Saturday, June 6, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలుకోట్ల విలువైన ప్రభుత్వ భూముల్లో పేదలకు ఇందిరమ్మ ఇండ్లు

కోట్ల విలువైన ప్రభుత్వ భూముల్లో పేదలకు ఇందిరమ్మ ఇండ్లు

- Advertisement -

ఆ స్థలాల్లో మహిళలకు వాటా కల్పిస్తాం : మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
పేదల జీవనోపాధికి ఏ మాత్రం ఇబ్బంది లేకుండా నియోజక వర్గాన్ని యూనిట్ గా తీసుకొని క్యూర్ పరిధిలో పేదలు నివాసముంటున్న ప్రాంతాలకు సమీపంలోనే అల్పదాయ (ఎల్ఐజీ), మధ్యతరగతి వర్గాలకు (ఎంఐజీ) లక్ష ఇండ్లు నిర్మించబోతున్నామని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి తెలిపారు. కోట్ల రూపాయల విలువ చేసే ప్రభుత్వ స్థలాల్లో లక్ష ఇండ్లను నిర్మించి ఆ స్థలంలో వారి వాటాకు యజమానిని చేస్తూ పేదింటి ఆడబిడ్డలకు ఇవ్వబోతున్నామని ప్రకటించారు. క్యూర్ పరిధిలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంపై శుక్రవారం హైదరాబాద్ సచివాలయంలోని తన కార్యాలయంలో అధికారులతో సమీక్షించారు. 2026-27 ఆర్థిక సంవత్సరానికి క్యూర్ పరిధిలో లక్ష ఇండ్లకు, ఇతర ప్రాంతాల్లో 2.50 లక్షలు, మొత్తం 3.50 లక్షల ఇండ్లకు ఇప్పటికే పరరిపాలనపరమైన అనుమతులు ఇచ్చినట్టు తెలిపారు. దీనిని దృష్టిలో పెట్టుకొని అవసరమైన కార్యాచరణను రూపొందించాలని అధికారులను ఆదేశించారు. గత ప్రభుత్వం పేదల జీవన పరిస్థితులను, వారి ఉపాధి అవసరాలను ఏ మాత్రం పట్టించుకోకుండా హైదరాబాద్ నగరానికి 30-40 కిలోమీటర్ల దూరంలో అరకొరగా డబుల్ బెడ్‌రూమ్ ఇండ్లను నిర్మించిందని మంత్రి విమర్శించారు. ఇల్లు అనేది పేద కుటుంబానికి ఎంత అవసరమో, వారి జీవనోపాధి కూడా అంతే ముఖ్యమనే విషయాన్ని గత పాలకులు విస్మరించారని తప్పుపట్టారు.

రోజువారీ కూలి పనులు, చిన్న వ్యాపారాలు, ఉపాధి అవకాశాలపై ఆధారపడే పేద కుటుంబాలు నగర శివార్లలో నిర్మించిన ఇళ్లకు వెళ్లలేకపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఉపాధి దూరమవడంతో పాటు పిల్లల విద్య, వైద్య సదుపాయాలు, రవాణా వంటి సమస్యలు ఎదురవడంతో అనేక కుటుంబాలు ఆ ఇళ్లలో నివసించడానికి ఆసక్తి చూపలేదని వివరించారు. ఫలితంగా ఆ గృహాలు ఖాళీగా, నిరుపయోగంగా మిగిలిపోయాయని చెప్పారు. ఇలాంటి తప్పిదాలను పునరావృతం చేయకుండా పేదలు ప్రస్తుతం నివసిస్తున్న ప్రాంతాల్లోనే గౌరవప్రదమైన జీవితం గడిపేలా ఇండ్ల నిర్మాణాన్ని చేపట్టబోతున్నామని స్పష్టం చేశారు. ఈ దిశగా విలువైన ప్రభుత్వ భూములను పేదల సంక్షేమం కోసం వినియోగిస్తూ లక్ష ఇండ్ల నిర్మాణ కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతున్నామని మంత్రి వెల్లడించారు. ముఖ్యంగా పేద కుటుంబాల మహిళలకు సొంతింటిపై హక్కు కల్పించడం ద్వారా వారి ఆర్థిక, సామాజిక భద్రతను మరింత బలోపేతం చేయనున్నట్టు మంత్రి తెలిపారు. సొంత ఇల్లు మహిళ సాధికారతకు, కుటుంబ స్థిరత్వానికి, భవిష్యత్ తరాల అభివృద్ధికి బలమైన పునాది అవుతుందన్నారు. పేదల అవసరాలను దృష్టిలో పెట్టుకొని వారికి సౌకర్యవంతంగా ఉండేలా ఇండ్ల డిజైన్ లను రూపొందించాలనీ, ఇంటి నిర్మాణం కనీసం 400 చదరపు అడుగుల విస్తీర్ణం ఉండేలా ప్లాన్ చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో హౌసింగ్ సెక్రెటరీ వి.పి. గౌతమ్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -