్ధిదారుల హక్కులు, బాధ్యతలకు సంబంధించిన సమాచారం ఇవ్వాలని పేర్కొన్నారు. ఉద్యోగి వాటా (చందా), ప్రభుత్వ వాటా సమానంగా నేరుగా (ఎంప్లాయి హెల్త్ కేర్ ట్రస్ట్) ఖాతాలో జమ చేయాలని కోరారు. సీజీహెచ్ఎస్ తరహాలో మూడు-స్థాయిల వాటా(చందా) విధానం ఉండాలని సూచించారు. ఎంపిక చేసిన స్థాయికి అనుగుణంగా మెరుగైన వార్డు, ఇతర ప్రయోజనాలు పొందొచ్చని తెలిపారు. ఈ విధానం ఉద్యోగులకు ఎంపిక స్వేచ్ఛ, అందుబాటు ఖర్చు, సీజీహెచ్ఎస్ ప్రమాణాలకు అనుగుణం గా ఉంటుందని వివరించారు. ప్రస్తుత 1.5 శాతం వాటా విధానంపై పునఃపరిశీలన చేయాలని కోరారు. ఉద్యోగి వాటాను కేవలం బేసిక్ పేకు అనుసంధా నించకుండా కుటుంబ సభ్యుల సంఖ్య ఆధారంగా నిర్ణయించాలని సూచించారు. ప్రతి కుటుంబ సభ్యుడి కోసం వాటా వసూలు చేస్తున్నట్లయితే, ఆధారపడిన పిల్లలకు వయస్సు పరిమితితో సంబంధం లేకుండా హెల్త్ కార్డ్ ప్రయోజనాలు కొనసాగించాలని తెలిపారు. ఉద్యోగుల ఆరోగ్య పథకంలో ప్రీమియం కుటుంబంలో ఉన్న లబ్ధిదారుల సంఖ్య ఆధారంగా నిర్ణయించాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ కలెక్టర్ల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణ, తెలంగాణ తహసీల్దార్స్ అసోసియేషన్(టీజీటీఏ) రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు ఎస్ రాములు, రమేష్ పాక, తపస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తెల్కలపల్లి పెంటయ్య తదితరులు పాల్గొన్నారు.



